మాస్క్‌ ఉంటేనే మసీదులోకి..

ABN , First Publish Date - 2021-04-14T06:36:15+05:30 IST

ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్‌ మాసం వచ్చేసింది.

మాస్క్‌ ఉంటేనే మసీదులోకి..
మక్కా మసీదులో తరవీ నమాజ్‌ చదువుతున్న ముస్లింలు

మాస్క్‌ ఉంటేనే మసీదులోకి.. 

 మక్కా మసీదు సూపరింటెండెంట్‌ వెల్లడి

 మొదలైన రంజాన్‌ సన్నాహాలు

చార్మినార్‌/మదీనా ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్‌ మాసం వచ్చేసింది. మంగళవారం నెలవంక కనిపించడంతో రంజాన్‌ ప్రారంభ సూచికగా మసీదుల్లో సైరన్లు మోగాయి. దీంతో రంజాన్‌ ముబారక్‌, చాంద్‌ముబారక్‌  అంటూ చిన్నలు, పెద్దలు పరస్ప రం శుభాకాంక్షలు చెప్పుకున్నారు. నేటి నుంచి ఉపవాసదీక్షలను భక్తిశ్రద్ధలతో జరుపుకొనేందుకు ముస్లింలు సన్నద్ధమయ్యారు. ఇస్లామిక్‌ సంవత్సరంలో రంజాన్‌కున్న ప్రత్యేకత ఏ మాసానికీ లేదు. ఈ మాసంలోనే పవిత్ర ఖురాన్‌ అవతరించింది. ఎంతో శుభప్రదమయిన ఈ నెలలో స్వర్గ ద్వారాలు తెరిచి, నరకద్వారాలు మూసి వేస్తారని నమ్ముతారు. ఈ మాసంలో పూర్తి చిత్తశుద్ధితో, ఏకాగ్రతతో, నియమ నిష్టలతో ఉపవాసం పాటించడం అంటే దేవునికి కృతజ్ఞతలు తెలుపుకోవడం అని విధిగా ప్రతి ముస్లిం నమ్ముతాడు. 


మక్కా మసీదు సిద్ధం.. 

 రంజాన్‌ మాసాన్ని పురస్కరించుకుని చారిత్రాత్మక మక్కా మసీదులో అన్ని ఏర్పాట్లు చేసినట్లు  మక్కామసీదు సూపరింటెండెంట్‌ ఖదీర్‌ సిద్ధిఖీ తెలిపారు. మక్కా మసీదులో నమాజులకు అనుమతి ఉందని, నమాజ్‌కు వచ్చేవారు ఇంటి వద్దే వజూ చేసుకుని రావాలని సూచించారు. జానిమాజులు తెచ్చుకుని, భౌతికదూరం పాటించాలని సూచించారు. మాస్క్‌ లేనివారిని మసీదులోకి అనుమతించమని, 60 ఏళ్లు పైబడిన, 10 లోపు వారు ఇళ్ల వద్దనే ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు. రంజాన్‌ సందర్భంగా రూ. కోటీ 82 లక్షలతో వివిధ పనులు చేపట్టినట్లు వివరించారు. ఇందులో బల్దియా రూ. కోటీ 50 లక్షలు మంజూరు చేయగా, 44 మోడ్రన్‌ టాయిలెట్స్‌, 39 మూత్రశాలలతో పాటు విద్యుత్‌ పనులు, సౌండ్‌ అండ్‌ లైటింగ్‌ సిస్టమ్‌ పూర్తి చేశామన్నారు. మక్కా మసీదు ప్రాంగణంలోని కోనేరు(హౌజ్‌) మరమ్మతులకు మైనారిటీ వెల్ఫేర్‌ రూ. 32 లక్షలు మంజూరు చేసిందన్నారు. మక్కా మసీదు కు వచ్చే వారి కోసం ప్రభుత్వం తరఫున వెయ్యి కిలోల ఖర్జురాలు, రోజూ వం ద డజన్ల అరటి పండ్ల కోసం నిధులు మంజూరయ్యాయన్నారు. మక్కా మసీదులోని వాటర్‌ ఏటీఎంలో ఉచితంగా మంచినీటిని అందిస్తామన్నారు.   

Updated Date - 2021-04-14T06:36:15+05:30 IST