కరోనా రోజుల్లో... రంజాన్‌!

ABN , First Publish Date - 2020-04-28T05:30:00+05:30 IST

పవిత్ర రంజాన్‌ మాసం ఈ ఏడాది కరోనా కాలంలో వచ్చింది. రంజాన్‌ మాసాన్ని పాటించేవాళ్లు ఈ రోజుల్లో మరింత అప్రమత్తతతో నియమాలు ఆచరించక తప్పదు. సామాజిక దూరం పాటిస్తూ, ఇంటిపట్టునే...

కరోనా రోజుల్లో... రంజాన్‌!

  •         డయాబెటిక్‌ కేర్‌


పవిత్ర రంజాన్‌ మాసం ఈ ఏడాది కరోనా కాలంలో వచ్చింది. రంజాన్‌ మాసాన్ని పాటించేవాళ్లు ఈ రోజుల్లో మరింత అప్రమత్తతతో నియమాలు ఆచరించక తప్పదు. సామాజిక దూరం పాటిస్తూ, ఇంటిపట్టునే ఉండాలి. మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలి. ఇంట్లోనే కుటుంబసభ్యులతో ఇఫ్తార్‌ విందులు జరుపుకోవచ్చు. మత ప్రార్థనలు, స్వచ్ఛంద సేవాకార్యక్రమాలు నిర్వహించేవాళ్లకు కూడా ఇవే నియమాలు వర్తిస్తాయి. దానధర్మాలు చేయాలని అనుకుంటే డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్‌ సౌకర్యాలను వినియోగించుకోవాలి. 


ఉపవాసం ఇలా!

ఉపవాసం ఉండాలనుకునేవాళ్లు వైద్యుల సూచన మేరకు నడుచుకోవాలి. గ్లూకోజ్‌ స్థాయి తక్కువగా ఉండేవారు, మధుమేహం ఉన్న గర్భిణులు కూడా ఉపవాసం ఉండకపోవడమే మంచిది. లాక్‌డౌన్‌ సమయంలో టెలిమిడిసిన్ల మీద ఆధారపడాలి. ఉపవాస సమయంలో గ్లూకోజ్‌ తగ్గి, ఉపవాసం తదనంతర విందు భోజనంతో గ్లూకోజ్‌ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి పరీక్షించుకోవడానికి వీలుగా గ్లూకోమీటర్‌ దగ్గర ఉంచుకోవాలి. కొన్ని మధుమేహ మందులు తక్కువ ప్రభావంతో గ్లూకోజ్‌ స్థాయులను నియంత్రణలో ఉంచుతాయి. మరికొన్ని మందులు ఎక్కువ ప్రభావం చూపించి, గ్లూకోజ్‌ స్థాయిని తగ్గిస్తాయి. కాబట్టి మందుల ఎంపిక జాగ్రత్తగా సాగాలి. ఎస్‌జిఎల్‌టి2 ఇన్హిబిటర్లు అనే ప్రత్యేక తరగతికి చెందిన మధుమేహ మందులు గ్లూకోజ్‌ స్థాయి పడిపోకుండా చేస్తాయి. అయితే వీటిలో డీహైడ్రేషన్‌, యాసిడ్‌ స్థాయులు పెరుగుతాయి. కాబట్టి ఉపవాసం ఉండేవారు ఈ మందులు వాడకపోవడమే మేలు.




ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

  1. ఉపవాసానికి ముందు, తర్వాత తగినన్ని నీళ్లు తాగాలి.
  2. కొవ్వు పదార్థాలు, పళ్ల రసాలు, మామిడిపళ్లు లేదా ఖర్జూరం తీసుకోకూడదు.
  3. దంపుడు బియ్యం, తృణధాన్యాలు, పొట్టు తీయని గోధుమలతో తయారైన రొట్టెలు, వెన్న తీసిన పాలు తీసుకోవాలి.
  4. బిర్యానీ, హలీం పరిమితంగా తీసుకోవాలి. 
  5. ఉపవాసం లేనప్పుడు తేలికపాటి వ్యాయామాలు ఇంట్లోనే చేయవచ్చు.


- డాక్టర్‌ రవిశంకర్‌ ఇరుకులపాటి

సీనియర్‌ కన్సల్టెంట్‌ ఎండోక్రైనాలజిస్ట్‌,

అపోలో హాస్పిటల్స్‌, హైదరాబాద్‌


Updated Date - 2020-04-28T05:30:00+05:30 IST