స్వామినాథన్‌ సృజించిన ‘గాంధీ జ్ఞాననిధి’

ABN , First Publish Date - 2021-12-04T06:25:33+05:30 IST

గాంధీజీ మొత్తం మూడు పుస్తకాలు, అనేక కరపత్రాలు, డజన్ల సంఖ్యలో పిటీషన్లు, వందల సంఖ్యలో పత్రికా వ్యాసాలు, వేల సంఖ్యలో ఉత్తరాలు రాశారు. ఈ రచనావళిని 90కి పైగా సంపుటాలలో కాలక్రమానుగతంగా....

స్వామినాథన్‌ సృజించిన ‘గాంధీ జ్ఞాననిధి’

గాంధీజీ మొత్తం మూడు పుస్తకాలు, అనేక కరపత్రాలు, డజన్ల సంఖ్యలో పిటీషన్లు, వందల సంఖ్యలో పత్రికా వ్యాసాలు, వేల సంఖ్యలో ఉత్తరాలు రాశారు. ఈ రచనావళిని 90కి పైగా సంపుటాలలో కాలక్రమానుగతంగా సంకలనం చేసి, వాటికి వివరణలు సమకూర్చిన అద్భుత మేధోకృషి కె. స్వామినాథన్ నేతృత్వంలో జరిగింది. సమష్టి విద్వత్‌కృషికి గాంధీ‘కలెక్టెడ్ వర్క్స్’ ఒక ఉత్కృష్ట ఉదాహరణ. ఇంకా జన్మించని విద్వజ్ఞులు, భారతీయేతర జాతుల ప్రాజ్ఞులు స్వామినాథన్‌కు కృతజ్ఞతాబద్ధులయి ఉంటారనడంలో సందేహం లేదు.


నాకుతెలిసిన విశిష్ట వ్యక్తులలో కె. స్వామినాథన్ ఒకరు. ఆంగ్లభాషా సాహిత్య విశారదుడైన స్వామినాథన్ ‘కలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ మహాత్మా గాంధీ’కి ప్రధాన సంపాదకుడు. 1896 డిసెంబర్ 3న పుదుకోటైలో ఆయన జన్మించారు 1996లో స్వామినాథన్ శత జయంతి సందర్భంగా ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో ఆయన గురించి ఒక పదచిత్రాన్ని రచించాను. ఇప్పుడు ఆ విద్వత్‌పరుని 125వ జయంతి సందర్భంగా ఆయన నేతృత్వంలో పూర్తయిన మహాత్మా గాంధీ రచనా సర్వస్వం ప్రాజెక్ట్ పూర్వాపరాలకు ఈ వ్యాసంలో ప్రాధాన్యమిస్తున్నాను.


గాంధీ హత్యానంతరం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆయన పేరిట ఒక జాతీయ స్మారక నిధిని ఏర్పాటు చేసింది. వివిధ భాషలలోని గాంధీ రచనలను సేకరించి, భద్రపరిచి, ప్రచురించడం ఆ నిధి లక్ష్యాలలో ఒకటి. ‘గాంధీ స్మారక నిధి’గా విఖ్యాతమయిన ఆ నిధిని 1949లో సబర్మతీ ఆశ్రమం సహాయంతో సువ్యవస్థితం చేశారు. ఆంగ్లం, హిందీ, గుజరాతీ భాషలలోని వివిధ సాహిత్య ప్రక్రియలలో సకల అంశాలపై గాంధీ వ్యాసాల సేకరణ వెన్వెంటనే ప్రారంభమైంది మూడు పుస్తకాలు, అనేక కరపత్రాలు, డజన్ల సంఖ్యలో పిటిషన్లు, వందల సంఖ్యలో పత్రికా వ్యాసాలు, వేల సంఖ్యలో ఉత్తరాలు గాంధీజీ రచనావళిలో ఉన్నాయి. ఆయన చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు, అనేకానేక ఉపన్యాసాలు వెలువరించారు.


పైపెచ్చు తన సొంత రచనా ప్రక్రియ నొకదాన్ని సృజించారు. ఇదే ‘మౌన దిన వివరణలు’. ప్రతి సోమవారం ఆయన సంపూర్ణంగా మౌనం పాటించేవారు. సోమవారాల్లో ఆయన వివిధ అంశాలపై తన భావాలు, అభిప్రాయాలు, ఇంకా ఇతర వ్యాఖ్యలను లిఖితపూర్వకంగా మాత్రమే తెలియజేసేవారు. సేకరించిన గాంధీ రచనలను పుస్తక రూపంలో తీసుకురావాలని 1956లో గాంధీ స్మారక్ నిధి నిర్ణయించింది. గాంధీ ‘కలెక్టెడ్ వర్క్స్’ను ప్రచురించేందుకు మొరార్జీ దేశాయి అధ్యక్షతన ఒక సలహాసంఘాన్ని నియమించారు. నవజీవన్ ప్రెస్‌కు ఈ సంఘంలో ప్రాతినిధ్యం కల్పించారు. గాంధీ రచనలపై పూర్తి హక్కులు ఆ ప్రచురణ సంస్థవే కావడం వల్ల దాని ప్రతినిధి ఒకరు సలహాసంఘంలో ఉండడం తప్పనిసరి అయింది. మహాత్మునికి సన్నిహితులయిన పలువురు సాంఘికసేవకులకు, గాంధీ కడగొట్టు కుమారుడు దేవదాస్‌కు కూడా ఆ సలహాసంఘంలో స్థానం కల్పించారు. దేవదాస్ అప్పుడు హిందుస్థాన్ టైమ్స్ ఎడిటర్‌గా ఉన్నారు. అప్పటికే ఆయన మహాత్ముని గురించి ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ నిర్మాణంలో కీలక పాత్ర వహించారు. ఆ తరువాత తన తండ్రి రచనావళిని శాశ్వతంగా పరిరక్షించే కృషికి దేవదాస్ పూనుకున్నారు.


గాంధీ ‘కలెక్టెడ్ వర్క్స్’ ఛీఫ్ ఎడిటర్‌గా మొదట నియమితుడైన విద్వన్మణి భరతన్ కుమారప్ప. ఆయన మతాలు, దర్శనాల పారంగతుడు. ఎడింబరో, లండన్ విశ్వవిద్యాలయాల నుంచి మతం, తత్త్వశాస్త్రంలో రెండు డాక్టొరేట్‌లు పొందిన మేధావి. గ్రామీణ పునర్నిర్మాణ కార్యక్రమాలలో గాంధీజీతో కలిసి ఆయన పాల్గొన్నారు. మహాత్ముని మరణానంతరం ఆయన రచనల నుంచి వివిధ అంశాలపై పలు సంకలనాలను భరతన్ తీసుకువచ్చారు. గాంధీ రచనలకు సంపాదకత్వం వహించేందుకు ఆయన పూర్తిగా అర్హుడు. అయితే కలెక్టెడ్ వర్క్స్ మొదటి సంపుటాన్ని ప్రెస్‌కు పంపించిన అనంతరం 1957 జూన్‌లో ఆయన గుండెపోటుతో మరణించారు. భరతన్ స్థానంలో స్వాతంత్ర్య సమరయోధుడు జైరామ్ దాస్ దౌలత్‌రామ్ బాధ్యతలు చేపట్టారు. ఈ సంపాదకత్వ బాధ్యతలపై ఆయనకు వాస్తవానికి పెద్దగా ఆసక్తి లేదు. 1959లో రాజ్యసభకు ఎన్నికైన అనంతరం దౌలత్‌రామ్ గాంధీ రచనా సర్వస్వం బాధ్యతలను పూర్తిగా విడిచిపెట్టారు. ఆయన స్థానంలో వినోబాభావే సూచన మేరకు గాంధీ ‘కలెక్టడ్ వర్క్స్’ ప్రధాన సంపాదకుడుగా కె. స్వామినాథన్ నియమితులయ్యారు. 


63 సంవత్సరాల వయసులో కొత్త బాధ్యతల నిర్వహణకు స్వామినాథన్ న్యూఢిల్లీకి వచ్చే నాటికే ఆంగ్ల భాషా సాహిత్యాల ఆచార్యుడుగా ఆయన సుప్రసిద్ధుడు. విద్యా శిక్షణ, మేధో దృక్పథంలో స్వామినాథన్, భరతన్ కుమారప్పల మధ్య చాలా సాదృశ్యాలు ఉన్నాయి. ఇరువురూ తమిళులు. మాతృభాషలోనూ, అంతర్జాతీయ మేధో మాధ్యమం ఆంగ్ల భాషలోనూ సమ ప్రతిభాపాటవాలు ఉన్నవారు. మతసామరస్యాన్ని కోరుకునేవారు. క్రైస్తవుడైన భరతన్ విశిష్టాద్వైతి రామానుజాచార్యపై ఒక పుస్తకం రాశారు. హిందువు అయిన స్వామినాథన్ నిత్యం బైబిల్‌ను అధ్యయనం చేస్తుండేవారు. అందరితో కలివిడిగా ఉండే తత్వం, ఒక సమష్టి బృందంగా సహచరుల చేత పని చేయించగల సామర్థ్యం గాంధీ సమగ్ర రచనల ప్రధాన సంపాదకుడు అయ్యేందుకు స్వామినాథన్ అర్హతలు అయ్యాయి. ఆయన మద్రాస్‌లోని ప్రెసిడెన్సీ కాలేజీలో సుదీర్ఘకాలం ఆంగ్ల విభాగం ప్రధానాచార్యుడుగా, గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా ఐదు సంవత్సరాల పాటు పని చేశారు. అధ్యాపక వృత్తి నుంచి విరమించిన అనంతరం ‘సండే స్టాండర్డ్’ ఎడిటర్‌గా కూడా ఆయన పనిచేశారు. పలువురు రిపోర్టర్లు, సబ్ ఎడిటర్లు, ప్రూఫ్‌రీడర్ల బృందానికి ఆయన సమర్థమైన నాయకత్వాన్ని అందించారు. 


గాంధీ కలెక్టెడ్ వర్క్స్ ఛీఫ్ ఎడిటర్‌గా స్వామినాథన్ తన సహాయకుడుగా తొలుత నియమించుకున్న వ్యక్తి సిఎన్ పటేల్. గుజరాతీ భాషీయుడు, ఆంగ్ల సాహిత్యాచార్యుడైన పటేల్ చాలవరకు అహ్మదాబాద్ నుంచే పని చేసినప్పటికీ ఆ ప్రాజెక్టులో కీలక పాత్ర వహించారు. గాంధీ గుజరాతీ రచనలను ఆయనే చాలవరకు ఆంగ్లంలోకి తర్జుమా చేశారు. స్వామినాథన్ బృందంలోని ఇతరులు కూడా విశిష్ట విద్యార్హతలు ఉన్నవారే. వారిలో ఒకరైన పి. ఊనియాల్, గాంధీ శిష్యురాలు మీరా బెన్‌తో కలిసి హిమాలయ ప్రాంతాల్లో సాంఘిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మరొకరు ప్రముఖ హిందీ కవి భవానీ ప్రసాద్ మిశ్రా, కలెక్టెడ్ వర్క్స్ హిందీ అనువాదాలకు ఈయనే ఎడిటర్. 1964లో తొమ్మిదో సంపుటం వెలువడినప్పుడు అమెరికాలో గాంధేయ అధ్యయనాల విదుషీమణి జోన్ బొండూరాంట్ ఈ ‘కలెక్టెడ్ వర్క్స్’ గురించి ‘జర్నల్ ఆఫ్ మోడరన్ హిస్టరీ’లో ఒక సమీక్షా వ్యాసం రాశారు. స్వామినాథన్ నేతృత్వంలో జరుగుతున్న కృషిని ఆమె అమితంగా ప్రశంసించారు. విద్వత్‌కృషి, అత్యున్నత ప్రమాణాలకు గాంధీ ‘కలెక్టెడ్ వర్క్స్’ ఒక ప్రశస్త ఉదాహరణ అని ఆమె పేర్కొన్నారు. ‘కలెక్టెడ్ వర్క్స్’ సంపూర్ణంగా ప్రచురితమయ్యేంతవరకు అవే ఉత్కృష్ట ప్రమాణాలను నిష్ఠగా పాటించారు. 


కాలక్రమానుగతంగా గాంధీ రచనలలో ఆఖరి, 90వ సంపుటాన్ని 1985లో ప్రచురించిన అనంతరం ఆయన ఆ ప్రాజెక్టు నుంచి రిటైర్ అయ్యారు. స్వామినాథన్ తన సహచరుల గౌరవాదరాలను విశేషంగా పొందిన ఉదాత్త వ్యక్తి. గుజరాతీ రచయిత హస్ముఖ్ షా ఆయన గురించి ఇలా రాశారు: ‘ఆ బృహత్తర కర్తవ్య నిర్వహణను స్వామినాథన్ చాలా సమర్థంగా నిర్వహించారు. తన బృంద సభ్యుల పరిమితులు, యోగ్యతలను ఆయన చక్కగా అంచనా వేసేవారు. ఆయన ఎప్పుడూ ఎవరిమీద స్వరం పెంచి మాట్లాడడం నేను వినలేదు. తన విధ్యుక్త ధర్మనిర్వహణలో ఆయన చూపిన శ్రద్ధాసక్తులు, అంకితభావం చాలా గొప్పవి. ప్రాచీనకాల ఋషుల వలే స్వామినాథన్ వ్యవహరించేవారు’. గాంధీ సమగ్ర రచనల ప్రాజెక్టులో ఆరు సంవత్సరాలు పని చేసిన అనంతరం హస్ముఖ్ షా మొరార్జీ దేశాయికి వ్యక్తిగత కార్యదర్శిగా వెళ్ళారు. షా స్థానంలో లలితా జకరయ్య నియమితులయ్యారు. ఆంగ్ల సాహిత్యంలో విశ్వవిద్యాలయ పట్టా పుచ్చుకున్న వెన్వెంటనే ఆమె ఈ ప్రాజెక్టులో చేరారు. చాలా సంవత్సరాల అనంతరం ఆమె స్వామినాథన్ గురించి రాస్తూ ‘ఛీఫ్ (సహచరులు ఆయన్ని అలా గౌరవంగా పిలిచేవారు) ఒక మహోన్నత వ్యక్తి. వాక్య నిర్మాణాన్ని సరిచేసినా, పాదసూచికను మార్చినా, కామా పెట్టినా అది చాలా ప్రామాణికంగా ఉండేది. గాంధీ స్ఫూర్తితో ప్రగాఢమైన ఆసక్తితో ఆయన తన విధులను నిర్వహిస్తుండేవారు’ అని పేర్కొన్నారు. 


నేను మొట్టమొదట దశాబ్దం క్రితం గాంధీ కలెక్టెడ్ వర్క్స్‌లోని ప్రతి సంపుటాన్ని, ప్రతి సంపుటంలోని ప్రతి పేజీని చదివాను. ఇప్పుడు మళ్ళీ చదువుతున్నాను. ప్రతి సంపుటంలోనూ వివిధ విషయాలకు విపులంగా వివరణలు ఇవ్వడంలో సంపాదకుల కృషి అమోఘమైనది. ప్రతి సంపుటానికి స్వామినాథన్ ఆలోచనాత్మకమైన ముందుమాట రాశారు. అనుబంధ అధ్యాయాలలో ప్రతిభావంతంగా ఎడిట్ చేసిన సంబంధిత డాక్యుమెంట్లు కూడా ఉన్నాయి. ప్రతి సంపుటం చివరలో కాల క్రమ పట్టిక, విషయసూచికలు సంపాదకబృందం సమష్టి కృషికి దర్పణంగా ఉన్నాయి. విశేషించి చెప్పవలసింది పాదసూచికల గురించి. వాటిని చదివిన తరువాత స్వామినాథన్‌ను, ఆయన సహచరులను గౌరవించకుండా, అభిమానించకుండా ఎవరూ ఉండలేరనడంలో అతిశయోక్తి లేదు. గాంధీ కలెక్టెడ్ వర్క్స్ అన్ని సంపుటాలూ నా సొంత గ్రంథాలయంలో ఉన్నాయి. ఇప్పుడు అవి ఆన్‌లైన్‌లో అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు సబర్మతీ ఆశ్రమం వారు నిర్వహిస్తున్న ‘గాంధీ హెరిటేజ్ పోర్టల్‌’కు వెళ్ళడం మంచిది. స్వామినాథన్ వెలువరించిన గాంధీ కలెక్టెడ్ వర్క్స్ ఆధారంగా ఇప్పటికే అనేక పుస్తకాలు, పరిశోధనా వ్యాసాలు వెలువడ్డాయి.


సమష్టి విద్వత్‌కృషికి గాంధీ ‘కలెక్టెడ్ వర్క్స్’ ఒక ఉత్కృష్ట ఉదాహరణ. అటువంటి పాండిత్య పరిశ్రమ మనదేశంలో చాలా అరుదు. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో అటువంటి విద్వత్ కృషి జరగడం మరీ అరుదు. ఇంకా జన్మించని విద్వజ్ఞులు, భారతీయేతర జాతుల ప్రాజ్ఞులు కె. స్వామినాథన్‌కు, ఆయన నేతృత్వంలో పనిచేసిన ప్రతిభాన్విత సంపాదకులు, అనువాదకుల బృందానికి కృతజ్ఞతాబద్ధులయి ఉంటారనడంలో సందేహం లేదు.


రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Updated Date - 2021-12-04T06:25:33+05:30 IST