Abn logo
Jun 22 2021 @ 00:39AM

న్యాయపాలనలో ‘రమణ ప్రభావం’

అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తి ప్రభావం చాలా ప్రధానమైనది. పోలీస్ లాంటి విభిన్న స్థాయిలతో కూడిన పౌరభద్రతా వ్యవస్థ విషయంలో అది ఒక అంగీకృత వాస్తవం. అయితే ఈ సూత్రం మానవకృషిలోని అన్ని అంశాలకూ వర్తిస్తుంది. న్యాయ పరిపాలనలో ఆ నియమ అనువర్తనానికి నిదర్శనం ముందుగా ఢిల్లీ హైకోర్టు, అలహాబాద్ హైకోర్టు, బాంబే హైకోర్టు ఔరంగాబాద్‌ బెంచ్‌లో లభ్యమయింది. 


గత ఏప్రిల్‌లో భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్‌వి రమణ పదోన్నతి పొందిన తరువాత ఉన్నత న్యాయవ్యవస్థలో ఒక కదలిక ప్రారంభమయింది. న్యాయవిహితంకాని నిర్బంధంలో ఏడాదిపాటు మగ్గిన ముగ్గురు క్రియాశీలురు గత గురువారం బెయిల్‌పై విడుదల కావడమే అందుకొక తాజా నిదర్శనం. స్వేచ్ఛ పొందిన ముగ్గురిలో జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన ఇద్దరు విద్యార్థినులు, జామియామిలియా విద్యార్థి ఒకరు ఉన్నారు. ఈ యువజనులకు సంభవించిన నష్టానికి ఎవరు పరిహారం చెల్లిస్తారనేది ఎవరికివారు ఊహించుకోవల్సిందే. ఢిల్లీ పోలీసుల న్యాయవిరుద్ధ ప్రవర్తన, వారి తప్పుడు విధేయత విషయమై ఢిల్లీ హైకోర్టు చెప్పిన దాని గురించి మాత్రమే నేను ప్రతిస్పందిస్తున్నాను. 


‘శాంతియుతంగా నిరసన తెలపడం ఒక హక్కు, అది ఉగ్రవాద చర్య కాదు’ అని జస్టిస్ సిద్ధార్థ్‌ మృదుల్, జస్టిస్ అనూప్ భంభాని సభ్యులుగా గల ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రతి పోలీస్‌ అధికారి తన శిక్షణలో ఇదే విషయాన్ని నేర్చుకుంటాడు. భారత రాజ్యాంగం దేశపౌరులకు హామీ ఇచ్చిన హక్కులను ఢిల్లీ పోలీసులు ఆకస్మికంగా ఎలా మరచిపోయారు? 


ఏడాది పాటు నిర్బంధితులై ఢిల్లీ హైకోర్టు ఆదేశంతో బెయిల్‌పై విడుదలయిన ముగ్గురు యువవిద్యార్థులు చేసిన నేరమేమిటి? పౌరసత్వ సవరణ చట్టం ముస్లింల పట్ల చూపుతున్న వివక్షకు వ్యతిరేకంగా వారు నిరసన తెలిపారు. అదే పెద్ద అపరాధంగా వారిని అరెస్ట్ చేశారు. దీన్ని నేను తీవ్రంగా తప్పుపడుతూ సంవత్సరం క్రితం ఢిల్లీ పోలీస్ ఛీఫ్‌కు వ్యక్తిగతంగా ఒక లేఖ రాశాను. ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన అల్లర్లను నిజంగా పురిగొల్పిన వ్యక్తులను (నిరసనకారులపై దాడులను వీరు రెచ్చగొట్టడాన్ని టీవీ కెమెరాలు స్పష్టంగా చూపించాయి) అరెస్ట్ చేయకుండా వదిలివేయడాన్ని కూడా నేను విమర్శించాను. 


తన రాజకీయ యాజమానుల ఆజ్ఞల వల్లో లేదా వారికి సన్నిహితమవ్వాలనే ఆరాటంతోనో భారతీయ జనతాపార్టీకి చెందిన ముగ్గురు నాయకుల (వీరిలో ఒకరు కేంద్రంలో సహాయమంత్రి) జోలికిపోకుండా, షహీన్‌బాగ్‌లో శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్న కొంతమంది మహిళలను, ముగ్గురు యువవిద్యార్థులను ఢిల్లీ పోలీస్ కమిషనర్ నిర్బంధంలోకి తీసుకున్నారు. నిజమే, వారు రోజుల పాటు రోడ్లపై బైఠాయించి, పౌరజీవనానికి ఆటంకాలు సృష్టించారు. అయితే, బెయిల్‌ను నిరాకరించే దుర్మార్గమైన ‘చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం’- (ఊపా) కింద వారిని అరెస్ట్ చేయడం ఎంత మాత్రం పరిష్కారం కాదు. అరెస్ట్ చేయడానికి మారుగా మహిళా పోలీసుల సహాయంతో వారిని అక్కడి నుంచి తరలించి ఉండవల్సింది. 


‘భారత గణతంత్ర రాజ్య పునాదులు చాలా దృఢమైనవని, విద్యార్థుల ఆందోళనకు అవి కదిలిపోవని జస్టిస్‌ మృదుల్, జస్టిస్ భంభానీవ్యాఖ్యానించారు. ఊపా కింద ముగ్గురు యువ విద్యార్థుల అరెస్ట్‌కు ఆదేశించిన ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కూ ఈ సత్యం బాగా తెలిసే ఉంటుంది. అయినప్పటికీ రాజ్యాంగానికి నిబద్ధమై ఉంటానన్న తన ప్రమాణాన్ని విస్మరించి పాలకుల పట్ల తన విధేయతను చాటుకోవడానికే ఆయన మొగ్గు చూపారు. 


కమిషనర్ ఎస్‌ఎన్ శ్రీవాస్తవతో నేను తీవ్రంగా విభేదించినప్పుడు నా మాజీ ఐపిఎస్ సహచరులు పలువురు ఢిల్లీ పోలీస్ ఛీఫ్‌ చర్యలను సమర్థించారు. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు మరోలా ఆలోచించడం నాకు ఆనందాన్ని కలిగించింది. న్యాయం ఏ భావజాలాన్ని అనుసరించదు. కులం, మతం, వర్గం, ఆర్థిక లేదా సామాజిక హోదాకు అది అతీతమైనది. అన్నిటి కంటే ముఖ్యంగా భావజాలానికి అది అన్యమైనది.


న్యాయసాధనకు ప్రయత్నిస్తున్న వారికి భరోసానిచ్చింది ఢిల్లీ హైకోర్టు తీర్పు మాత్రమే కాదు. అటువంటి తీర్పులు మరికొన్ని ఇటీవలి రోజులలో వెలువడ్డాయి. వాటిలో ఒకటి దేశద్రోహ ఆరోపణల నెదుర్కొంటున్న సినిమా దర్శకురాలు అయిషా సుల్తానాకు కేరళ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చిన తీర్పు. లక్షద్వీప్‌కు చెందిన ఆ యువతి, ఆ దీవిలో నివసించే అరవైవేల మంది శతాబ్దాలుగా అనుభవిస్తున్న స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను హరించివేసేందుకు పాలకులు చేపట్టిన చర్యలను తీవ్రంగా విమర్శించారు. శాంతియుతంగా నివసిస్తున్న ప్రజలపై లక్షద్వీప్ పరిపాలకుడు ఒక ‘జీవాయుధాన్ని’ ప్రయోగించారని సుల్తానా దుయ్యబట్టారు. ఆమె ఆరోపణకు ఆగ్రహించిన ఆ పరిపాలకుడు బీజేపీ స్థానిక అధ్యక్షుడిని పురిగొల్పి తన విమర్శకురాలిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయించారు. అయితే కేరళ హైకోర్టు జాగు చేయకుండా ఆ అర్థరహిత ఎఫ్ఐఆర్‌ను కొట్టేసింది. ఇంత శీఘ్రగతిన ఈ న్యాయ నిర్ణయం వెలువడడం ఉన్నత న్యాయవ్యవస్థలో ‘రమణ ప్రభావానికి’ ఒక రుజువుగా భావిస్తున్నాను. 


కొద్ది సంవత్సరాలుగా ఢిల్లీ పోలీసు చర్యలలో కర్కశప్రవృత్తి బాగా ద్యోతకమవుతోంది. ముగ్గురు యువవిద్యార్థులకు బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుకు వారు ప్రతిస్పందించిన తీరులో అది మరింతగా దృగ్గోచరమయింది. ఏవో కుంటిసాకులతో ముగ్గురు యువకులను విడుదల చేయకుండా ఉండేందుకు ఢిల్లీ పోలీసులు విఫలయత్నం చేశారు. 


‘జైలు కాదు, బెయిల్’ అన్న సూక్తిని తొలుత ప్రవచించిన సువిఖ్యాత ధర్మ మూర్తి జస్టిస్‌ ఆర్‌వి కృష్ణయ్యర్ అగ్రజుడు వి. లక్ష్మీనారాయణ్ నాకు సీనియర్ సహచరుడు. తమిళనాడు కేడర్‌కు చెందిన లక్ష్మీనారాయణ్ సిబిఐ జాయింట్ డైరెక్టర్‌గా విశేషసేవలు అందించిన ఉత్తమ పోలీస్‌ అధికారి. న్యాయ వ్యవస్థలో పరిణామాలను నిశితంగా గమనిస్తున్న వారికి అరెస్ట్, విచారణ ప్రక్రియనే అసలు శిక్షగా మార్చివేసేందుకు ప్రస్తుత పాలకులు సంకల్పించినట్టుగా స్పష్టమవుతున్నది. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వారిపై మోపుతున్న కేసులు వాస్తవాల ఆధారంగా, బలమైన కారణాలతో బనాయిస్తున్నవి కావని, న్యాయ విచారణలో అవి నిలబడవని పాలకులకు స్పష్టంగా తెలుసు. చేయని నేరాలకు, వాస్తవానికి అటువంటి సంకల్పమే లేని పలువురు ప్రజా ఉద్యమకారులను సంవత్సరాల తరబడి నిర్బంధంలో ఉంచడం రాక్షసకృత్యం గాక మరేమవుతుంది?


న్యాయకోవిదుడు కృష్ణయ్యర్‌తో ఏకాంతంగా సంభాషించే అరుదైన అవకాశం నాకు ఒకసారి లభించింది. తన సోదరుడు లక్ష్మీనారాయణ్ పట్ల ఆయనకు ఉన్న సంపూర్ణ గౌరవభావం నన్ను ముగ్ధుడ్ని చేసింది. మా సంభాషణల్లో ఆయన తన అగ్రజుడి నైతికనిష్ఠ, నిజాయితీ గురించి నొక్కిచెప్పారు. లక్ష్మీనారాయణ్ ఇప్పుడు ఢిల్లీ పోలీస్ ఛీఫ్‌గా ఉన్నట్టయితే ఈశాన్య ఢిల్లీ హింసాకాండకు కారకులయిన అసలు వ్యక్తులు చట్టం నుంచి అంత తేలిగ్గా తప్పించుకోగలిగేవారు కాదని, అమాయకులు అయిన యువ విద్యార్థులు అన్యాయానికి బలయ్యేవారు కాదని నేను విశ్వసిస్తున్నాను. 

జూలియో రిబెరో  

(‘స్క్రోల్’ సౌజన్యం) విశ్రాంత ఐపీఎస్ అధికారి