సింధుకు ఎలా ఇస్తారు?

ABN , First Publish Date - 2021-10-23T08:02:49+05:30 IST

క్రీడాకారులందరినీ సమానంగా చూడాల్సిన ప్రభుత్వాలు జీఓలను ఉల్లంఘించి కొద్దిమందికి లబ్ధి చేకూర్చేలా పనిచేయడం అన్యాయమని జేడీ (యూ) రాష్ట్ర కార్యదర్శి ఏవీ రమణ రెండు తెలుగు రాష్ట్రాల లోకాయుక్తల్లో..

సింధుకు ఎలా ఇస్తారు?

లోకాయుక్తలో సర్కార్‌పై ఫిర్యాదు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): క్రీడాకారులందరినీ సమానంగా చూడాల్సిన ప్రభుత్వాలు జీఓలను ఉల్లంఘించి కొద్దిమందికి లబ్ధి చేకూర్చేలా పనిచేయడం అన్యాయమని జేడీ (యూ) రాష్ట్ర కార్యదర్శి ఏవీ రమణ రెండు తెలుగు రాష్ట్రాల లోకాయుక్తల్లో ఫిర్యాదు చేశారు. 2016లో రియో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన సింధుకు తెలంగాణ ప్రభుత్వం 5 కోట్ల నగదు, 1000 గజాల ఇంటి స్థలం, ఆమె మాజీ కోచ్‌ గోపీచంద్‌కు 1 కోటి నగదు ఇచ్చింది. అలానే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సింధుకి 3 కోట్ల నగదు ప్రోత్సాహకాన్ని అందించింది. తెలంగాణ వైఏటీసీ అండ్‌ స్పోర్ట్స్‌ జీఓ నెంబర్‌ 1 ప్రకారం ఒలింపిక్స్‌లో రజతం నెగ్గిన ప్లేయర్‌కు రూ.కోటి.. ఆంధ్రలోని వైఏటీసీ జీఓ ప్రకారం రూ.50 లక్షలు మాత్రమే ఇవ్వాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. అలానే ఈ జీఓలోని 9వ క్లాజ్‌ ప్రకారం పతకాలు సాధించిన క్రీడాకారులకు నగదు ప్రోత్సాహకాలు తప్ప.. భూమి, ఇంటి స్థలం వంటివి ఇవ్వకూడదని స్పష్టంగా ఉందని తన ఫిర్యాదులో తెలిపారు.


ఈ విషయమై రెండు రాష్ట్రాల లోకాయుక్తలో తాను గత ఏడాది ఫిర్యాదు చేశానని.. తెలంగాణ లోకాయుక్త ఇప్పటికే వైఏటీసీ అండ్‌ స్పోర్ట్స్‌ సెక్రటరీ నుంచి వివరణ తీసుకుందని ఆయన చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు నిబంధనలను పక్కనపెట్టి కేటాయింపులు చేశామని లోకాయుక్తకు సెక్రటరీ బదులిచ్చారని.. వచ్చే నెల 19న ఈ కేసు తదుపరి విచారణ జరగనుందని తెలిపారు. జీఓలను ఉల్లఘించి సింధుకు అధికంగా ఇచ్చిన నగదు, ఇంటి స్థలంను తిరిగి ప్రభుత్వం స్వాధీన పరుచుకోవాలని రమణ కోరారు.

Updated Date - 2021-10-23T08:02:49+05:30 IST