UP తరహా చట్టం చేయాల్సిందే: Vijayashanthi

ABN , First Publish Date - 2021-09-09T14:27:49+05:30 IST

మతపరమైన రిజర్వేషన్‌లపై బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఈ అంశం తరచూ చర్చకు వస్తోందని..

UP తరహా చట్టం చేయాల్సిందే: Vijayashanthi

హైదరాబాద్: మతపరమైన రిజర్వేషన్‌లపై బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ఈ అంశం తరచూ చర్చకు వస్తోందని.. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు తరచూ జనాభా సంఖ్యను మతపరమైన రిజర్వేషన్లతో ముడిపెడుతున్నాయన్నారు. విద్య, ఉద్యోగాలలో రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల ప్రయోజనాలను అందుకుంటున్నవారిలో అన్ని మతాలవారూ ఉండగా... మళ్లీ ప్రత్యేకంగా మతపరమైన రిజర్వేషన్లు అంటే అది వివిధ మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం తప్ప మరొకటి కాదన్నారు. 





సోషల్ మీడియా వేదికగా రాములమ్మ మాట్లాడుతూ.. ‘‘మన దేశాన్ని వేధిస్తున్న ప్రధానమైన సమస్యల్లో ఒకటి అధిక జనాభా కాగా.... తరచూ చర్చకు వస్తున్న మతపరమైన రిజర్వేషన్ల అంశం ఎన్నో వర్గాల్లో కలవరానికి కారణమవుతోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు సంగారెడ్డి సభలో వీటినే ముఖ్యంగా ప్రస్తావించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు జనాభా సంఖ్యను మతపరమైన రిజర్వేషన్లతో ముడిపెడుతున్నాయి. ప్రపంచంలో అధిక జనాభా కలిగిన 2వ దేశంగా ఉన్న భారత్‌లో జనాభా నియంత్రణకు దశాబ్దాల కాలంగా ఎన్ని చర్యలు తీసుకున్నా... నేటికీ ఆ దుష్ప్రభావం ఫలితంగా నిరుద్యోగం, ఆనారోగ్యం తదితర సమస్యలు ఎన్నో వెంటాడుతున్నాయి. ఈ సమస్యను కొందరు అర్థం చేసుకున్నప్పటికీ, కొందరు ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్ల భావితరాలు నష్టపోయే పరిస్థితి నెలకొంది. 



అందువల్ల సంజయ్ గారు చెప్పినట్టు యూపీ తరహాలో జనాభా నియంత్రణ చట్టం చేసి కఠినంగా అమలు చేసినప్పుడు మాత్రమే పరిస్థితులు చక్కబడతాయి. ఇది ఒక మతాన్ని మాత్రమే ఉద్దేశించినట్లు కాంగ్రెస్ మాట్లాడటం కేవలం దుర్మార్గం. చట్టం మతాలకు అతీతంగా అందరికీ ఒకేలా వర్తిస్తుందన్నది ఎవరికైనా అర్థమవుతుంది. ఇక మతపరమైన రిజర్వేషన్ల అంశం విషయానికి వస్తే... అన్ని మతాలకూ సమాన స్థానమున్న సెక్యులర్ దేశం మనది. వెనుకబడిన వర్గాల ఎదుగుదలకు విద్య, ఉద్యోగాలలో రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల ప్రయోజనాలను అందుకుంటున్నవారిలో అన్ని మతాలవారూ ఉండగా... మళ్లీ ప్రత్యేకంగా మతపరమైన రిజర్వేషన్లు అంటే అది వివిధ మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం తప్ప మరొకటి కాదు. స్వార్థంతో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు పాలకులు చేసే ఇటువంటి చర్యలను గ్రహించలేనంత అమాయకులు కాదు మన ప్రజలు’’ అని విజయశాంతి ట్వీట్‌లో పేర్కొన్నారు.




Updated Date - 2021-09-09T14:27:49+05:30 IST