మందులో రామచంద్రా

ABN , First Publish Date - 2021-06-19T08:55:58+05:30 IST

రాష్ట్రంలోని ఈఎ్‌సఐ డిస్పెన్సరీల్లో మందుల్లేక రోగులు అల్లాడుతున్నారు. కొందరుప్రాణాలు కోల్పోతున్నారు.

మందులో రామచంద్రా

  • ఈఎస్ఐడీ డిస్పెన్సరీల్లో ఔషధాల కొరత
  • రోగులు అల్లాడుతున్నా రెండేళ్లుగా ఇదే పరిస్థితి
  • ఔషధాల కోసం ఇండెంట్లు పెట్టకుండా చోద్యం 
  • ఏసీబీని బూచిగా చూపుతున్న ఐఎమ్‌వోలు
  • తరచూ నోడల్‌ అధికారులు, జేడీల మార్పుతోనూ సమస్య
  • కేన్సర్‌, కిడ్నీ, హృద్రోగులు, హిమోఫిలియా బాధితులురాష్ట్రం నలుమూలల నుంచీ హైదరాబాద్‌ రావాల్సిందే
  • దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల అవస్థలు వర్ణనాతీతం
  • మంత్రికి లేఖ రాసిన హిమోఫిలియా బాధితులు 

హైదరాబాద్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఈఎ్‌సఐ డిస్పెన్సరీల్లో మందుల్లేక రోగులు అల్లాడుతున్నారు. కొందరుప్రాణాలు కోల్పోతున్నారు. ప్రధానంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు మందుల కోసం నానాఇబ్బందులు పడుతున్నారు. క్యాన్సర్‌, కిడ్నీ, గుండె జబ్బులు, హిమోఫిలియోతో పాటు ఇతర దీర్ఘకాలిక జబ్బుల వ్యాధిగ్రస్తులకు మందులందడం లేదు. ఈఎ్‌సఐ మందుల కుంభకోణం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి.. దాదాపు రెండేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు చక్కదిద్దుతున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ ఏ మాత్రం మార్పు రావట్లేదు. రాష్ట్రవ్యాప్తంగా 50కి పైగా ఈఎ్‌సఐ డిస్పెన్సరీలున్నాయి. వాటిలో 1200-1300 రకాల ఔషధాలు ఉండాలి. కానీ.. ప్రస్తుతం వంద రకాలలోపే ఔషధాలు అందుబాటులో ఉన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రోగులకు వారానికి లేదా 15 రోజులకు సరిపడా మందులిస్తున్నామని అధికారులు చెబుతున్నా... క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించట్లేదు. రోగుల ఒత్తిడి పెరుగుతున్నా.. ఔషధాలను తగినంతగా అందుబాటులో ఉంచడంలో ఈఎ్‌సఐ ఉన్నతాధికారులు వైఫల్యం చెందారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 


వారానికి రెండు రోజులే..

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఔషధాలను అందించడం కోసం నాచారం ఆస్ప్రత్రిలో నోడల్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అందులో ప్రధానంగా కిడ్నీ, కేన్సర్‌, హిమోఫిలియో, గుండె జబ్బులతో పాటు ఇతర  దీర్ఘకాలిక జబ్బులకు మాత్రమే ఔషధాలను ఇస్తారు. అయితే, ఆ కేంద్రం వారానికి రెండు రోజులే పనిజేస్తుంది. ప్రతి మంగళ, శుక్రవారాల్లోనే అక్కడ మందులు ఇస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఈఎ్‌సఐలో చికిత్స తీసుకునే దీర్ఘకాలిక వ్యాఽధిగ్రస్తులంతా మందుల కోసం అక్కడికే రావాల్సి ఉంటుంది. అది తమకు భారంగా మారిందని.. వారానికి, 15 రోజులకు ఎక్కడి నుంచో అక్కడి దాకా రావడం సాధ్యం కావడం లేదని బాధితులు వాపోతున్నారు. ప్రస్తుత కరోనా నేపథ్యంలో మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వారు చెబుతున్నారు. ఈ క్రమంలోనే.. నాచారంలోని ఔషధ నోడల్‌ కేంద్రాన్ని రద్దు చేయాలని, స్థానికంగా ఉన్న డిస్పెన్సరీల్లోనే మందులివ్వాలని హిమోఫిలియా బాధితులు నాలుగు రోజుల క్రితం రాష్ట్ర కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డికి లేఖ రాశారు. శరీరంలో అంతర్గతంగా రక్తస్రావం జరిగి అనారోగ్య సమస్యలతో బాధపడే తాము.. వైద్యులు సూచించిన ఫ్యాక్టర్‌ 8,9 ఇంజెక్షన్ల కోసం వారానికొకమారు అంత దూరం రాలేకపోతున్నామని ఆ లేఖలో తమ ఆవేదనను వ్యక్తం చేశారు. మరోవైపు సనత్‌ నగర్‌ ఈఎ్‌సఐసీలో  కేన్సర్‌ ఔషధాలను, కీమోథెరపీకి సంబంధించిన డ్రగ్స్‌ను  ఇవ్వట్లేదని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఎందుకిలా?

ఈఎ్‌సఐ డిస్పెన్సరీల్లో  ఔషధ అవసరాలను గుర్తించి వాటికి ఇండెంట్‌ పెట్టే బాధ్యత స్థానిక డిస్పెన్సరీల్లోని ఇన్సూరెన్స్‌ మెడికల్‌ ఆఫీసర్లదే (ఐఎమ్‌వోలు). వారు కావాల్సిన మందులకు సంబంధించిన ఇండెంట్‌ను తమ పరిధిలో ఉన్న ఆస్పత్రి నోడల్‌ ఆఫీసర్లకు పంపుతారు. ప్రస్తుతం నాచారం, రాంచంద్రాపురం, వరంగల్‌ ఈఎ్‌సఐ ఆస్పత్రుల పరిధిలో ఈ డిస్పెన్సరీలన్నీ ఉన్నాయి. ఐఎమ్‌వోలు పెట్టిన ఇండెంట్లు.. నోడల్‌ ఆఫీసర్ల నుంచి ఆ మూడు ఆస్పత్రుల సూపరింటెండెంట్లకు వస్తాయి. వారు పర్చేజ్‌ కమిటీని ఏర్పాటు చేసి రేటు కాంట్రాక్టు ప్రకారం పర్చేజ్‌ ఆర్డర్‌ (పీవో) ఇస్తారు. ఇది సాధారణంగా జరిగే పద్ధతి. అయితే మందుల కుంభకోణం తర్వాత ఏసీబీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డిస్పెన్సరీల్లోని ఐఎమ్‌వోలందర్ని పిలిపించి విచారించారు. ‘‘ఆ రోజు ఏయే మందులు కొన్నారు? ఎవరు కొనమన్నారు? ఎందుకు కొన్నారు?’’ లాంటి ప్రశ్నలతో వారిని విచారించారు. రోజుల తరబడి ఏసీబీ అధికారుల నుంచి విచారణ ఎదుర్కోవడంతో.. ఐఎమ్‌వోలు నాటి నుంచి డిస్పెన్సరీలకు సంబంధించిన ఔషధ ఇండెంట్లు పెట్టట్లేదు. ఇందువల్లే డిస్పెన్సరీల్లో ఔషధాల లభ్యత ఉండట్లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొన్నిచోట్ల ఇండెంట్‌ పెట్టినా చాలా తక్కువగా పెడుతున్నారు.  ఎక్కువగా పెడితే రకరకాల సమస్యలు వస్తాయన్న భావన ఐఎంవోల్లో నెలకొంది. తాము స్వేచ్ఛగా పనిజేయగలిగే పరిస్థితి లేదని, ఆ అభయం ఇచ్చే అధికారులే లేరని కొందరు ఐఎమ్‌వోలు చెబుతున్నారు. అందుకే ఎందుకొచ్చిన రిస్కు అన్న ధోరణిలో ఉన్నామని వారు చెబుతున్నారు. 


జేడీ ఫోన్‌ స్విచాఫ్‌

ఈఎ్‌సఐ డిస్పెన్సరీల్లో మందుల లభ్యత లేని విషయంపై ఈఎ్‌సఐ జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పద్మజను వివరణ కోరేందుకు ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి ప్రయత్నించగా, ఆమె ఫోన్‌ స్విచాఫ్‌ చేసి ఉంది.


తరచూ అధికారులు మార్పు..

ఈఎ్‌సఐ కుంభకోణం తర్వాత.. రెండేళ్ల వ్యవధిలోనే ఐదుగురు నోడల్‌ అధికారులు మారారు. ముందు భాస్కర్‌ రెడ్డి, తర్వాత లెనిన్‌, అనంతరం సత్యనారాయణ, మళ్లీ లెనిన్‌, ఆ తదుపరి కల్యాణ్‌ను నోడల్‌ ఆఫీసర్‌గా వచ్చారు. అలాగే జాయింట్‌ డైరెక్టర్‌ పద్మ మందుల కుంభకోణంలో అరెస్టు కావడంతో ఆ స్థానంలో ఇన్‌చార్జి జేడీలను కూడా అలాగే మారుస్తూ వచ్చారు. ముందుగా సత్యనారాయణ, ఆ తర్వాత హేమలత, ప్రస్తుతం పద్మజ జాయింట్‌ డైరెక్టర్‌గా పనిజేస్తున్నారు. ఇలా తరచూ ఉన్నతాధికారులను మార్చడం వల్ల వచ్చినవారంతాఅభద్రతాభావంతో పనిచేయాల్సి వస్తోంది. దీంతో వారు పాలనా వ్యవహారాలపై సరిగా దృష్టి పెట్టట్లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా తరచూ అధికారులను ఎందుకు మారుస్తున్నారన్న ప్రశ్నలకు సచివాలయ ఉన్నతాధికారుల వద్ద సమాధానం లేదు. ఈ మొత్తం వ్యవహారాలను పర్యవేక్షించడంలో ఉన్నతాధికారులు పూర్తిగా విఫలమయ్యారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.



Updated Date - 2021-06-19T08:55:58+05:30 IST