Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘రెవెన్యూ’కు రామకృష్ణారావు?

  • ఆర్థిక శాఖ కార్యదర్శిగా సుల్తానియా!
  • అర్వింద్‌, జయేశ్‌ పరస్పర మార్పు
  • 10-12 మంది సీనియర్‌ ఐఏఎస్‌ల 
  • బదిలీకి రంగం సిద్ధం చేస్తున్న ప్రభుత్వం
  • కేసీఆర్‌తో చర్చించిన సీఎస్‌ సోమేశ్‌
  • కోడ్‌ నేపథ్యంలో కలెక్టర్ల బదిలీలు లేనట్లే


హైదరాబాద్‌, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారుల బదిలీలకు రంగం సిద్ధమైంది. సుదీర్ఘకాలంగా ఒకే పోస్టులో కొనసాగుతోన్న అధికారులను మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సుమారు 10 నుంచి 12 మంది అధికారులను బదిలీ చేసే అవకాశాలున్నాయి. కీలకమైన ఆర్థిక, పురపాలక, ఐటీ శాఖల కార్యదర్శులను మార్చాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఏడాది నుంచి ఖాళీగా ఉన్న రెవెన్యూ శాఖకార్యదర్శి పోస్టును ఈ సారి భర్తీ చేసే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈమేరకు ఐఏఎ్‌సల బదిలీలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ బుధవారం సీఎం కేసీఆర్‌తో చర్చించారు. ఈ ప్రతిపాదనలకు సీఎం ఆమోదం లభించిన వెంటనే బదిలీ ఉత్తర్వులు విడుదలయ్యే అవకాశాలున్నాయి. నిజానికి 2018 ఎన్నికలకు ముందు కేసీఆర్‌ ప్రభుత్వం ఒకే సారి 50 మంది అధికారులను  బదిలీ చేసింది. ఆ తర్వాత శాసన సభను రద్దు చేయడం ద్వారా మధ్యంతర ఎన్నికలకు వెళ్లింది. అప్పటి నుంచి భారీ స్థాయిలో బదిలీలు జరగలేదు. పరిపాలనా సౌలభ్యం దృష్ట్యా ఒకరిద్దరు సీనియర్లను మారుస్తూ వస్తోంది. చివరిసారిగా ఆగస్టు 30న 14 మంది ఐఏఎస్‌లను సర్కార్‌ బదిలీ చేసింది. తాజాగా సీనియర్‌ అధికారులను బదిలీ చేయాలని నిర్ణయించింది. 


మార్పులు ఇలా..

కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా అనేక ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న ఆర్థిక శాఖకు కొత్త కార్యదర్శిని నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న కె.రామకృష్ణారావు ఐదున్నరేళ్లుగా అదే పదవిలో కొనసాగుతున్నారు. గతంలో రామకృష్ణారావు ఆర్థిక శాఖను నిర్వహిస్తుండగా... అదే శాఖ ఆధీనంలోని వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌ శాఖ ముఖ్యకార్యదర్శిగా ప్రస్తుత సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఉండేవారు. 2019 డిసెంబరులో సీఎస్‌గా సోమేశ్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇరువురి మధ్య కొంత ఎడం పెరిగినట్లు చర్చ జరుగుతోంది. పైగా రెవెన్యూ శాఖకు సమర్థమైన అధికారిని నియమించాలని కేసీఆర్‌ చాలా కాలంగా యోచిస్తున్నారు. ఈమేరకు రామకృష్ణారావును  రెవెన్యూకు మారుస్తారని తెలిసింది. అలాగే, ప్రస్తుతం పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి, విద్యాశాఖ ఇన్‌చార్జి కార్యదర్శిగా ఉన్న సందీ్‌పకుమార్‌ సుల్తానియాను ఆర్థిక శాఖ కార్యదర్శిగా నియమిస్తారని సమాచారం. 


సుల్తానియా సీఎస్‌ సోమేశ్‌కు సన్నిహితుడన్న పేరుంది. పైగా ఇద్దరూ బిహార్‌కు చెందిన వారే. ఆయనను ఆర్థిక శాఖ కార్యదర్శిగా నియమించాలని సీఎస్‌ యోచిస్తున్నట్లు తెలిసింది. ఇక.. సుదీర్ఘ కాలంగా అవే పోస్టుల్లో కొనసాగుతోన్న జయేశ్‌ రంజన్‌, అర్వింద్‌కుమార్‌ను పరస్పరం బదిలీ చేసే అవకాశాలున్నాయి. 2018 ఫిబ్రవరి నుంచి పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతోన్న అర్వింద్‌ను ఐటీ, పరిశ్రమల శాఖకు మారుస్తారని తెలిసింది. 2015 ఏప్రిల్‌ 13న ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన జయేశ్‌ను పురపాలకశాఖకు మారుస్తారని సమాచారం. జీఏడీ ముఖ్యకార్యదర్శిగా ఉన్న వికా్‌సరాజ్‌కు విద్యాశాఖ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. వీరితో పాటు మరికొంత మందిని బదిలీ చేయనున్నట్లు తెలిసింది. అయితే, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాల్లో కలెక్టర్లను బదిలీ చేసే అవకాశాల్లేవని తెలుస్తోంది.  

Advertisement
Advertisement