కాలంలో నిలిచిన బాల్యోత్సాహం!

ABN , First Publish Date - 2021-09-04T05:58:44+05:30 IST

‘ఒక క్రికెట్ అభిమాని తన పన్నెండేళ్ళ వయస్సులోని కళ్ళతో చూసిన క్రికెటర్ల వంటి క్రికెటర్లు అతడికి మరెక్కడా మరెన్నడూ కనిపించరని’ విజ్ఞుడు ఒకరు అన్నారు. పన్నెండేళ్ళ వయసులో చదివిన, విన్న క్రికెటర్ల గురించి కూడా అది అంతే సత్యం.....

కాలంలో నిలిచిన బాల్యోత్సాహం!

‘ఒక క్రికెట్ అభిమాని తన పన్నెండేళ్ళ వయస్సులోని కళ్ళతో చూసిన క్రికెటర్ల వంటి క్రికెటర్లు అతడికి మరెక్కడా మరెన్నడూ కనిపించరని’ విజ్ఞుడు ఒకరు అన్నారు. పన్నెండేళ్ళ వయసులో చదివిన, విన్న క్రికెటర్ల గురించి కూడా అది అంతే సత్యం. 1971 ఏప్రిల్ చివరివారంలో నేను నా 13వ సంవత్సరంలోకి ప్రవేశించాను. అదే ఏడాది ఇంగ్లండ్‌లో టీమ్ ఇండియా చరిత్రాత్మక విజయం సాధించినప్పుడునా హృదయంలో నేను ఇంకా పన్నెండేళ్ల బాలుడినే. యాభై సంవత్సరాల అనంతరం ఆ టెస్ట్ సిరీస్ గురించిన తలపోతలతో ఈ వ్యాసం రాస్తున్నప్పుడూ నేను పన్నెండేళ్ల బాలుడినేనని భావిస్తున్నాను.


భారత్ వెలుపల నాకు సుపరిచితమైన నగరం లండన్. అక్కడ నాకు బాగా తెలిసిన ప్రదేశం బ్రిటిష్ లైబ్రరీ. ఆ మహాగ్రంథాలయంలో వలసపాలన కాలం నాటి భారత్ చరిత్రకు సంబంధించిన విస్తృత గ్రంథాలు, చారిత్రక పత్రాల సంచయాన్ని గత మూడు దశాబ్దాలకు పైగా నా పరిశోధనలకు ఉపయోగించుకుంటూ వస్తున్నాను. మొత్తం మీద కనీసం 1000 రోజుల పాటు ఆ పుస్తక భాండాగారంలో నా అధ్యయన కృషి జరిగిఉంటుంది. ఆ లైబ్రరీని సందర్శించిన ప్రతిసారీ నా దినచర్య ఒకేవిధంగా ఉంటుంది. తొలుత నా వ్యక్తిగత సామానులను లైబ్రరీ నేలమాళిగ (బేస్‌మెంట్) లోని లాకర్‌లో భద్రపరిచి, నాలుగు అంతస్తుల పైన ఉన్న రీడింగ్ రూంకు వెళతాను. చెప్పవలసిన విశేషమేమిటంటే బేస్‌మెంట్ లోని లాకర్లను తెరవాలన్నా, మూసివేయాలన్నా, వాటిని ఉపయోగించుకునే ప్రతి సందర్శకుడికీ ప్రత్యేకమైన నాలుగు అంకెల కోడ్ ఒకటి ఉంటుంది. చాలామంది సాధారణంగా తాము పుట్టిన లేదా తమ వివాహ సంవత్సరాన్నో లేక తమ తల్లిదండ్రులలో ఒకరు పుట్టిన సంవత్సరాన్నో కోడ్‌గా ఉపయోగించుకోవడానికి ఎంపిక చేసుకుంటారు. 


దశాబ్దాలుగా బ్రిటిష్ లైబ్రరీని సందర్శించిన ప్రతిసారి నేను ఒకే సంవత్సరం సంఖ్యను లాకర్ కోడ్‌గా ఉపయోగించుకుంటున్నాను. అది 1971. ఆ ఏడాది నా వయస్సు 13 సంవత్సరాలు. నా వివాహం అప్పటికి ఇంకా 13 సంవత్సరాల భవిష్యత్తులో ఉంది. అయితే ఈ కల్పిత అనురూపత కోసం నేను నా లాకర్ కోడ్‌ను ఎంపిక చేసుకోలేదు సుమా! భారతీయ క్రికెట్‌చరిత్రలో అదొక మరపురాని సంవత్సరం. ఒకప్పుడు బ్రిటిష్ సామ్రాజ్యంలో పాలితులుగా కునారిల్లిన మనం, మన మాజీదొరలపై క్రికెట్ ఆటలో విజయం సాధించి, వారికి గర్వభంగం కలిగించిన చరిత్రాత్మక సంవత్సరం 1971. నా వృత్తి, ప్రవృత్తినీ అద్వితీయంగా సంకేతించిన సంఖ్య అది. 


ఇంగ్లాండ్‌లో భారత్ సాధించిన ప్రప్రథమ టెస్ట్‌సిరీస్ విజయం 50వ వార్షికోత్సవాన్ని కొద్దిరోజుల క్రితం మనం ఘనంగా నిర్వహించుకున్నాం. ఆ స్ఫూర్తిదాయక సంఘటనే ఈ వ్యాసానికి ప్రేరణ. మరో ముఖ్యమైన విషయమేమిటంటే 1971 తొలిరోజులలో వెస్టిండీస్‌లో కూడా భారత్ ప్రప్రథమంగా టెస్ట్‌సిరీస్ విజయాన్ని సాధించింది. ఆ గెలుపు కూడా ఒక అవిస్మరణీయమైన చరిత్రే. టీమ్‌ ఇండియా అప్పటికి చివరిసారి 1962లో కరీబీయన్ దీవులలో పర్యటించింది. ఐదు టెస్ట్‌లలోనూ ఓడిపోయింది. తొమ్మిది సంవత్సరాల అనంతరం మరొకసారి ఆ దీవులలో పర్యటించే నాటికి గ్యారీ సోబర్స్ ఇంకా వెస్టిండీస్ టీమ్ కెప్టెన్‌గా ఉన్నారు. క్రికెటింగ్ సవ్యసాచులు కన్హాయి, లాయడ్, గిబ్స్ తదితరులు ఆయనకు సహచర ఆటగాళ్లు. ఆ క్రికెట్ దిగ్గజాల ధాటిని, అందునా వారి సొంతగడ్డపై, ఎదుర్కొని టీమ్‌ఇండియా విజయం సాధించగలదని ఎవరూ ఊహించలేదు. ఇండియా గెలుపు అనే భావనే ఎవరికీ ఏ కోశానా లేని కాలమది. అయితే మనం గెలిచాం. చరిత్ర సృష్టించాం. 


వెస్టిండీస్‌లో ఆ టెస్ట్ సిరీస్‌ను 1971 ఫిబ్రవరి-ఏప్రిల్ మాసాల మధ్య ఆడారు. నేనప్పుడు డెహ్రాడూన్‌లో ఒక బోర్డింగ్‌స్కూల్‌లో విద్యార్థిని. ఒక ప్రముఖ జాతీయ దినపత్రిక స్పోర్ట్స్ పేజీలలో ఆ టెస్ట్‌సిరీస్ విశేషాల గురించి క్రమం తప్పకుండా చదువుతుండేవాణ్ణి. ఆ మ్యాచ్‌ల గురించిన వార్తా కథనాల రచయిత కె.ఎన్. ప్రభు. ప్రతిభావంతుడైన రచయిత. అందమైన రచనాశైలి, క్రికెట్ ఆటపై సమగ్ర అవగాహన కలగలిసి ఆయన వార్తాకథనాలకు ఒక ఉత్తేజకరమైన, శోభాయమానమైన వన్నెను సంతరించాయి. మా హాస్టల్‌లో వందమందికి పైగా ఉండేవాళ్లం. అందరికీ కలిపి ఒకే ఒక్క దినపత్రిక అందు బాటులో ఉండేది. మధ్యాహ్నభోజనం అయిన తరువాత, గేమ్స్ పీరియడ్‌కు ఇంకా ఒక గంట వ్యవధి ఉన్నప్పుడు, నేను ఆ పత్రికాపఠనంలో నిమగ్నమయే వాణ్ణి. ప్రభు వార్తాకథనాలు బహు ఆసక్తికరంగా ఉండేవి. ఇప్పటి మాదిరే అప్పుడు కూడా వెస్టిండీస్‌లో టెస్ట్‌మ్యాచ్‌లు మన కాలమానం ప్రకారం సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభమయ్యేవి. మ్యాచ్‌ల ఆడిన రెండు రోజుల తరువాత మాత్రమే వాటి వార్తావిశేషాలు మాకు అందుబాటులో ఉన్న పత్రికలో వెలువడేవి. జాప్యం అయితేనేం వాటి పఠనం నన్ను మంత్రముగ్ధుడిని చేసేది. ప్రభు కథనాలు సవివరంగా ఉండి ఆయా క్రీడాకారుల ప్రతిభాపాటవాల గురించి విశదపరిచేవి.


ఈ తరం క్రికెట్ అభిమానులు ఎక్కడెక్కడి టెస్ట్‌మ్యాచ్‌లను తక్షణమే, ప్రత్యక్షంగా వీక్షించగలుగుతున్నారు. మహదానందం పొందుతున్నారు. అయితే వారి అనుభూతులు మరపురానివిధంగా మిగిలిపోతున్నాయా? ప్రశ్నార్థకమే. నేను క్రికెట్‌ను అనుభూతించడం ప్రారంభమైన రోజులను ఎప్పటికీ మరచిపోలేను. గవాస్కర్, సర్దేశాయి బ్యాటింగ్; బేడి, ప్రసన్న, వెంకటరాఘవన్ బౌలింగ్; వాడేకర్ నేతృత్వంలోని టీమ్‌ఇండియా యాభై సంవత్సరాల క్రితం వెస్టిండీస్‌లో ఆడిన అనితరసాధ్యమైన ఆటను ఇప్పటి తరం వారివలే నేనూ ప్రత్యక్షంగా వీక్షించి ఉంటే అవి నన్నంత ప్రగాఢంగా ప్రభావితం చేసిఉండేవి కావని, అనుభూతుల పులకరింపులు మిగిల్చేవి కావని నేను భావిస్తున్నాను. 


1971 వేసవిలో టీమ్‌ఇండియా ఇంగ్లండ్‌లో పర్యటించింది. అంతకుముందు అదే ఏడాది వసంతకాలంలో వెస్టిండీస్‌లో అనూహ్య విజయంతో ప్రపంచ క్రికెట్ అభిమానులను అలరించి, అభినందనలు పొందినప్పటికీ ఇంగ్లాండ్‌లో మన క్రికెటింగ్ ప్రతిభ మెరుపుల మరకలు ఉపేక్షింపబడుతూనే ఉన్నాయి. అప్పటికీ నలభై సంవత్సరాలుగా మన జట్టు ఎంతగా ప్రయత్నించిన్పటికీ ఇంగ్లండ్‌లో విజయాన్ని అందుకోలేకపోయాయి. 1959, 1967 సంవత్సరాలలో అక్కడ ఆడిన మ్యాచ్‌ల అన్నిటిలోనూ భారత్‌ ఓడిపోయింది. 


ఇంగ్లండ్‌లో టెస్ట్‌సిరీస్ ప్రారంభమయ్యేనాటికి మాకు వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. నేను మా ఇంటిలో రేడియో ద్వారా ఇంగ్లాండ్–-పాకిస్థాన్ టెస్ట్‌సిరీస్‌లో చివరి మ్యాచ్‌ల గురించి విన్నాను. ఇంటి వద్ద ఉన్నప్పుడే లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌, భారత్‌ల మధ్య మొదటి టెస్ట్‌మ్యాచ్‌లో ప్రతి బాల్ బౌలింగ్ చేసిన వినూత్నవైనాన్ని, బ్యాటింగ్ తాకిడికి అది ప్రదర్శించిన విన్యాసాలను విన్నాను. వీక్షకులను కట్టిపడేసిన టెస్ట్‌మ్యాచ్ అది. తుదకంటా అనుక్షణం ఉత్కంఠభరితంగా సాగిన క్రికెట్‌ పోరు అది.


మాంచెస్టర్‌లో ఆడిన రెండోటెస్ట్‌పై వ్యాఖ్యానాన్ని కూడా ఇంటి వద్దే రేడియోలో విన్నాను. ఓవల్‌లో మూడోటెస్ట్ ప్రారంభమయ్యేనాటికి మా పాఠశాల పునః ప్రారంభమయింది. నేను మళ్ళీ మా హాస్టల్‌కు వెళ్ళాను. అక్కడ ఒకే ఒక్క రేడియో ఉంది. అది మా సీనియర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. వారు ప్రతి సాయంత్రం రేడియోలో ఆ టెస్ట్‌మ్యాచ్‌ల గురించి వింటుండేవారు. జూనియర్ల మైన మేము విధిలేక మా గదుల్లో చదువుకుంటుండే వాళ్ళం. అయితే మా హౌస్‌కెప్టెన్ వివేక్ బామ్మి సంబంధిత న్యూస్‌బులెటిన్ వివరాలను ఎప్పటికప్పుడు మాకు చెబుతుండేవాడు. అలా ఒకరోజు రాత్రి మేము నిద్రపోవడానికి ఉపక్రమిస్తున్న తరుణంలో వివేక్ నా వద్దకు వచ్చి వచ్చి ఇంగ్లాండ్‌లో టెస్ట్‌మ్యాచ్ తాజాస్కోర్ గురించి చెప్పాడు: ‘ఇంగ్లాండ్ 101 ఆల్ ఔట్. చంద్రశేఖర్ 38 పరుగులకు ఆరువికెట్లు తీసుకున్నాడంటూ’. ఆయన మహోత్సాహంతో, అంతకుమించిన ఉద్వేగంతో చెప్పాడు. యాభై సంవత్సరాల తరువాత కూడ ఆనాటి వివేక్ మాటలు నా చెవుల్లో గింగురుమంటూనే ఉన్నాయి. ఆ ఉత్తేజకరమైన క్రికెటింగ్ క్షణాలు నా మనస్సులో మధురస్మృతుల్లా నిలిచిపోయాయి. 


అద్భుతమైన సాయంత్రం చంద్రశేఖర్ ఆరు వికెట్లు తీసుకున్న ప్రతిభావిన్యాసాల దృశ్యాలను నాటి టీవీ కెమెరాలు అద్భుతంగా నిక్షిప్తం చేశాయి. తదనంతరకాలంలో వాటిని నేను లెక్కలేనన్నిసార్లు చూశాను, సరిగ్గా బ్యాట్స్ మన్ ముందు నేలకు తాకేట్టు బంతిని విసిరే జాన్ ఎడ్రిచ్, బౌలింగ్‌లో అసమానప్రతిభావంతులైన ఇల్లింగ్ వర్త్, స్నో, ఫ్లెచ్చర్‌లను మన ఆటగాళ్లు ఎదుర్కొన్న తీరుతెన్నులను ఎన్ని విశేషణాలతోనైనా అభివర్ణించవచ్చు. బ్రియాన్ లఖర్శ్ కొట్టిన బంతిని వెంకటరాఘవన్ క్యాచ్ చేసిన తీరును నేనప్పటికీ మరచిపోలేను. అందరిలోనూ చంద్రశేఖర్ ప్రదర్శించిన ఆట తీరు అద్భుతమైనది. జట్టు విజయానికి ఆయన విశేషంగా తోడ్పడ్డారనడంలో సందేహం లేదు. 


‘ఒక క్రికెట్ అభిమాని తన పన్నెండేళ్ళ వయస్సులోని కళ్ళతో చూసిన క్రికెటర్ల వంటి క్రికెటర్లు అతడికి మరెక్కడా మరెన్నడూ కనిపించరని’ ఇయాన్ పీబుల్స్ అనే విజ్ఞుడు ఒకసారి రాశాడు. పన్నెండేళ్ళ వయసులో చదివిన, విన్న క్రికెటర్ల గురించి కూడా అది అంతే సత్యం. 1971 ఏప్రిల్ చివరి వారంలో అంటే వెస్టిండీస్ టెస్ట్‌సిరీస్ ముగిసిన కొద్దిరోజులకు నేను నా 13వ సంవత్సరంలోకి ప్రవేశించాను. అదే ఏడాది ఇంగ్లాండ్‌లో టీమ్ ఇండియా చరిత్రాత్మక విజయం సాధించినప్పుడు నా హృదయంలో నేను ఇంకా పన్నెండేళ్ల బాలుడినే. యాభై సంవత్సరాల అనంతరం ఆ రెండు టెస్ట్‌సిరీస్‌ల గురించిన తలపోతలతో ఈ వ్యాసం రాస్తున్నప్పుడు కూడా నేను పన్నెండేళ్ల బాలుడినేనని భావిస్తున్నాను.


సరే, ఇప్పుడు మళ్ళీ ఇండియా-–ఇంగ్లాండ్ టెస్ట్‌సిరీస్ కొనసాగుతోంది. ఈ సిరీస్‌లో మన టీమ్‌ఇండియా గెలిచి, పటౌడీ ట్రోఫీని నిలబెట్టుకున్నప్పటికీ ‘2021’ అనే అంకె, నేడు నవయవ్వనప్రాయంలో ఉన్న క్రికెట్ అభిమాని మనస్సులో అజరామర అనుభూతులు, పులకరింపులకు కారణమవుతుందా? సందేహమే. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌తో నేటి తరంవారు మమేకమైన తీరే అందుకు ఒక విధంగా కారణమని చెప్పవచ్చు. దాంతోపాటు మనజట్టు తరచు టెస్ట్‌సిరీస్‌లో విజయాలు సాధిస్తోంది. ఏ ఒక్క విజయాన్ని నిజంగా ప్రత్యేకమైనదిగా, విశిష్టమైనదిగా భావించలేము. అయితే నా తరంలో క్రికెట్ అభిమానులకు ‘1971’ అనే అంకె ప్రత్యేకమైనది. అంతేకాదు పవిత్రమైనది కూడా. అద్భుతమైన అనుభూతులను అది ఇప్పటికీ పురిగొల్పుతోంది. ఆ ఏడాది వెస్టిండీస్, ఇంగ్లాండ్‌లలో జరిగిన టెస్ట్‌సిరీస్‌లలో టీమ్‌ఇండియా ప్రప్రథమంగా విజయం సాధించడమే మరపురాని సంవేదనలకు ప్రధానకారణం.


రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Updated Date - 2021-09-04T05:58:44+05:30 IST