దీనికి సీఎం జగనే కారణం: రామ్మోహన్ నాయుడు

ABN , First Publish Date - 2020-06-30T21:06:15+05:30 IST

అచ్చెన్నాయుడుపై కేసులు కక్ష సాధింపులో భాగమేనని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు.

దీనికి సీఎం జగనే కారణం: రామ్మోహన్ నాయుడు

గుంటూరు: అచ్చెన్నాయుడుపై కేసులు కక్ష సాధింపులో భాగమేనని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. అచ్చెన్నను ఎలాగైనా జైల్లో పెట్టాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడును పరామర్శించేందుకు టీడీపీ నేతలు రామ్మోహన్ నాయుడు, దేవినేని ఉమా వెళ్లగా అధికారులు అనుమతించలేదు. అచ్చెన్న ఆరోగ్య పరిస్థితిపై ప్రతిరోజు బులెటిన్ విడుదల చేయాలని జీజీహెచ్ సూపరింటెండెంట్‌కు టీడీపీ నేతలు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చేస్తున్నారని, వీటన్నింటికి సీఎం జగన్మోహన్ రెడ్డే కారణమని ఆరోపించారు. జగన్ వ్యక్తిగతంగా చిన్నాన్న (అచ్చెన్నాయుడు), తమ కుటుంబంపై కక్ష పెట్టుకున్నారని అన్నారు. అధికారం ఉందని ఈ రకంగా చేయడా సరికాదన్నారు.


ఏసీబీ వ్యవస్థను సీఎం జగన్ దుర్వినియోగం చేస్తున్నారని రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. జీజీహెచ్ అధికారులు కోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. మూడు రోజుల విచారణ అయిపోయిన తర్వాత ఏసీబీ అధికారులు ఆస్పత్రి వద్ద ఎందుకు ఉన్నారని ఆయన ప్రశ్నించారు. వాళ్లకు ఏం అధికారం ఉందన్నారు. డాక్టర్లను ఏసీబీ అధికారులు సూచనలు చేయడమేంటని నిలదీశారు. ఇంకా అచ్చెన్నను ఎందుకు ఉంచుతున్నారని.. డిశ్చార్జ్ చేయాలంటూ డాక్టర్లపై అధికారులు ఒత్తిడి తీసుకువస్తున్నారని, ఇది రాజ్యాంగ ఉల్లంఘనని రామ్మోహన్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-06-30T21:06:15+05:30 IST