రణరాజనీతి

ABN , First Publish Date - 2020-06-23T06:56:41+05:30 IST

‘‘ఇప్పుడు కావలసింది రాజనీతి కాదు, రణనీతి!’’ అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, ప్రధాని నిర్వహించిన అఖిలపక్ష విడియో సమావేశంలో. జరుగుతున్న పరిణామాలలో ‘‘రాజకీయం’’ పాలు ఎక్కువగా ఉన్నదన్న అభిప్రాయం ఆ వ్యాఖ్యలో ఇమిడి ఉన్నది...

రణరాజనీతి

‘‘ఇప్పుడు కావలసింది రాజనీతి కాదు, రణనీతి!’’ అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, ప్రధాని నిర్వహించిన అఖిలపక్ష విడియో సమావేశంలో. జరుగుతున్న పరిణామాలలో ‘‘రాజకీయం’’ పాలు ఎక్కువగా ఉన్నదన్న అభిప్రాయం ఆ వ్యాఖ్యలో ఇమిడి ఉన్నది. ఆ సమావేశంలో చేసిన ప్రసంగంలో చంద్రశేఖరరావు ప్రాంతీయ పార్టీ నేత లెవరూ వెళ్లనంత లోతుగా భారత–చైనా వివాదంలోకి వెళ్లారు. జాతీయ, అంతర్జాతీయ విషయాలపై తనకు అవగాహన, ప్రాధాన్యాలు ఉన్నాయని ఆయన ఆ వ్యాఖ్యల ద్వారా సూచించారు. ‘రాజనీతి’ అన్న మాట వెనుక, కేంద్రంలోని అధికారపార్టీకి, ప్రధాన ప్రతిపక్షపార్టీకి మధ్య జరుగుతున్న విమర్శ–ప్రతివిమర్శల యుద్ధం, లేదా, దేశభద్రతకు సంబంధించిన అంశాలలో కేంద్రప్రభుత్వం కూడా అనేక అంతర్గత రాజకీయ పరిగణనలను దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తున్నదన్న అభిప్రాయం ఆయన మనసులో ఉండి ఉండవచ్చు. అంతే తప్ప, రాజకీయానికి, రణానికి ఉండే సంబంధం ఆయనకు తెలియదనుకోలేము. 


రాజకీయాల కొనసాగింపే యుద్ధం అన్నారు పెద్దలు. దేశాల మధ్య యుద్ధమైనా, దేశంలోపలి యుద్ధమైనా– వ్యవస్థాత్మకంగానూ, దౌత్యపరంగానూ తెమలని సమస్యలను పరిష్కరించుకోవడానికి ఒక పతాకఘట్టం. కురుక్షేత్రం జరగడానికి ముందు రాయబారమూ జరిగింది. గుండెలు చీల్చి నెత్తురు తాగాల్సిందే అనే భీమసేనుడూ ఉన్నాడు, ఆ పక్కనే దూకుడు వద్దనే ధర్మరాజూ ఉన్నాడు. ఒకడు వీరుడు, మరొకడు భీరువు కారు. యుద్ధం జిందాబాద్‌ అనేవాడు దేశభక్తుడైపోయి, ఆచితూచి నడవమన్నవాడు చైనాశిష్యుడై పోయే ప్రమాదం వర్తమానంలోనే ఉన్నది. ఈ సమయంలో తొందరపాటు కూడదని, అలాగని లొంగుబాటూ వలదని చొరవ తీసుకుని చెప్పినందుకు కెసిఆర్‌ను అభినందించవచ్చు. సలహా బాగానే ఉన్నది కానీ, దాన్ని అమలుచేయడం ఎట్లా అన్నదే సమస్య. మరీ ముఖ్యంగా, సర్జికల్‌ దాడుల ప్రతిష్ఠ ముళ్లకిరీటంలా వెలుగుతున్న ప్రభుత్వానికి, ఈ సంక్లిష్ట సందర్భాన్ని నిర్వహించడం మరింత సమస్య. 


అందుకే, కేంద్రపాలకులలో అంతటి తడబాటు. ఇరవైమంది మాత్రం ప్రాణత్యాగం చేశారు. అదొక్కటి సత్యం. తక్కినదంతా తొట్రుపాటే. ఎట్లా జరిగిందో ఎందుకు జరిగిందో స్పష్టంగా చెప్పరు. ఘర్షణ జరిగిందన్నారు, దాడి చేశారన్నారు, ప్రతిదాడిలో వాళ్లే దెబ్బతిన్నారన్నారు. ఆయుధాలు ఎందుకు లేవంటే, నీళ్లు నమిలారు. ఇప్పుడు తుపాకులకు అనుమతి ఇస్తున్నామన్నారు. వాళ్లు గీత దాటారన్నారు. లేదు, ఎవరి గీతల్లో వాళ్లున్నారన్నారు, గజం మిథ్య, పలాయనమూ మిథ్య అన్నారు. ఈ గందరగోళం అంతా ఎందుకంటే, పారదర్శకత లేకపోవడం వల్ల. పారదర్శకత ఎందుకు లేదంటే, ఈ స్థితిలో ఘర్షణను పొడిగించడం ఉచితం కాదని భావిస్తూ, ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పలేని తనం వల్ల. ఎందుకు చెప్పలేమంటే, గతంలో సరిహద్దు దాటి శత్రువును దెబ్బతీసి వచ్చామన్న చరిత్రలు, తీవ్రజాతీయవాదపు పోకడలు. 


దేశప్రజల ముందు మెతకగా కనిపించకుండా కాసిన్ని వీరప్రకటనలు చేసినా, నెమ్మదిగా చర్చల పర్వంలోకి సమస్యను తీసుకురావడం ప్రభుత్వానికి తప్పదు. కానీ, ప్రభుత్వపు ప్రాణసంకటం కాంగ్రెస్‌ పార్టీకి చెలగాటం అయింది. అదేంటి, ఇదేంటి అని యక్షప్రశ్నలు వేయసాగారు. ఉత్సాహం పూని, తిరిగి ఊపులోకి రావడానికి రాహుల్‌గాంధీకి ఇదే తరుణం అనిపించింది. ఆయనకు తోడు, సోమవారం నాడు మన్మోహన్‌సింగ్‌ కూడా రంగంలోకి దిగారు. ‘‘ఉల్లంఘనలు ఏమీ జరగలేదు’’ అని ప్రధాని మోదీ చెప్పినమాటలకు చైనాలో ప్రశంసలు వస్తున్నాయని, మాటలు జాగ్రత్తగా వాడాలని మన్మోహన్‌ సింగ్‌ హెచ్చరికే చేశారు. కాంగ్రెస్‌ తీసుకుంటున్న ఈ వైఖరిని బిజెపి, తన యావత్‌ యంత్రాంగంతో సహా, తీవ్రంగా ఖండిస్తున్నది. కాంగ్రెస్‌ది దేశద్రోహకర విధానమని, కాంగ్రెస్‌ హయాంలోనే చైనా 43 వేల కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించుకున్నదని, మన్మోహన్‌సింగ్‌ ప్రధానిగా ఉండగా 600 సార్లు సరిహద్దు ఉల్లంఘనలు జరిగాయని బిజెపి అధ్యక్షుడు నడ్డా ఎదురుదాడికి దిగారు.


ఇంతకీ చైనా–భారత్‌ వివాదంలో వివిధ ప్రభుత్వాల వైఖరులు ఆయా అధికారపార్టీల వైఖరులా? జాతీయ వైఖరులా? వీరాలాపాలు పలికే ప్రభుత్వం, మెతకవైఖరి చూపుతున్నదని విమర్శిస్తున్న కాంగ్రెస్‌, తన హయాంలో ఏమి చేసింది? ఇప్పుడు అధికారం అప్పగిస్తే మాత్రం కాంగ్రెస్‌పార్టీ, చైనాతో యుద్ధాన్ని కోరుకుంటుందా? వివాదంలో మంచిచెడ్డలు ఎవరివైనా కానీ, యుద్ధం అన్నది అన్నివేళలా నివారించదగినదే. తమ పార్టీకి ఉన్న ‘దూకుడు’ ప్రతిష్ఠ రీత్యా, పరిస్థితి యుద్ధం దాకా పోకుండా చూడడానికి సతమతమతుతున్న అధికారపార్టీ నేతలను, ప్రజల ముందు భీరువులుగా, లాలూచీదారులుగా నిలబెట్టడానికి ప్రతిపక్షం ప్రయత్నిస్తున్నది. ఇదే ఇప్పటి రాజకీయం. సరిహద్దులకు ఆవలి శత్రువులను చూపి, దేశంలో రాజకీయలబ్ధి పొందగోరడంలో ఆ పార్టీలు ఏవీ నిరపరాధులు కావు. దేశభక్తియుత రాజకీయ క్రీడలో బిజెపిపై పైచేయి కాగలనని కాంగ్రెస్‌ అనుకోవడమే ఆశ్చర్యకరం.

Updated Date - 2020-06-23T06:56:41+05:30 IST