Abn logo
May 5 2021 @ 11:29AM

చార్మినార్‌కు రంజాన్‌ కళ

కొనుగోలుదారుల సందడి

హైదరాబాద్/చార్మినార్‌: రంజాన్‌ సందర్భంగా పాతబస్తీ పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. చార్మినార్‌, మక్కామసీదు, మదీన, గుల్జార్‌హౌజ్‌ తదితర ప్రాంతాల్లో దుకాణాలు కొనగోలుదారులతో కళకళలాడుతుంటాయి. ఉదయమంతా పనులు చేసుకునే ముస్లిం సోదరులు, ఇతర మతాల వారు రంజాన్‌ మాసంలో రాత్రివేళల్లో షాపింగ్‌ చేయడానికి ఇష్టపడుతుటారు. అయితే, ఈ ఏడాది కరోనా కారణంగా రాత్రి కర్ఫ్యూ కారణంగా మధ్యాహ్నం నుంచి  సాయంత్రం వరకు  షాపింగ్‌ చేస్తున్నారు. రంజాన్‌ మాసంలో ముస్లింలు పేద, ధనిక బేధం లేకుండా కొత్త వస్త్రాలు ధరిస్తారు. ధనవంతులు, మధ్యతరగతి వారు నూతన గృహలంకరణ వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు.


దీంతో చార్మినార్‌, లాడ్‌బజార్‌, పత్తర్‌ఘట్టి, ఖిల్వత్‌ ప్రాంతాల్లోని వస్త్రాల షాపులు, గాజుల షాపులు, చెప్పుల షాపులలో మధ్యాహ్నం నుంచే సందడిగా కనిపిస్తున్నాయి. రంజాన్‌ ఉపవాస దినాల్లో కుటుంబసమేతంగా ముస్లింలు మక్కా మసీదుతోపాటు సమీపంలో ఉన్న మసీదుల్లో ప్రార్థనలు చేసి ఇఫ్తార్‌ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. రకరకాల వంటకాలు రంజాన్‌ మాసంలో లభ్యమవుతుండడంతో కుటుంబసమేతంగా వచ్చి వాటిని కొనుగోలు చేస్తుంటారు. రంజాన్‌  మాసంలో ప్రత్యేకంగా లభించే పిస్తా హౌజ్‌హలీంను తినడానికి ఎక్కువగా జంట నగరాల నుంచి ప్రజలు చార్మినార్‌కు వస్తుండడంతో సందర్శకులతో చార్మినార్‌ పరిసరాలు కళకళలాడుతున్నాయి. 

Advertisement
Advertisement