చంద్ర దర్శనం రంజాన్‌ సంబరం

ABN , First Publish Date - 2021-04-14T04:56:09+05:30 IST

జిల్లాలో మంగళవారం రాత్రి నెలవంక దర్శనంతో రంజాన్‌ మాసం ఉపవాస దీక్ష (రోజా) ప్రారంభం సందర్భంగా ముస్లింలు సంబరాలు జరుపుకున్నారు.

చంద్ర దర్శనం  రంజాన్‌ సంబరం

నేటి నుంచి ఉపవాస దీక్షలు


నెల్లూరు(సాంస్కృతికం), ఏప్రిల్‌ 13 : జిల్లాలో మంగళవారం రాత్రి నెలవంక దర్శనంతో రంజాన్‌ మాసం ఉపవాస దీక్ష (రోజా) ప్రారంభం సందర్భంగా ముస్లింలు సంబరాలు జరుపుకున్నారు. వీధుల్లో బాణా సంచా పేల్చి హర్షాన్ని వ్యక్తం చేశారు. పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ 30 రోజులు దీక్షలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండాలని అల్లా్‌హను ప్రార్థించి, ప్రత్యేక దువా చేశారు. బుధవారం తెల్లవారుజాము నుంచి ఉపవాసదీక్ష ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ మాసంలోనే దివ్య గ్రంథం ఖురాన్‌ అవతరించింది. ఆ రోజున ముస్లింలు జాగరణ చేస్తారు. ఆ రేయినే లైలతుల్‌ ఖద్ర్‌ అంటారు. వేయి నెలల కంటే అది శ్రేష్టమైన రేయిగా వారి విశ్వాసం. గత సంవత్సరం రంజాన్‌ మాసంలో కొవిడ్‌ లాక్‌డౌన్‌ కారణంగా ఉపవాస దీక్షలకు చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఈ సంవత్సరం కూడా కరోనా సెకండ్‌ వేవ్‌ కలవర పెడుతోంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు పాటించాలని, కొవిడ్‌ నిబంధనలు అనుసరిస్తూ ప్రశాంత వాతావరణంలో పవిత్ర మనసుతో రంజాన్‌ మాసాన్ని గడపాలని ప్రభుత్వం, మత పెద్దలు సూచిస్తున్నారు.


కొవిడ్‌ నిబంధనలు

రంజాన్‌ ఉపవాస దీక్షలు బుధవారం ప్రారంభం కానున్నాయి. అయితే కొవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో నిబంధనల మేరకు ముస్లింలు ఉపవాస దీక్షలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది. అవేమిటంటే...


మసీదుల్లో భక్తులు లోపలికి, వెలుపలికి వచ్చే ద్వారాల వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేసి, కచ్చితంగా చేతులు శుభ్రం చేసుకునేలా చూడాలి.

ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి. ఆలింగనం, చేతులు కలపడం చేయరాదు. 

ఈద్గా, మసీదుల్లోకి ఆరోగ్యవంతులను మాత్రమే అనుమతించాలని,  వృద్ధులు, పసి పిల్లలకు ప్రవేశం రద్దు చేయాలి.

నమాజు పూర్తయిన ప్రతిసారీ ఆ ప్రాంతాన్ని శానిటైజ్‌ చేయాలి.

వంట గదులు, అంగళ్లు, అన్నదాన ప్రదేశాల్లో భౌతిక దూరంతోపాటు పరిశుభ్రత పాటించాలి. 

నమాజు కోసం వచ్చే భక్తులు ఇంటి వద్దే ఉజూ చేసుకొని ప్రార్థన కోసం చాప (జానిమాజ్‌) వెంట తెచ్చుకోవాలి.

పార్కింగ్‌ ప్రాంతాలు, ఇతర ప్రదేశాల్లో గుంపులు, గుంపులుగా ఉండకుండా కొవిడ్‌ నిబంధనల మేరకు నడుచుకోవాలి. 

కాగా, మసీదు, ఈద్గా, దర్గాల వ ద్ద తప్పకుండా కొవిడ్‌ జాగ్రత్తలను పాటించాలని జిల్లా మైనార్టీ వెల్ఫేర్‌ అధికారి అబ్దుల్‌ హమీద్‌ ఓ ప్రకటనలో సూచించారు. జిల్లా కలెక్టర్‌ ఉత్తర్వులను నిర్వాహకులు, భక్తులు పాటించాలని కోరారు.

Updated Date - 2021-04-14T04:56:09+05:30 IST