రమేశ్‌ పొవార్‌కు పగ్గాలు

ABN , First Publish Date - 2021-05-14T10:08:16+05:30 IST

భారత మహిళల క్రికెట్‌ జట్టు నూతన ప్రధాన కోచ్‌గా రమేశ్‌ పొవార్‌ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని బీసీసీఐ ట్విటర్‌లో పేర్కొంది.

రమేశ్‌ పొవార్‌కు పగ్గాలు

భారత మహిళల క్రికెట్‌ కోచ్‌గా నియామకం


న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్‌ జట్టు నూతన ప్రధాన కోచ్‌గా రమేశ్‌ పొవార్‌ను ఎంపిక చేశారు. ఈ విషయాన్ని బీసీసీఐ ట్విటర్‌లో పేర్కొంది. మొత్తం 35 మంది ఈ పదవికి పోటీ పడ్డారు. అయితే మదన్‌లాల్‌, ఆర్పీ సింగ్‌, సులక్షణా నాయక్‌ ఆధ్వర్యంలోని క్రికెట్‌ సలహా కమిటీ పొవార్‌ వైపు మొగ్గు చూపింది. మహిళల కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించడం రమేశ్‌ పొవార్‌కిది రెండోసారి. 2018, జూలైలో అతడిని తాత్కాలిక కోచ్‌గా తీసుకున్నారు. అదే ఏడాది కరీబియన్‌ దీవుల్లో జరిగిన టీ20 ప్రపంచకప్‌ వరకు అతడి పదవిని పొడిగించారు. ఆ ఈవెంట్‌లో జట్టు సెమీస్‌ చేరింది. కాగా టీమిండియా తరఫున ఆఫ్‌ స్పిన్నర్‌గా రాణించిన పొవార్‌ రెండు టెస్టులు, 31 వన్డేలు ఆడి మొత్తం 40 వికెట్లు తీశాడు. మరోవైపు 2018, డిసెంబరు నుంచి ఇప్పటివరకు కోచ్‌గా ఉన్న డబ్ల్యూవీ రామన్‌ ఆధ్వర్యంలో గతేడాది టీ20 ప్రపంచక్‌పలో భారత్‌ రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వా త ఈ ఏడాది మార్చిలో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే, టీ20 సిరీ్‌సలను భారత్‌ కోల్పోయింది. దీంతో జట్టుకు కొత్త కోచ్‌ అవసరమని బోర్డు అభిప్రాయపడింది.


మిథాలీతో విభేదాలు:

రమేశ్‌ పొవార్‌ తొలి టర్మ్‌ వివాదాస్పదంగా ముగిసింది. కరీబియన్‌ టీ20 ప్రపంచకప్‌ సెమీ్‌సలో అనూహ్యంగా వెటరన్‌ మిథాలీ రాజ్‌ను తప్పించారు. దీని వెనుక కోచ్‌ పొవార్‌ హస్తముందని, అతడు తన కెరీర్‌ను నాశనం చేయాలనుకుంటున్నాడని మిథాలీ ఆరోపించడం సంచలనం సృష్టించింది. దీనికి దీటుగా పొవార్‌ కూడా మిథాలీపై ఎదురుదాడికి దిగాడు. కెప్టెన్‌ హర్మన్‌, స్మృతి కోచ్‌కు మద్దతు పలికినా బీసీసీఐ మాత్రం అతడిపై వేటు వేసింది. అయితే తిరిగి ఇప్పుడు 2022లో అతడి శిక్షణలోనే మిథాలీ వన్డే వరల్డ్‌క్‌పలో జట్టును నడిపించాల్సి వస్తోంది.

Updated Date - 2021-05-14T10:08:16+05:30 IST