అభివృద్ధి వైపు అడుగులు

ABN , First Publish Date - 2021-08-02T05:30:00+05:30 IST

అందరి చూపు చారిత్రక రామప్పపై పడింది. యునెస్కో గుర్తింపుతో ఈ ఆలయానికి మరింత ప్రాధాన్యం పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. అయితే రామప్ప చుట్టూ అభివృద్ధికి కావాల్సిన భూములు అందుబాటులో ఉన్నాయా..? ఉంటే ఎన్ని ఎకరాలు.. ఎక్కడెక్కడ.. ఎంత ? అనే లెక్కలపై ఆరా తీస్తోంది. రామప్ప పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములపై సమగ్రంగా సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

అభివృద్ధి వైపు అడుగులు
రామప్ప పరిసర ప్రాంతాలు

రామప్ప పరిసరాల్లో సర్కారు భూముల గుర్తింపు

పాలంపేట, వెంకటాపూర్‌, రామనుజపురం గ్రామాల్లో సర్వే

అందుబాటులో ఉన్న భూముల వివరాల సేకరణ

ప్రభుత్వ కార్యాలయాలు, టూరిజం,  హరిత హోటల్‌ కోసం స్థలాల పరిశీలన

కేంద్రీయ విద్యాలయం, కేజీ టు పీజీ కాలేజీ కోసం భూ అన్వేషణ

(ఆంధ్రజ్యోతి, భూపాలపల్లి)

అందరి చూపు చారిత్రక రామప్పపై పడింది. యునెస్కో గుర్తింపుతో ఈ ఆలయానికి మరింత ప్రాధాన్యం పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం   దీన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. అయితే రామప్ప చుట్టూ అభివృద్ధికి కావాల్సిన భూములు అందుబాటులో ఉన్నాయా..? ఉంటే ఎన్ని ఎకరాలు.. ఎక్కడెక్కడ.. ఎంత ? అనే లెక్కలపై ఆరా తీస్తోంది. రామప్ప పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములపై సమగ్రంగా సర్వే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధానంగా ఆలయం ఉన్న పాలంపేటతో మండల కేంద్రమైన వెంకటాపూర్‌, పక్కనే రామానుజపురం గ్రామాల్లో ప్రభుత్వ, అటవి, పట్టా, ఇతర భూములు ఎన్ని ఉన్నాయో అధికారులు లెక్కలు తీస్తున్నారు. ఇప్పటికే అధికారులు తమ వద్ద సమాచారం మేరకు ఎక్కడెక్కడ ఎన్ని ఎకరాల సర్కారు భూమి అందుబాటులో ఉందో ప్రభుత్వానికి నివేదిక అందించారు. అయితే.. ప్రభుత్వ భూమితో పాటు ఎక్కువ సంఖ్యలో అటవీ శాఖ అధీనంలోని భూమి కూడా వేల ఎకరాల్లో అందుబాటులో ఉంది. నిర్మాణాలకు ప్రభుత్వ భూములు సరిపోక పోతే ఫారెస్టు భూములను కూడా వినియోగించుకునేందుకు వీలుగా ముందుగానే అనుమతుల కోసం అటవీ శాఖకు ప్రతిపాదనలు చేయాలని అధికారులు నిర్ణయించారు. పాలంపేట, రామానుజపూర్‌, వెంకటాపూర్‌ గ్రామాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రభుత్వం భూమి ఎంత..? కబ్జాకు గురైన భూమి ఎంత? అనే విషయపై సమగ్రంగా సర్వే నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. దీంతో త్వరలోనే ప్రత్యేక బృందాలతో భూ సర్వే చేయనున్నారు.

36వేల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములు

రామప్ప చుట్టు పక్కల ఉన్న పాలంపేట, రామానుజపురం, వెంకటాపూర్‌ గ్రామాల్లో ప్రాథమిక అంచనాల ప్రకారం 36వేల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వీటిలో పాలంపేట రెవెన్యూ పరిధిలో 1,544 ఎకరాల ప్రభుత్వ భూమి, తొమ్మిది ఎకరాల్లో అడ వి భూమి, 1,567 ఎకరాల్లో పట్టా భూములు ఉన్నట్టు గుర్తించారు. అలాగే రామానుజపురం గ్రామంలో 2,127 ఎకరాల్లో ప్రభుత్వ భూమి, 3,945 ఎకరాల్లో పట్టా భూమి ఉందని నిర్ధారించారు. వెంకటాపూర్‌ మండల కేంద్రం లో 33,163 ఎకరాల్లో ప్రభుత్వ భూమి, 8,540 పట్టా భూములు ఉన్నాయి. అలాగే 30,152 ఎకరాల్లో అడవి భూములు ఉన్నాయి. మొత్తం ఈ మూడు గ్రామాల్లో 36,834 ఎకరాల ప్రభుత్వ భూమి, 30,161 ఎకరాల్లో అడవి భూ ములు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అయితే ప్రభుత్వ భూముల్లో చాలా వరకు రైతుల సాగు చేసుకుంటున్నారు. దాదాపు 65 శాతానికి పైగా భూములు రైతుల వద్ద ఉండటంతో ఎలా సేకరించాలనే విషయంపై రెవెన్యూ అధికారులు సమాలోచనలు చేస్తున్నారు.  

సర్కారు భూముల కోసం అన్వేషణ

రామప్పకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభిస్తున్న నేపథ్యంలో ఈ ఆలయ పరిసరాల్లో విద్యాలయాల నిర్మాణంతో విద్యార్థులకు ప్రశాంతత, విజ్ఞానం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే అప్పటి ఎంపీ సీతారాంనాయక్‌ కేంద్రంతో కొట్లాడి కేంద్రీయ విద్యాలయాన్ని సాధించారు. 2018లో కేంద్రీయ విద్యాలయం రామప్పకు మంజూరైనప్పటికీ స్థలం లేదనే కారణంతో ఇప్పటి వరకు తరగతులు నిర్వహించటం లేదు. ప్రస్తుతం రామప్పకు యునెస్కో గుర్తింపుతో కేంద్రీయ విద్యాలయానికి స్థల పరిశీలన చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అలాగే కేజీ టు పీజీ విద్య కోసం ఏర్పాటు చేసిన గురుకులం కూడా రామప్పకు మంజూరైంది. స్థలం, భవనాల కొరత పేరుతో ములుగు జిల్లా జాకారం వద్ద ఈ కళాశాలను నిర్వహిస్తున్నారు. కేంద్రీయ విద్యాలయంతో పాటు కేజీ టు పీజీ గురుకులానికి కూడా స్థల సేకరణ చేయాల్సి ఉంది. వీటితో పాటు మరిన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురకులాలను రామప్పలో నెలకోల్పాలని విద్యా శాఖ భావిస్తోంది. దీంతో పాటు ప్రైవేటు విద్యా సంస్థలు కూడా ఇదే ప్రాంతంలో తమ బ్రాంచీలను ప్రారంభించేందుకు ఉత్సాహన్ని చూపిస్తున్నాయి.  వీటితో పాటు ప్రభుత్వం హరిత హోటల్‌, పర్యాటకులకు కనీస సౌకర్యాలు కల్పించేందుకు విశ్రాంతి గదులు, పార్కులు, ఎగ్జిబిషన్లు, బస్‌స్టేషన్‌, సులభ్‌ కాంప్లెక్స్‌లు తదితర నిర్మాణాలను చేపట్టాల్సి ఉంది. ప్రభుత్వ అధికారులు, మంత్రులు విడిది చేసేందుకు కూడా ప్రత్యేకంగా గదులు నిర్మించాలని పర్యాటక శాఖ భావిస్తోంది. వీటికి కూడా ప్రభుత్వ భూములు అవసరమవుతాయి. ఈ నేపథ్యంలో రామప్ప పరిసరాల్లో ప్రభుత్వ భూముల గుర్తింపు ప్రక్రియ వేగవంతం చేయాలని నిర్ణయించారు. 

ఽభూముల ధరలు అదరహో...

 రామప్పను యునెస్కో కోసం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న క్రమంలోనే ఈ ప్రాంతంలో భూముల ధరలు పెరిగిపోయాయి. ఈసారి రామప్పకు యునెస్కో గుర్తింపు పక్కా అని భావించి చాలా మంది వందల ఎకరాల్లో భూములు కొనుగోలు చేశారు. రూ.10లక్షల నుంచి రూ.18లక్షల వరకు ధరల పలికిన భూములు గత ఏడాది నుంచి ఎకరాకు రూ.40లక్షలకు పైగా అమ్ముడుపోయాయి. యునెస్కో గుర్తింపుతో ప్రస్తుతం రామప్ప పరిసరాల్లో ఎకరాకు రూ.80 లక్షల నుంచి రూ.కోటికి పైగా వెచ్ఛించి కొనుగోలు చేసేందుకు రియల్టర్లు రెడీ అవుతున్నారు. పాలంపేట, రామానుజపురం, వెంకటాపూర్‌, ఇంచెర్ల, జంగాలపల్లి వరకు, ఇటు భూపాలపల్లి జిల్లా గణపురం, గాంధీనగర్‌ వరకు రామప్ప ప్రభావంతో భూముల ధరలు పెరుగుతున్నాయి. 


Updated Date - 2021-08-02T05:30:00+05:30 IST