బీజేపీలోకి రమేష్ రాథోడ్..?

ABN , First Publish Date - 2021-06-12T01:29:21+05:30 IST

ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్నారు.

బీజేపీలోకి రమేష్ రాథోడ్..?

ఆదిలాబాద్:  ఆదిలాబాద్ మాజీ ఎంపీ  రమేష్ రాథోడ్ బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ అధిష్ఠానంపై అసంతృప్తితో ఉన్నారు. తనకు పార్టీలో సముచిత స్థానం లభించడం లేదని  తన అనుచరులు, అభిమానులతో ఆవేదన పంచుకున్నట్లు సమాచారం. వారితో మాట్లాడిన అనంతరం రమేష్ రాథోడ్ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. రమేష్ రాథోడ్ బీజేపీలో చేరితే తెలంగాణలో కాంగ్రెస్‌కు కొంత మేర నష్టం కలిగే అవకాశాలున్నాయి. రమేష్ రాథోడ్ బీజేపీలో చేరికపై పార్టీతో పాటు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇప్పటికే తన అనుచరులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ వారి అభిప్రాయాలకు అనుగుణంగా పార్టీ మారాలనే యోచనలో రమేష్ రాథోడ్ ఉన్నారు. రమేష్ రాథోడ్ చేరికతో ఆదిలాబాద్‌లో కాషాయం  బలపడనుంది.  గతంలో రమేష్ రాథోడ్ ఖానాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం బీజేపీలో చేరనుండడంతో ఖానాపూర్‌లో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. 


రమేష్ రాథోడ్ తొలుత తెలుగుదేశం నుంచి టీఆర్ఎస్‌లో చేరారు. టీఆర్ఎస్‌లో కూడా తనకు సరైన ప్రాధాన్యం దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. కాంగ్రెస్‌లో కూడా ఆయనకు సరైన గుర్తింపు దక్కక పోవడంతో బీజేపీ వైపు చూస్తున్నారు. కొద్దిరోజుల క్రితమే రాథోడ్‌ను కాంగ్రెస్ అధిష్ఠానం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈటల రాజేందర్ నివాసంలో గురువారం భోజనానికి హాజరైన బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇన్‌చార్జీ తరుణ్ చుగ్‌ని కలిసి వారి అభిప్రాయాన్ని తెలిపినట్లు సమాచారం. ఈ నెల 14న  మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో పాటు రమేష్ రాథోడ్‌, ఆర్టీసీ టీఎంయూ నేత ఆశ్వత్థామరెడ్డి , కంటోన్మెంట్‌కు చెందిన టీఆర్ఎస్ నేత కేశవరెడ్డి కూడా బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయి. 



Updated Date - 2021-06-12T01:29:21+05:30 IST