కేంద్రమంత్రి హర్షవర్ధన్‌కి లేఖ రాసిన రామకృష్ణ

ABN , First Publish Date - 2020-08-11T14:38:19+05:30 IST

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌కి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు.

కేంద్రమంత్రి హర్షవర్ధన్‌కి లేఖ రాసిన రామకృష్ణ

విజయవాడ: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌కి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. కేంద్ర బృందం ఏపీలో పర్యటించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. కరోనా కట్టడిలో ఏపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, తెలంగాణలో 675 మరణాలు, 79 వేలు పాజిటివ్ కేసులుంటే.. ఏపీలో 2,27,000 కేసులు, 2 వేల మరణాలు సంభవించాయన్నారు. ప్రతిరోజూ 10 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతూ ఆంధ్రప్రదేశ్ దేశంలో మూడో స్థానానికి చేరిందన్నారు.


కరోనా మహమ్మారిని పారాసిటమాల్, బ్లీచింగ్ పౌడర్‌లతో తరమొచ్చని సీఎం జగన్మోహన్ రెడ్డి తేలిక వ్యాఖ్యలు చేశారని రామకృష్ణ అన్నారు. ఇప్పుడు సరైన వైద్యం, ఆహారం అందక కరోనా బాధితులు మంత్రి ఆళ్ల నానిని నిలదీస్తున్నారన్నారు. విజయవాడ స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది మరణించారన్నారు. మాస్కులు, పిపిఈకిట్లు ఇవ్వటంలేదని జూనియర్ డాక్టర్లు ఆందోళన బాట పట్టారన్నారు. ప్రజల ప్రాణాలను గాలికొదిలేసి ఏపీ ముఖ్యమంత్రి ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా వివాదాస్పద అంశాలకే ప్రాధాన్యమిస్తున్నారని, కరోనా నియంత్రణకు నిర్దిష్ట చర్యలు చేపట్టకుండా అమరావతి నుండి రాజధానిని విశాఖ తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని రామకృష్ణ ఆ లేఖలో పేర్కొన్నారు.

Updated Date - 2020-08-11T14:38:19+05:30 IST