Abn logo
Jan 20 2021 @ 04:40AM

రామ్‌ పాపులారిటీ రోజు రోజూ పెరుగుతోంది!

రెడ్‌ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. తొలి నాలుగు రోజుల్లో రూ. 15.84 కోట్ల షేర్‌ వచ్చింది. బ్రేక్‌ ఈవెన్‌ అయి లాభాల బాటలోకి వెళ్లింది. కరోనా, 50 శాతం ఆక్యుపెన్సీ దృష్టిలో పెట్టుకుని రీజనబుల్‌ రేట్లకు కొన్ని ఏరియాలు డిస్ట్రిబ్యూటర్లకు ఇచ్చాం. కొన్ని ఏరియాల్లో మేమే రిలీజ్‌ చేశాం. కరోనా సమయంలో ఓ రేటుకు సినిమా అమ్మాం. 50 శాతం ఆక్యుపెన్సీ అనగానే మామూలు రేటు కంటే తక్కువకు ఇచ్చాం. అందువల్ల, మాకు రావాల్సిన డబ్బులో కొంత తగ్గింది తప్పితే... నష్టమేమీ లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో అందరం కలిసికట్టుగా ఎదుర్కొవాలనేది నా అభిమతం.


‘‘హీరోల ఇమేజ్‌ పెరిగి, ప్రజల మనసుల్లో పది కాలాలు ఉండాలంటే... వెండితెర మీదే ప్రజలు సినిమా చూడాలి. థియేటర్‌ కోసం తీసిన చిత్రాన్ని అక్కడ కాకుండా ఓటీటీలో విడుదల చేయడమనేది సరికాదు. ‘యాక్టర్లను, హీరోలను స్టార్లు చేసేది వెండితెరే... బుల్లితెర కాదు’ అని ఓ పంపిణీదారుడు చెప్పారు. ఆ మాట నాకు నచ్చింది. అదొక్కటీ గుర్తుపెట్టుకుంటే చాలు. సినిమాపై అభినివేశం ఉన్నవాళ్లు ఎవరూ ఓటీటీలో విడుదల చేయరు’’ అంటారు ‘స్రవంతి’ రవికిశోర్‌. రామ్‌ హీరోగా ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘రెడ్‌’ నాలుగు రోజుల్లోనే లాభాల బాట పట్టిందని వెల్లడించారు. ఈ నెల 22న మలయాళంలో, ఆ తర్వాత ఇతర భాషల్లోను ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ‘స్రవంతి’ రవికిశోర్‌ చెప్పిన విశేషాలివీ...


‘రెడ్‌’ ప్రేక్షకులకు నచ్చుతుందని, మంచి వసూళ్ల వస్తాయని ముందునుంచీ నమ్మకం ఉంది. అందరికీ థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వాలని మేం ఇన్నాళ్లూ ఎదురు చూశాం. థియేటర్లలోనే విడుదల చేయాలని నిశ్చయించుకున్నాం. అందుకని, ఓటీటీలో విడుదల చేయలేదు. సినిమా పెట్టుబడికి రూపాయి ఎక్కువ వచ్చినా, తక్కువ వచ్చినా... ప్రేక్షకుడి నుంచి రావాలని ఆలోచిస్తా. సినిమాపై అభినివేశం ఉన్న నిర్మాతలం కొద్ది మంది ఉన్నాం. మాకు సినిమా ఒక వ్యాపారం కాదు. ప్రేక్షకులు సినిమాను చూడాలనేది మా లక్ష్యం. పెట్టుబడిపై ఎంతో కొంత లాభం వస్తే చాలు అనుకుని సినిమాను వ్యాపారంగా చూసేవాళ్లను మనం ప్రశ్నించలేం.


‘ఇస్మార్ట్‌ శంకర్‌’ విజయం తర్వాత రామ్‌ ఏ చిత్రం చేసినా... ఆ సినిమాతో పోలుస్తారని తెలుసు. అందుకని, ‘రెడ్‌’ చేయడం ఎంతవరకూ కరెక్ట్‌? అని మేం డిస్కస్‌ చేసుకున్నాం. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ విజయం భయపెట్టింది. ఆ సినిమాతో ‘రెడ్‌’ను పోల్చలేం కానీ, ఇదీ మంచి చిత్రమే. నటుడిగా రామ్‌కు ఎంతో స్కోప్‌ ఉన్న చిత్రమిది. అందుకని, ఎంపిక చేసుకున్నాం. రెండు పాత్రల్లో బాగా చేశాడని రామ్‌ మంచి పేరు తెచ్చుకున్నాడు.


మూడు నాలుగేళ్లుగా రామ్‌ పాపులారిటీ పెరుగుతోంది. ‘నేను శైలజ’ను హిందీ డబ్బింగ్‌ వెర్షన్‌కి 300 మిలియన్‌, ‘ఉన్నది ఒకటే జిందగీ’కి 190 మిలియన్స్‌, ‘హలో గురు ప్రేమ కోసమే’ చిత్రానికి 271 మిలియన్స్‌, ‘హైపర్‌’కి 120 మిలియన్స్‌, ‘గణేష్‌’కి 100 మిలియన్స్‌, ‘ఇస్మార్ట్‌ శంకర్‌’కి 150 మిలియన్‌ వ్యూస్‌ వచ్చాయి. ఈ ట్రాక్‌ రికార్డు కలిగిన ఏకైక దక్షిణాది హీరో రామ్‌. అందుకని, ఈ సినిమాను ఇతర భాషల్లో అనువదించాలని కరోనా కాలంలో అనుకున్నాం. ఈ నెల 22న మలయాళంలో విడుదల చేస్తున్నాం. ఫిబ్రవరి మొదటి వారంలో హిందీలో విడుదల చేయాలనుకుంటున్నాం. ఇది రామ్‌ నేషనల్‌ లెవల్‌ ఎంట్రీ కాదు. అతణ్ణి ఆదరించిన ప్రేక్షకులకు థియేటర్లలో సినిమాను చూపించాలనుకుంటున్నాం.


త్రివిక్రమ్‌ ప్రయాణం మా సంస్థలో ప్రారంభమైంది కదా! ‘రెడ్‌’ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌లో అవన్నీ గుర్తు చేసుకున్నాడు. తను చెప్పినట్టు ఇప్పటికీ నేను స్ర్కిప్ట్‌ పూర్తిగా చదువుతా. నాలో ఏ మార్పూ లేదు. ఇవాళ్టికీ... ఆఖరి షాట్‌తో సహా బౌండెడ్‌ స్ర్కిప్‌ ఉంటేనే గానీ సినిమా చేయను. అలా లేకపోతే సినిమా చేయడం కరెక్ట్‌ కూడా కాదు. ‘యస్‌. రామ్‌తో మనం సినిమా చేద్దాం’ అని త్రివిక్రమ్‌ అంటే ఎప్పుడైనా నేను సిద్ధమే. ప్రస్తుతం తనకు ఎన్నో కమిట్‌మెంట్స్‌ ఉండి ఉంటాయి. చూద్దాం... దేనికైనా టైమ్‌ రావాలి.

Advertisement
Advertisement
Advertisement