ఏ వెల్గుల కీ ప్రస్థానం?

ABN , First Publish Date - 2021-04-10T06:04:01+05:30 IST

పోలీసులపై అపనమ్మకంతో భయపడుతున్న సమాజం, న్యాయమూర్తులు నిష్పాక్షికంగా వ్యవహరిస్తారనే భరోసా లేని వ్యవస్థ, ఒక వ్యక్తి అమాయకత్వం లేదా అపరాధం, ఆ వ్యక్తి మతనేపథ్యం లేదా రాజకీయ....

ఏ వెల్గుల కీ ప్రస్థానం?

పోలీసులపై అపనమ్మకంతో భయపడుతున్న సమాజం, న్యాయమూర్తులు నిష్పాక్షికంగా వ్యవహరిస్తారనే భరోసా లేని వ్యవస్థ, ఒక వ్యక్తి అమాయకత్వం లేదా అపరాధం, ఆ వ్యక్తి మతనేపథ్యం లేదా రాజకీయ విశ్వాసాలతో నిర్థారింపబడుతున్న సంఘం-... ఇవీ, జాతీయస్థాయిలో ‘గుజరాత్ నమూనా’ పర్యవసానాలు. ‘అత్యవసర పరిస్థితి’ అనంతరం ఎన్నడూ లేని రీతిలో మనం రాజ్యాంగ ఆదర్శాలకు చాలా దూరంగా ఉన్నాం. రాజ్యాంగం అమలులోకి వచ్చిన పిదప ఎప్పుడూ చూడని విధంగా మన సామాజిక ఆచరణలు, నైతిక ప్రమాణాలు మరింతగా పతనమయ్యాయి.


‘మోదీగుజరాత్‌లో ఒక సివిల్ సర్వెంట్ లేదా ఒక పోలీస్‌ అధికారి పదోన్నతి పొందాలంటే వ్యవస్థ వంచనలో తనకుతాను సంపూర్ణ భాగస్వామి కావాలి’. నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా, అమిత్ షా హోంమంత్రిగా ఉన్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం విషయంలోనూ ఆ వ్యాఖ్య ఒక వాస్తవంగా ఉన్నది. 2002లో గుజరాత్ మారణ కాండపై (ప్రస్తుతం నేను చదువుతున్న) ఒక కొత్త పుస్తకం -అశీశ్ ఖేతాన్ రాసిన ‘అండర్ కవర్: మై జర్నీ ఇన్ టూ ది డార్క్‌నెస్ ఆఫ్ హిందూత్వ’-లోని నిశిత వ్యాఖ్య అది. రెండు దశాబ్దాల క్రితం జరిగిన ఆ ఘోర మతతత్వ హింసాకాండను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించే పరిశోధకులకు ‘అండర్ కవర్’ ఒక ముఖ్య ఆధార గ్రంథం. ఖేతాన్ పుస్తకం ఆ పైశాచిక గతం నిగ్గు తేల్చడమే కాదు వర్తమానంతోనూ నేరుగా సంభాషిస్తోంది. అప్పటి గుజరాత్ ఏలికలే ఇప్పటి దేశ పాలకులు కదా. 


2014కి పూర్వం భారత ప్రభుత్వం ప్రచురించే ఆర్థిక గణాంకాలకు విశ్వసనీయత ఉండేది. ప్రపంచవ్యాప్తంగా వాటిని అంగీకరించేవారు. ఇప్పుడు వాటిని ఎవరూ నమ్మడం లేదు. ఆర్థికం, విద్య, ఆరోగ్యం లేదా ఎన్నికల నిధులు... ఇలా ఏ రంగానికి సంబంధించిన గణాంకాలు అయినా దగాకోరు లెక్కలు, నిజాన్ని కప్పిపుచ్చేవిగా ఉంటున్నాయి. ప్రస్తుత ప్రభుత్వ ప్రవర్తనా రీతిని ప్రతిబింబిస్తున్నాయా అన్నట్టుగా అవి సత్యాలను వెల్లడించడం లేదు, పారదర్శకంగా ఉండడం లేదు. దేశపాలనలో గుజరాత్ నమూనా అనుసరణతో మరో పర్యవసానం చర్చ, అసమ్మతికి ఆస్కారం తగ్గిపోవడం. శాంతియుత అసమ్మతిని అణచివేసేందుకు మోదీ-షా సర్కార్ రాజ్యాధికారాన్ని నిర్హేతుకంగా, మితిమీరిన స్థాయిలో ఉపయోగిస్తోంది. నోటీసు జారీ చేయకుండా వ్యక్తులను అరెస్ట్ చేసి, జైళ్ళలో నిర్బంధించేందుకు పోలీసులు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను పురిగొల్పుతున్నారు. వ్యక్తులను అరెస్ట్ చేసి, జైలులో పెట్టిన తరువాత వారికి వ్యతిరేకంగా ‘సాక్ష్యాధారాలను’ సమీకరిస్తున్నారు. 


గత ఏడాది ఫిబ్రవరిలో న్యూఢిల్లీలో జరిగిన హింసాకాండను సాకుగా తీసుకొని ఆ ఘటనలతో సంబంధంలేని విద్యార్థి నాయకులను, మహిళా ఉద్యమకారులను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆ హింసాకాండను బహిరంగంగా రెచ్చగొట్టిన బీజేపీ నాయకులపై కనీసం ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసేందుకు సైతం నిరాకరించారు. ఈ కారణంగానే ‘ఢిల్లీ పోలీసుల అనుచిత చర్యలు ఈ వృద్ధ పోలీసు మనస్సాక్షిని అమితంగా నొప్పించాయి’. అని జూలియో రిబెరో వ్యాఖ్యానించవలసివచ్చింది. న్యాయస్థానాల పనిదినాలు ముగిసి, న్యాయవాదులు అందుబాటులో లేని వారాంతపు రోజుల్లోనే అరెస్ట్‌లకు పాల్పడే పోలీసుల ప్రవృత్తి రాజ్య వ్యవస్థ దురుద్దేశాలను ప్రతిబింబిస్తోంది. ‘చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం’ (ఊపా)ను తరచు ఎవరో ఒకరిపై ప్రయోగించడం కూడా అందుకు మరో తార్కాణం. ‘ఊపా ఒక అసాధారణ కఠోర చట్టం. పౌరుల హక్కుల విషయంలో రాజ్య ప్రాయోజిత ఉల్లంఘనలకు చట్టబద్ధమైన అధికారాలను కల్పించడమే ఊపా’ అని న్యాయవ్యవహారాల విశ్లేషకుడు ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం. 


పౌరుల రాజకీయ అనుబంధాల ప్రాతిపదికన వారి పట్ల వ్యవహరించడం కేంద్రంలోను, బీజేపీ పాలిత రాష్ట్రాలలోనూ పోలీసుల పక్షపాత వైఖరికి మరో నిదర్శనం. రైతుల అహింసాత్మక ఆందోళనకు మద్దతుగా ఒక ట్వీట్ చేసిన పర్యావరణ కార్యకర్త ఒకరిని అరెస్ట్ చేసి దేశద్రోహ నేరంపై జైలుకు పంపారు. ప్రభుత్వ విధానాల పట్ల అసమ్మతి వ్యక్తం చేసిన వారిని కాల్చివేయాలని బహిరంగంగా పిలుపు నిచ్చిన ఒక రాజకీయ వేత్త తన మంత్రి పదవిలో పదిలంగా ఉన్నాడు! పలు పట్టణాలలో రౌడీ యువకులు పేట పేటకు, వాడ వాడకు తిరుగుతూ ప్రజలకు సంబంధించిన ఒక విషయమై విరాళాలు ఇవ్వాలని వారిని డిమాండ్ చేస్తున్నా పోలీసులు చూస్తూ ఉండిపోతున్నారు! 


అధికారంలో ఉన్న రాజకీయవేత్తల ఆదేశాలను సీనియర్ పోలీస్‌ అధికారులు పాటించడం మన దేశంలో చాలా పురాతన పరిణామం. బీజేపీయేతర పాలిత రాష్ట్రాలలోనూ ఇది మామూలే. మహారాష్ట్రలో ఇటీవల జరిగిన పరిణామాలే ఇందుకు నిదర్శనం. మోదీ-షా సర్కార్ అయితే పోలీసు వ్యవస్థనే మతతత్వీకరణ చేసింది. నిజానికి ఇది కూడా కొత్త పరిణామం కాదు. 1980 దశకంలో ఉత్తర భారతావనిలోని పలు రాష్ట్రాలలో పోలీసులు అధిక సంఖ్యాక వర్గానికి చెందిన సంఘ వ్యతిరేక శక్తుల పట్ల మృదువైఖరితో వ్యవహరించడం, అల్ప సంఖ్యాకవర్గాలకు చెందిన చిల్లర నేరస్థుల పట్ల అత్యంత కఠోరంగా వ్యవహరించడం ఒక రివాజుగా ఉండేది. పోలీసుల ఆ పక్షపాత వైఖరే ఇప్పుడు మరింత నగ్నంగా, స్పష్టంగా వ్యక్తమవుతోంది. రిబెరో వలే నీతి నిజాయితీలకు సుప్రసిద్ధుడైన మరో విశ్రాంత పోలీస్‌ అధికారి విభూతి నారాయణ్ రాయ్, మధ్యప్రదేశ్‌లో ముస్లింల నివాసాలపై హిందూత్వ మూకలు దాడులు చేసిన తీరు తెన్నుల గురించి ఇటీవల ఒక వ్యాసంలో దిగ్భ్రాంతికరమైన వాస్తవాలను వెల్లడించారు.


మూకలు దాడులు చేస్తుండగా పోలీస్‌ అధికారులు మౌనంగా చూస్తుండిపోయారని ఆయన పేర్కొన్నారు. నిజాయితీపరులైన పోలీసులు దౌర్జన్యకారులను నిరోధించడానికి ప్రయత్నించినప్పటికీ అధికారులు వారిని నివారించారని రాయ్ రాశారు. రిబెరో వలే విభూతి నారాయణ్ కూడా తన వృత్తిపరమైన భవిష్యత్తు గురించి ఆలోచించకుండా తన విధ్యుక్త ధర్మాన్ని. నిర్వహించిన అధికారి. ఇప్పుడు ఇటువంటి నిజయితీపరులైన అధికారులు పోలీసు శాఖల్లో అంతకతకూ తగ్గిపోతున్నారు. ఆయన ఇంకా ఇలా రాశారు: ‘మధ్యప్రపదేశ్‌లో ఒక కొత్త అలిఖిత పోలీసు నిబంధన పత్రం రూపొందింది. చట్టాన్ని ఉల్లంఘిస్తున్నవారిని నిరోధించకూడదని ఆ కొత్త పత్రం సూచిస్తోంది. గజదొంగలు, గొంతులు కోసే వాళ్ళకే సహకరించాలని వారి బాధితులు ఇళ్ళను వదిలి శరణార్థులుగా వెళ్ళిపోయేలా చేయాలని కూడా అది నిర్దేశిస్తోంది’.


నరేంద్ర మోదీ పాలనలో గుజరాత్ గురించి అశీశ్ ఖేతాన్ ఇంకా ఇలా వ్యాఖ్యానించారు: ‘మతతత్వ పక్షపాతాన్ని చూపని ప్రభుత్వ సంస్థ, రాజ్య విభాగం లేనేలేదు. సాక్ష్యాధారాలను సృష్టించడంలో గుజరాత్ పోలీసులు నిపుణులయ్యారు...’ 2014 మే అనంతరం కేంద్రప్రభుత్వ స్థాయిలో వివిధ సంస్థలు, ఏజెన్సీలలో మతతత్వ వైఖరులు బాగా పెచ్చరిల్లి పోయాయి. అలాగే రాజకీయాలలో లంచాలు తీసుకోవడం, బలవంతపు వసూళ్ళకు పాల్పడడమూ పెరిగి పోయింది. భారత రాజకీయాలలో డబ్బు, ప్రభుత్వ యంత్రాంగం మొదటి నుంచీ కీలకపాత్ర నిర్వహిస్తూనే ఉన్నాయి. అయితే 2014కి ముందు ఇప్పటిలా స్పష్ట మైన, నిర్ణాయక పాత్ర వహించలేదు. అధికార పార్టీ ప్రచార ప్రాధాన్యతలు ఎన్నికల షెడ్యూలును నిర్ణయంచడంపై ప్రభావాన్ని చూపుతున్నాయి.


రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను ఉపయోగించుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనూ జరిగింది. అయితే బీజేపీ ప్రభుత్వం ఆ దుర్వినియోగాన్ని పూర్తిగా ఒక కొత్త, భిన్న స్థాయికి తీసుకువెళ్ళింది. ప్రతిపక్షాల ప్రభుత్వాలను పడగొట్టడంలో ప్రభుత్వ దర్యాప్తుసంస్థలు, బీజేపీ అపార ధనవనరులు ఎలా కలసికట్టుగా పనిచేస్తున్నాయనడానికి కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు సంభవించిన పరిణామాలే రుజువు. ఈ వ్యాసం రాస్తున్న సమయంలోనే తమిళనాడులో ఒక ప్రముఖ ప్రతిపక్ష నేత కుటుంబ నివాసాలు, వ్యాపార కార్యాలయాలపై కేంద్రప్రభుత్వ సంస్థల దాడులు జరిగాయి. అసోంలో బీజేపీ మంత్రి ఒకరు తన రాజకీయ ప్రత్యర్థిపై జాతీయ దర్యాప్తుసంస్థను ఉసిగొల్పుతామని బహిరంగంగా బెదరించాడు. 


గుజరాత్‌లో అధికారాన్ని సంపూర్ణంగా సొంతం చేసుకోవడంలో మోదీ-షా లకు సివిల్ సర్వెంట్స్, పోలీస్‌ అధికారులు; మీడియా, న్యాయవ్యవస్థ సంపూర్ణంగా సహకరించాయి. దేశవ్యాప్తంగా అధికారాన్ని కైవసం చేసుకొని, సుస్థిరపరచుకునేందుకు కూడా గుజరాత్‌లో ఆచరించిన పద్ధతులనే దేశ పాలనలోనూ మోదీ-–షా అనుసరిస్తున్నారు. అయితే ఇంతవరకు సంపూర్ణ విజయాన్ని సాధించలేక పోయారు. ఇందుకు మూడు కారణాలు ఉన్నాయి. అవి: పలు ప్రధాన రాష్ట్రాలలో బీజేపీ అధికారంలో లేకపోవడం; ప్రధాన హిందీ పత్రికలు, పలు ఇంగ్లీష్, హిందీ టీవీ ఛానెల్స్ బీజేపీకి అనుకూలంగా ఉన్నప్పటికీ, కొన్ని ఇంగ్లీష్ పత్రికలు, వెబ్ సైట్లు స్వతంత్రంగా ఉండడం; న్యాయస్థానాలు పిరికితనంతో వ్యవహరిస్తున్నప్పటికీ (ముఖ్యంగా బెయిల్ మంజూరు వ్యవహారాలలో), అప్పుడప్పుడూ వ్యక్తిగత హక్కులు, భావ స్వేచ్ఛకు మద్దతుగా ఎవరో ఒక న్యాయమూర్తి తీర్పులు వెలువరించడం. అయితే మోదీ–-షా దేశాన్ని ఏ దిశగా తీసుకు వెళ్ళదలుచుకుంటున్నదీ, దేశం ఎక్కడకు వెళుతున్నదీ స్పష్టమే. మరోసారి అశీశ్ ఖేతాన్‌ను ఉటంకిస్తాను: ‘చట్టం ప్రతిఘటన లేకుండా అధిక సంఖ్యాకవర్గాల ఎదురులేని పాలన; రాజ్యాంగవాద స్పూర్తి, సారం లోపించిన పై పై మెరుగుల ప్రజాస్వామ్యం; మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింలను అన్ని విధాల బలహీనపరచడం; హిందూ మితవాద ఆందోళనకారులు నిర్భయంగా, పూర్తిస్వేచ్ఛతో వ్యవహరించేందుకు అనుమతినివ్వడం; అధికారపక్ష భావజాలాన్ని వ్యతిరేకించే వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించడం; మానవహక్కుల కార్యకర్తలు, సంస్థలను శిక్షించడం; అసమ్మతివాదులు, రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు సంస్థాగత అధికారాలను, న్యాయప్రక్రియలను దుర్వినియోగ పరచడం..... భారత్‌లో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా జరుగుతున్నాయి’. 


పోలీసులపై అపనమ్మకంతో భయపడుతున్న సమా జం, న్యాయమూర్తులు సైతం నిష్పాక్షికంగా వ్యవహరిస్తారనే భరోసా లేని వ్యవస్థ, ఒక వ్యక్తి అమాయకత్వం లేదా అపరాధం, ఆ వ్యక్తి మతనేపథ్యం లేదా రాజకీయ విశ్వాసాలు, ఆచరణలతో నిర్థారింపబడుతున్న సంఘం- ఇవీ, జాతీయస్థాయిలో ‘గుజరాత్ నమూనా’ పర్యవసానాలు. సంస్థాగత దృక్పథాలలో (1975–-77) అత్యవసర పరిస్థితి అనంతరం ఎన్నడూ లేని రీతిలో మనం రాజ్యాంగ ఆదర్శాలకు చాలా దూరంగా ఉన్నాం. 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చిన పిదప ఎన్నడూ లేని విధంగా మన సామాజిక ఆచరణలు, నైతిక ప్రమాణాలు మరింతగా పతనమయ్యాయి.




రామచంద్ర గుహ

(వ్యాసకర్త చరిత్రకారుడు)

Updated Date - 2021-04-10T06:04:01+05:30 IST