ఆరాధనల మాసం రంజాన్‌!

ABN , First Publish Date - 2021-04-09T05:30:00+05:30 IST

విశ్వాసులైన మానవులవై తన కారుణ్య వర్షాన్ని కురిపించడానికి పవిత్ర రంజాన్‌ మాసం వస్తోంది. రజబ్‌, షాబాన్‌ మాసాల్లోని నెలవంకను చూసి ‘‘ఓ అల్లాహ్‌! మమ్మల్ని రంజాన్‌ మాసం వరకూ చేర్చు’’ అని మహా ప్రవక్త మహమ్మద్‌ ప్రార్థించేవారు

ఆరాధనల మాసం రంజాన్‌!

14 నుంచి రంజాన్‌ మాసం


విశ్వాసులైన మానవులవై తన కారుణ్య వర్షాన్ని కురిపించడానికి పవిత్ర రంజాన్‌ మాసం వస్తోంది. రజబ్‌, షాబాన్‌ మాసాల్లోని నెలవంకను చూసి ‘‘ఓ అల్లాహ్‌! మమ్మల్ని రంజాన్‌ మాసం వరకూ చేర్చు’’ అని మహా ప్రవక్త మహమ్మద్‌ ప్రార్థించేవారు. వరాల వసంతమైన ఆ మాసానికి స్వాగతం పలకడానికి అందరూ సిద్ధం కావాలని ఆయన ఉపదేశించేవారు. అనంత కరుణామయుడు, అపార కృపాశీలి అయిన అల్లాహ్‌ మానవులకు ప్రసాదించిన పవిత్ర మాసంగా, సమస్త శుభాలకూ నిలయమైన మాసంగా, సర్వ కారుణ్యాలకూ ఆలవాలమైన మాసంగా, సహనం, దాతృత్వాలను పెంచే పుణ్య మాసంగా, పేద, గొప్ప అనే తారతమ్యాలను తొలగించే మాసంగా, సర్వమానవ సమానత్వాన్నీ, సౌభ్రాతృత్వాన్నీ, పరస్పర ప్రేమాభిమానాలనూ ద్విగుణీకృతం చేసే మాసంగా రంజాన్‌ను పవిత్ర గ్రంథాలు ప్రస్తుతించాయి. 


‘‘ఒక శుభప్రదమైన మాసం రాబోతోంది. ఈ మాసంలో ఉపవాసాలను (రోజాలను) అల్లాహ్‌ మీకు విధిగా (ఫర్జ్‌) చేశాడు. ఈ మాసంలో స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి. నరకద్వారాలు మూసుకుంటాయి. సైతాన్లు సంకెళ్ళతో బంధితులవుతారు. వెయ్యి నెలలకన్నా శ్రేష్టమైన ఒక రాత్రి ఈ మాసంలోనే ఉంది. విశ్వాసంతో కూడిన ఉత్సాహంతో రంజాన్‌ మాసానికి స్వాగతం చెప్పేవారు ఎంతో అదృష్టవంతులు. ఆరాధనకు ఇది ఎంతో ముఖ్యమైన నెల’’ అని దైవ ప్రవక్త మహమ్మద్‌ పేర్కొన్నారు. 


రంజాన్‌ మాసంలో అల్లాహ్‌ ప్రీతి కోసం ముఖ్యంగా అయిదు పనులు చేయాలి. మొదటిది ‘దేవుడు ఒక్కడే, ఆయన ప్రవక్త మహమ్మద్‌’ అని విశ్వసించడం. రెండోది క్షమాపణ కోరడం. మూడోది అల్లా్‌హను ప్రార్థించి, స్వర్గ ప్రవేశాన్ని కోరడం. నాలుగోది నరక దండన నుంచి కాపాడాలని దైవాన్ని వేడుకోవడం. అయిదోది దివ్య ఖుర్‌ఆన్‌ను ఎక్కువసార్లు చదవడం.‘‘పవిత్ర ఖుర్‌ఆన్‌ అవతరించిన మాసం ఇది. ఆ గ్రంథం మానవులు అందరికీ మార్గదర్శకం. మంచి మార్గాన్ని చూపించే, సత్యాన్నీ, అసత్యాన్నీ వేరుపరిచే స్పష్టమైన ఆదేశాలు అందులో ఉన్నాయి. కాబట్టి రంజాన్‌ మాసంలో జీవించేవారు ఆ మాసమంతా విధిగా ఉపవాసం పాటించాలి’’ అని దివ్య ఖుర్‌ఆన్‌లో పవిత్ర రంజాన్‌ మాసం గొప్పతనాన్ని అల్లాహ్‌ వివరించారు. 


‘‘ఈ రంజాన్‌ మాసంలో మొదటి రాత్రి రాగానే సైతాన్లు బంధితులవుతారు. నరకద్వారాలు మూతపడతాయి. స్వర్గద్వారాలు తెరుచుకుంటాయి. అవిధేయులైన అనేకమంది దాసులకు సైతం నరకం నుంచి అల్లాహ్‌ విముక్తి కలిగిస్తాడు. ఈ విధంగా రంజాన్‌ నెలలో ప్రతి రాత్రీ జరుగుతుంది’’ అని దైవ ప్రవక్త మహమ్మద్‌ తెలిపారు.షాబాన్‌ నెల చివరి రోజున దైవ ప్రవక్త ఒక ప్రసంగం చేస్తూ, ‘‘విశ్వాసులారా! ఒక శుభాల మాసం రాబోతోంది. దాని పేరు రంజాన్‌. ఈ నెలలో ఎవరైనా ఒక సత్కార్యాన్ని చేస్తే, ఇతర నెలల్లో డెబ్భై సత్కార్యాలు చేసినదానితో సమానం’’ అని చెప్పారు. దైవ ప్రవక్త అందరికన్నా ఎక్కువ అనుగ్రహాన్ని చూపించేవారు. రంజాన్‌ మాసం రాగానే అంతకు ఎన్నో రెట్లు అనుగ్రహాన్ని ఆయన కురిపించేవారు. అల్లాహ్‌ సమస్త ప్రాణుల కోసం ఏడాదిలోని పదకొండు నెలలను కేటాయించి, ఒక్క రంజాన్‌ మాసాన్ని తన కోసం ప్రత్యేకించుకున్నాడు. అందుకే ఆరాధనల్లో అత్యధిక భాగం ఈ నెలలోనే నిర్వర్తించాల్సి ఉంటుంది.విశ్వాసులందరూ రంజన్‌ మాసంలో రోజూ ఒక భాగం దివ్య ఖుర్‌ఆన్‌ పారాయణ చెయ్యాలి. రాత్రి వేళల్లో తరావీహ్‌ నమాజ్‌, జకాత్‌, ఫిత్రా దానాలు, తాఖ్‌ రాత్రులు (బేసి రాత్రులు) ఏతే కాఫ్‌ లాంటి ఆధ్యాత్మిక అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇవన్నీ తప్పకుండా ఆచరించాలనే గట్టి సంకల్పంతో ఈ మాసాన్ని హృదయపూర్వకంగా స్వాగతించాలి.

మహమ్మద్‌ వహీదుద్దీన్‌

Updated Date - 2021-04-09T05:30:00+05:30 IST