మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు దాసోహం: రామకృష్ణ

ABN , First Publish Date - 2021-08-11T18:00:24+05:30 IST

నరేంద్రమోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు దాసోహం అయ్యిందని రామకృష్ణ విమర్శించారు.

మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు దాసోహం: రామకృష్ణ

విజయవాడ: నరేంద్రమోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు దాసోహం అయ్యిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్రం రైతు అనుకూల చట్టాల పేరుతో మూడు నల్లచట్టాలు తీసుకువచ్చి కార్పొరేట్ సంస్థలకు లబ్ది చేకూర్చిందని ఆరోపించారు. కార్మికుల 46 చట్టాలను తుంగలో తొక్కిందన్నారు. కరోనా దుర్భర పరిస్థితులలో ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వాలు ప్రజలపై అదనపు భారం మోపుతున్నాయని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం అధానీ, అంబానీల అడుగులకు మడుగులొత్తుతోందని విమర్శించారు.


ఏపీ సీఎం జగన్ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులమయం చేశారని రామకృష్ణ విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో జగన్ సర్కార్ ఉందన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా అభివృద్ధి జరుగుతోందా? అని ప్రశ్నించారు. జగన్ తీసుకువచ్చిన  రుణ ధనం ఏమవుతోందని నిలదీశారు. రాష్ట్రంలో ఉన్న కంపెనీలు  పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయన్నారు. పాదయాత్ర సమయంలో జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని, ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ నిరుద్యోగులను నిరాశ, నిస్పృహలకు గురిచేసిందన్నారు. అన్ని వర్గాలు జగన్ ప్రభుత్వంపై తీవ్ర అసహనంగా ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో, రాష్ట్ర అభివృద్ధి విషయంలో జగన్ ప్రభుత్వం వైఫల్యంపై  సీపీఐ పోరాటం చేస్తుందని, ప్రభుత్వ వైఫల్యాలపై విశాఖలో రెండు రోజులపాటు వర్క్ షాప్ నిర్వహించనున్నామని రామకృష్ణ స్పష్టం చేశారు.

Updated Date - 2021-08-11T18:00:24+05:30 IST