శభాష్ రమ్యశ్రీ

ABN , First Publish Date - 2021-07-21T17:54:35+05:30 IST

‘టీనేజ్‌ ఏజ్‌లో... కాలేజీ రోజుల్లో’ అంటూ..

శభాష్ రమ్యశ్రీ

చదువుతోపాటు కుటుంబ పోషణకు శ్రమిస్తున్న ఆదివాసీ విద్యార్థిని

ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ముందడుగు

నేటి యువతరానికి ఆదర్శం ఆమె పట్టుదల 

 

దుమ్ముగూడెం(ఖమ్మం): ‘టీనేజ్‌ ఏజ్‌లో... కాలేజీ రోజుల్లో’ అంటూ యువత రంగుల కలల్లో విహరించే ఈరోజుల్లో ఒకపక్క తన భవిష్యత్తు కోసం విద్యనభ్యసిస్తూనే మరోపక్క తన కుటుంబ పోషణ బాధ్యతను భుజానికెత్తుకుంది ఓ ఆదివాసీ విద్యార్థిని.. దుమ్ముగూడెం మండలంలోని మారుమూల ఆదివాసీ గ్రామం రామచంద్రునిపేటలో కారం లక్ష్మయ్య, నాగమ్మ దంపతుల చివరి సంతానం రమ్యశ్రీ తన కుటుంబానికి వెన్నుదన్నై నిలుస్తోంది. ఒక పక్క చదువు కొనసాగిస్తూనే మరోపక్క వ్యవసాయ పనుల్లో అన్నీ తానై బాధ్యతలు మోస్తోంది. 


ఇటీవల ఆ కుటుంబంలో ముగ్గురికి కరోనా సోకగా, వారికి పరిచర్యలు చేస్తూనే మరో పక్క వ్యవసాయ పనులు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలిచింది రమ్యశ్రీ. తమ పొలంలో నాగలి దున్నటం దగ్గర నుంచి పురుగుమందు పిచికారీ చేయడం, ఎరువులు వేయడం, కలుపు తీయడం వంటి పనులు చేస్తూ సాగును ముందుకు నడిపిస్తోంది. తమకున్న నాలుగెకరాల భూమిలో మూడెకరాల పత్తిసాగు, ఒక ఎకరం వరి సాగు చేస్తోంది. చదువుల్లో తీరిక దొరికితే వెంటనే పొలం పనులపై దృష్టి సారించే రమ్య నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. హైదరాబాద్‌ దోమలగూడాలోని ఓ ప్రభుత్వ కళాశాలలో పీఈటీ కోర్సు మొదటి సంవత్సరం చదువుతున్న రమ్యశ్రీ లాక్‌డౌన్‌ కారణంగా ఏడాది కాలంగా ఇంటి వద్దనే ఉంటోంది. 


హాస్టల్‌ ఫీజుకోసం కూలీ పనులు 

కారం లక్ష్మయ్య దంపతులకు నలుగురు సంతానం కాగా వారిలో రమ్యశ్రీ అందరికంటే చిన్నది. వారికి ఊర్లో ఉన్నది రెండు గదుల ఇల్లు మాత్రమే. రమ్యశ్రీ పెద్దక్క దుర్గ భర్త చనిపోగా, ఇద్దరు పిల్లలతో సహా తల్లిదండ్రులతోనే ఉంటోంది. అన్నయ్య సందీప్‌ డిగ్రీ మధ్యలోనే ఆపేసి హైదరాబాదులో ఒక ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. మరో అక్క రోజా పాలిటెక్నిక్‌ చదువుతోంది. చిన్ననాటి నుంచి తన తల్లిదండ్రులు పొలంలో పడుతున్న కష్టం చూసి చలించిన రమ్య వ్యవసాయ పనులన్నింటినీ పట్టుదలతో నేర్చుకుంది. ఉదయం 9గంటలకు తన పొలం పనులకు వెళ్లి సాయంత్రం 6గంటల వరకు కష్టపడి పనిచేస్తుంది. సొంత వ్యవసాయ పనులు లేనప్పుడు బయట వ్యవసాయ కూలీ పనులకు వెళ్లేంది. అలా వచ్చిన డబ్బుతో హైదరాబాద్‌లో తాను ఉండే హాస్టల్‌ ఖర్చులకు వినియోగిస్తోంది. తండ్రి అనారోగ్యం, కుటుంబం పెద్దదవడంతో రమ్యశ్రీ తన చిన్ననాటి నుంచే భాద్యతలను భుజాన వేసుకుంది. అత్యవసర సమయాల్లో తన అన్న సందీప్‌ సైతం ఎంతో కొంత డబ్బు పంపి కుటుంబాన్ని ఆదుకుంటాడని రమ్యశ్రీ తెలిపింది.   


ఉద్యోగం సాధించాలనే ధ్యేయం 

రమ్యశ్రీ 1నుంచి 5వరకు మండలంలోని రామచంద్రుని పేట ప్రభుత్వ పాఠశాలలో చదివింది. 6నుంచి 10వరకు దుమ్ముగూడెం కస్తూర్బాలో, ఇంటర్‌ భద్రాచలం టీటీడబ్ల్యూ ఆర్‌ జూనియర్‌ కళాశాలలో చదివింది. పదిలో 8.2 జీపీఏ, ఇంటర్‌లో 770మార్కులను సాధించింది. చిన్ననాటి నుంచే వ్యవసాయ పనుల్లో చురుగ్గా పాల్గొన్న రమ్య తన చదువులను ఏమాత్రం అలక్ష్యం చేయలేదు. ఏనాటికైనా ప్రభుత్వోద్యోగం చేయాలనేదే తన ముందున్న లక్ష్యమని తెలిపింది. ప్రస్తుతం తాను ప్రభుత్వ కళాశాలలో పీఈటీ కోర్సును ఉచితంగా చదువుతున్నప్పటికీ, హాస్టల్‌ ఫీజు రూ.4,500 మాత్రం సొంతంగానే చెల్లిస్తోంది. ఆటలంటే ఆసక్తి గల రమ్యశ్రీ మండల స్థాయితోపాటు, రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీ ల్లోనూ పాల్గొని బహుమతులను గెలుచుకుంది. 2015లో సిద్దిపేటలోనూ, 2018లో నల్లగొండలోనూ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొని మెడల్స్‌ సాధించింది. జాతీయస్థాయి కబడ్డీలో పాల్గొంది.


తొలుత నర్సింగ్‌ కోర్సు చదువుదామని ఆశించగా, తన కుటుంబ కోరిక మేరకు పీఈటీ కోర్సును ఎంపిక చేసుకున్నట్లు వివరించింది. ప్రభుత్వ సహకారం లభిస్తే పీడీ కోర్సు కూడా చేయాలనేదే తన ధ్యేయంగా రమ్యశ్రీ తెలిపింది. ఆరోగ్యం బాగా లేకపోయినా తండ్రి లక్ష్మయ్య వ్యవసాయపనుల్లో పడుతున్న కష్టం చూసి చిన్ననాటి నుంచే కుటుంబానికి అండగా ఉండాలనే ఆలోచన వచ్చిందని రమ్య తెలిపింది. అటు కుటుంబ సభ్యులకు సపరి చర్యలు, ఇటు చురుగ్గా వ్యవసాయ పనుల్లో పాల్గొంటున్న రమ్య అందరి మన్ననలు పొందుతోంది. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను పరిగణలోకి తీసుకుంటే యువత అనుకున్న లక్ష్యాలను చేరుకోవచ్చనే ఆశాభావం వ్యక్తం చేసింది. 

Updated Date - 2021-07-21T17:54:35+05:30 IST