రామన్నకే స్టీరింగ్‌

ABN , First Publish Date - 2022-01-27T06:13:37+05:30 IST

ఎవరూ ఊహించని రీతిలో టీఆర్‌ఎస్‌ పార్టీ అధిష్ఠానం కారు స్టీరింగ్‌ బాధ్యతలు ఎమ్మెల్యే జోగురామన్నకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే పార్టీ బలోపేతం కోసం వార్డు, గ్రామ, మండ లస్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షున్ని మాత్రం నేరుగా

రామన్నకే స్టీరింగ్‌
జిల్లా కేంద్రంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం

టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా జోగు రామన్న నియామకం
ఎమ్మెల్యేకే ‘కారు’ స్టీరింగ్‌
ఆశావహ సీనియర్‌ నేతల్లో మొదలైన అసంతృప్తి
పదవులున్న వారికే.. పదవులంటూ నాయకుల గుస్సా
పార్టీ నేతల మధ్య వర్గ విభేధాలకు చెక్‌పడేనా?!

ఆదిలాబాద్‌, జనవరి 26(ఆంధ్రజ్యోతి): ఎవరూ ఊహించని రీతిలో టీఆర్‌ఎస్‌ పార్టీ అధిష్ఠానం కారు స్టీరింగ్‌ బాధ్యతలు ఎమ్మెల్యే జోగురామన్నకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే పార్టీ బలోపేతం కోసం వార్డు, గ్రామ, మండ లస్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. జిల్లా అధ్యక్షున్ని మాత్రం నేరుగా పార్టీ అధ్యక్షుడు కేసీఆరే ప్రకటిస్తారని ప్రచారం జరిగింది. దీంతో ఇన్నాళ్లు పార్టీ అధ్యక్షుని ఎంపికపై ఆసక్తి కనిపించింది. ఎట్టకేలకు ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగు రామన్నను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తూ టీఆర్‌ఎస్‌ పార్టీ అధిష్ఠానం జాబితాను విడుదల చేసింది. మొదటి నుంచి మాజీ ఎంపీ గేడం నగేష్‌, పాడి పరిశ్రమ చైర్మన్‌ లోక భూమారెడ్డి, జిల్లా రైతుబంధు చైర్మన్‌ అడ్డి భోజారెడ్డి, బోథ్‌ ఎంపీపీ తుల శ్రీనివాస్‌, మాజీ మున్సిపల్‌ చైర్మ న్‌ భర్త రంగినేని పవన్‌రావు, రోకండ్ల రమేష్‌ పేర్లు ప్రధానంగా వినిపించాయి. అయితే ఎమ్మెల్యే జోగు రామన్న కూడా ఇందులో ఒకరిద్దరు నేతలకు మద్దతునిస్తూ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లారు. కొంత కాలం జిల్లా అధ్యక్షుడి ఎంపిక పెండింగ్‌లో పెట్టిన అధిష్ఠానం ఎవరూ ఊహించని రీతిలో రామన్నకు బాధ్యతలు అప్పగిస్తూ జాబితాను విడుదల చేయ డం టీఆర్‌ఎస్‌ వర్గాలను విస్మయానికి గురి చేస్తోంది. ప్రస్తుతం జిల్లాలో రెండు నియోజక వర్గాలు పూర్తిస్థాయిలో ఉండగా.. మరో రెండు నియోజకవర్గాలు పాక్షికంగా ఉన్నాయి. ప్రస్తుతం అన్ని నియోజకవర్గాల్లో నేతల మధ్య వర్గవిభేధాలే కనిపిస్తున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీని ముందుకు నడిపించడం అంతా తేలికైనా పనేమి కాదంటున్నారు. పలుమార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసిన అనుభవం ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే జోగు రామన్న జిల్లా నేతలను సమన్వయం చేస్తాడన్న నమ్మకంతోనే అధిష్ఠానం ఆయనకు పార్టీ పదవి బాధ్యతలను అప్పగించినట్లు పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు.
ఫ అంచనాలు తలకిందులు
పార్టీ జిల్లా అధ్యక్ష పదవి కేటాయింపుపై అందరి అంచనాలు తలకిందులయ్యాయి. ఊహించిన విధంగా కాకుండా పార్టీ అధిష్ఠానం జిల్లా అధ్యక్షున్ని నియమించడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కొందరు సీనియర్‌ నేతలు పార్టీ పదవిపై భారీ ఆశలు పెట్టుకున్న పదవి దక్కక పోవడంతో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమ కాలం నుంచి పార్టీనే నమ్ముకుని పని చేస్తున్న పార్టీ పదవుల్లోను అవకాశం దక్కడం లేదని పలువురు నేతలు వాపోతున్నారు. కనీసం నామినెట్‌ పద వులనైనా కేటాయించడం లేదంటున్నారు. జిల్లాలో సీనియర్‌ నేతలుగా పేరున్న లోక భూమారెడ్డి, గేడం నగేష్‌ లకు అధ్యక్ష పదవి రావడం ఖాయమన్న ప్రచారం జరిగింది. అలాగే అడ్డి భోజారెడ్డి, రోకండ్ల రమేష్‌కు ఎమ్మెల్యే జోగు రామన్న ఆశీస్సులు ఉన్నట్లు చర్చ సాగింది. మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ రంగినేని మనిషా భర్త పవన్‌రావ్‌కు కేటీఆర్‌తో సన్నిహిత సంబంధాలు ఉండడంతో ఆయన కూడా పార్టీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్లు వినిపించింది. అయితే ఎమ్మెల్యేను కాదని ఇతర నేతలకు పార్టీ పదవులు అప్పగిస్తే మరిన్ని విభేధాలకు కారణమవుతుందన్న ఉద్దేశంతోనే అధిష్ఠానం సిట్టింగ్‌ ఎమ్మెల్యేకే పార్టీ పగ్గాలు అప్పగించిందన్న అభిప్రాయాలు పార్టీలో వ్యక్తమవుతున్నాయి.
ఫ ఆలోచనలో పడ్డ నేతలు
పార్టీ అధ్యక్షుడి ఎంపికపై అనుకున్నది ఒక్కటి, అయినది మరొకటి కావడం తో సీనియర్‌ నేతలంతా సమాలోచనలో పడ్డట్లు కనిపిస్తోంది. పార్టీనే నమ్ముకుని పని చేస్తున్న నేతలకు పార్టీ పదవులతో పాటు నామినేట్‌ పదవులను కేటా యించడం రాజకీయ పార్టీలకు సర్వసాధారణమే. కానీ ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ పార్టీలో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు తమ అనుచరులకు, సన్నిహితులకు పార్టీ పదవులు దక్కేలా ప్రయత్నాలు చేయడం తెలిసిందే. కాని ఎవరు అడుగకున్న అధిష్ఠానమే ఎమ్మెల్యేకు పార్టీ అధ్యక్ష పదవిని కేటాయించడం వెనుక అసలు ఆంతర్యమేమిటో అంతుచిక్కడం లేదంటున్నారు. అసలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇలా ఎందుకు చేశాడనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కొందరు ఎమ్మెల్యేలు అధిష్ఠానం తీరును తప్పుబడుతున్నట్లు తెలుస్తుంది.  
అందరి సహకారంతో పార్టీని బలోపేతం చేస్తా
: జోగు రామన్న (ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు)
జిల్లాలోని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తల సహకారంతో పార్టీని మరింత బలోపేతం చేస్తా. పార్టీ అధిష్ఠానం నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. ప్రస్తుతం జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీదే ఆధిపత్యం ఉంది. వచ్చే ఎన్నికల వరకు మరింత బలోపేతం చేసి జిల్లాలోని అన్ని స్థానాల్లో టీఆర్‌ఎస్‌ విజయం సాధించేలా పక్కా ప్రణాళికతో ముందుకెళ్తా. పార్టీ నేతల మధ్య కొంత అసమ్మతి, విభేధాలు ఉండడం అన్ని రాజకీయ పార్టీలో సహజమే. అందరిని కలుపుకునిపోయి పటిష్టమైన క్యాడర్‌ను ఏర్పాటుచేస్తా. పార్టీనే నమ్ముకుని ఉన్న కార్యకర్తలు అందరికీ అండగా ఉంటా. ఏదైనా అధిష్ఠానం ఆదేశాల మేరకే ముందుకెళ్తా.

Updated Date - 2022-01-27T06:13:37+05:30 IST