ర్యాండమ్‌ టెస్టింగే శ్రీరామరక్ష

ABN , First Publish Date - 2020-03-28T09:06:43+05:30 IST

కరోనాపై పోరులో కఠినంగా వ్యవహరిస్తున్న కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు లాక్‌డౌన్‌తో కొంతమేరకు సత్ఫలితాలను సాధిస్తున్నాయి. కానీ.. కొవిడ్‌-19 కట్టడికి లాక్‌డౌన్‌ ఒక్కటే చాలదని వైద్యనిపుణులు

ర్యాండమ్‌ టెస్టింగే శ్రీరామరక్ష

  • ఇప్పటికీ గుంపులుగా బయటకు జనం
  • లక్షణాలు కనిపించిన తర్వాతే పరీక్షలు
  • ఈలోగా వారి నుంచి వైరస్‌ వ్యాప్తి
  • కరోనాపై ఎదురుదాడితోనే నిర్మూలన
  • వైరస్‌ సోకినవారిని గుర్తించడం
  • ఐసోలేట్‌ చేయడం.. పరీక్షించడం
  • వారి నుంచి సోకినవారిని గుర్తించడం
  • ఈ కసరత్తుతోనే అడ్డుకట్ట: నిపుణులు
  • విదేశాల నుంచి వచ్చినవారి సంఖ్యకు
  • నిఘాలో ఉన్నవారి సంఖ్యకు మధ్య తేడా
  • నియంత్రణకిది విఘాతం: కేబినెట్‌ సెక్రటరీ


హైదరాబాద్‌, న్యూఢిల్లీ, మార్చి 27 (ఆంధ్రజ్యోతి): కరోనాపై పోరులో కఠినంగా వ్యవహరిస్తున్న కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు లాక్‌డౌన్‌తో కొంతమేరకు సత్ఫలితాలను సాధిస్తున్నాయి. కానీ.. కొవిడ్‌-19 కట్టడికి లాక్‌డౌన్‌ ఒక్కటే చాలదని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా.. వైరస్‌ ఉధృతి చైనాలో, ఇతర దేశాల్లో ఎక్కువగా ఉన్నప్పుడు ఆయా దేశాల నుంచి మనవాళ్లు మనదేశానికి లక్షల సంఖ్యలో వచ్చారు. వారిలో చాలా మందికి ఎయిర్‌పోర్టులో థర్మల్‌ స్ర్కీనింగ్‌ చేసి.. హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా సూచించారు. అయినా వారిలో చాలామంది కాలనీల్లో తిరిగేస్తున్నారు. ఉదాహరణకు.. తెలుగు రాష్ట్రాల్లో బాగా పేరొందిన ప్రముఖ కుల సంఘం నేత కుమారుడు ఇటీవల విదేశాల నుంచి వచ్చాడు. సీనియర్‌ రాజకీయ నేత ఇంటి పక్కనే అతడి ఇల్లు కూడా. హోం క్వారంటైన్‌లో ఉండాలన్న అధికారుల సూచనలను పెడచెవిన పెట్టి అతడు రోజూ తన పెంపుడు కుక్కను తీసుకుని బయటకు వస్తున్నాడు. 


అతణ్ని ప్రశ్నించే సాహసం చేయలేక స్థానికులు భయంతో సతమతమవుతున్నారు. ఇదే కోవలో షార్ట్‌ఫిలిమ్స్‌ దర్శకుడొకరు.. టీవీ సీరియళ్లకు కెమెరామ్యాన్‌గ ఆపనిచేసే మరొకరు. ఇలా చాలామంది విదేశాల నుంచి వచ్చి రోడ్ల మీద తిరిగేస్తున్నారు. శుక్రవారంనాడు ఇలా తిరుగుతున్నవారిలో ఒకరిని ఖైరతాబాద్‌లో, శేరిలింగంపల్లిలో నలుగురిని, చార్మినార్‌ ఏరియాలో ఐదుగురిని, కూకట్‌పల్లిలో ఆరుగురిని పోలీసులు పట్టుకుని క్వారంటైన్‌కు తరలించారు. వారు దొరికారుగానీ.. దొరక్కుండా కాలనీల్లో ఇంకా ఎంతమంది తిరుగుతున్నారో లెక్క తెలియదు. వారిలో ఎవరికైనా ఇప్పటికే వైరస్‌ సోకి ఉంటే.. వారి నుంచి ఎంత మందికి అది వ్యాపిస్తుందో ఆ ముప్పును ఊహించడం కూడా కష్టం. ఎందుకంటే వైరస్‌ వ్యాపించిన తర్వాత లక్షణాలు బయటపడడానికి 4 నుంచి 14 రోజులు ప డుతుంది. ఇప్పటికి వారంతా ఆరోగ్యంగా కనిపించినా.. ఎవరికి వైరస్‌ సోకిందో గుర్తించడం కష్టమేనని వైద్యనిపుణులు చెబుతున్నారు. 


నిజానికి మొదటిదశలో మన అధికారులు కూడా ఈ వైరస్‌ ముప్పును అంత తీవ్రంగా భావించలేదు. థర్మల్‌ స్ర్కీనింగ్‌ను సైతం తూతూమంత్రంగా చేశారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ రాజీవ్‌గౌబా కూడా అన్ని కేంద్రపాలిత/రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తూ లేఖ రాశారు. విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు.. ప్రభుత్వాల నిఘాలో ఉన్నవారి సంఖ్యకు తేడా ఉందని ఆందోళన వెలిబుచ్చారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ఆ తేడా విఘాతం కలిగించి, అందరినీ అపాయంలో పడేస్తుందని.. విదేశాల నుంచి వచ్చిన వారందరినీ క్వారంటైన్‌లో పెడితే తప్ప ముప్పు ఎదుర్కోలేమని హెచ్చరించారు.


వారం పది రోజుల్లో..

వైద్యనిపుణులు చెబుతున్న ప్రకారం.. లాక్‌డౌన్‌ వంటి చర్యలు కేవలం వైరస్‌ వ్యాపించే వేగాన్ని కొంతమేర తగ్గిస్తాయంతే. వైర్‌సను పూర్తిగా నిర్మూలించాలంటే దానిపై ఎదురుదాడి చేయాలి. ఎదురుదాడి అంటే.. వైరస్‌ సోకినవారిని గుర్తించడం, వారిని ఇతరులకు దూరంగా ఉంచి చికిత్స చేయడం, ఈలోపు వారి ద్వారా ఎవరికి వైరస్‌ సోకిందో వారిని గుర్తించడం.. వారికి ఐసోలేషన్‌లో ఉంచడం. ఇలా చివరి పేషెంట్‌ వరకూ గుర్తించి చికిత్స చేయాలి. ఈ ప్రక్రియ యుద్ధప్రాతిపదికన జరిగితే తప్ప వైర్‌సను నిర్మూలించలేమని చెబుతున్నారు. కానీ, మనదేశంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. 


ప్రభుత్వం ఎంత చెప్తున్నా కూడా.. జనతాకర్ఫ్యూ ముందు రోజు ప్రజలు గుంపులుగుంపులుగా రోడ్ల మీదకు వచ్చి నిత్యావసరాలు కొనుగోలు చేశారు. జనతాకర్ఫ్యూ జరిగిన రోజు సాయంత్రం 5 గంటలకు చప్పట్లు, ఘంటానాదాలతో అత్యవసర సేవల సిబ్బందికి అభినందనలు తెలపాలని ప్రధాని సూచిస్తే.. రోడ్ల మీద విజయోత్సవాలు నిర్వహించారు. మూడు రోజుల క్రితం.. హాస్టళ్ల విద్యార్థులంతా ఎన్‌వోసీల కోసం పోలీ్‌సస్టేషన్ల ముందు బారులు తీరారు. ఇక, విదేశాల నుంచి వచ్చి హోం కార్వరంటైన్లలో ఉండకుండా కాలనీల్లో తిరుగుతున్నవారి సంగతి సరేసరి. అలాంటివారందరి వల్ల ఎంత మందికి వైరస్‌ సోకిందో.. ఆ తీవ్రత ఎంత ఉందో.. వారం, పది రోజుల్లో బయటపడనుంది.


విరుగుడు అదే..

చాప కింద నీరులా విస్తరిస్తున్న కరోనాను కట్టడి చేయాలన్నా.. వైరస్‌ తీవ్రత వాస్తవంగా ఎంత ఉందో తెలుసుకోవాలన్నా.. దానికి మార్గం ర్యాండమ్‌ టెస్టింగ్‌ ఒక్కటేనని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ర్యాండమ్‌ టెస్టింగ్‌ అంటే.. ఎలాంటి లక్షణాలూ లేకున్నా వైరస్‌ వ్యాపించే ముప్పున్న ప్రాంతాల్లో కొంతమందిని ఎంచుకుని వారికి పరీక్షలు చేయించడం. ఉదాహరణకు కూరగాయల దుకాణాలు, మాల్స్‌కు వచ్చే వారి నుంచి నమూనాలను  సేకరించడం.. గుంపులు, గుంపులుగా బయటకు వచ్చేవారిలో కొందరికి పరీక్షలు చేయడం ద్వారా రాష్ట్రంలో వైరస్‌ తీవ్రతను అంచనా వేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ వైరస్‌ మనదేశంలో ప్రవేశించిన తొలినాళ్లలో.. అంటే ఫిబ్రవరి మొదటివారంలో ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇలా ర్యాండమ్‌ పరీక్షలు నిర్వహించింది. అవన్నీ నెగెటివ్‌ రావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఆ తర్వాత ర్యాండమ్‌ టెస్టింగ్‌లు నిలిచిపోయాయి. ఇప్పుడు వైరస్‌ ఇంతగా వ్యాపిస్తున్నా ర్యాండమ్‌ పరీక్షలు చేయట్లేదు.


ఇవీ గణాంకాలు..

జనవరి నుంచి ఇప్పటిదాకా తెలంగాణలోకి విదేశాల నుంచి 77 వేల మంది వచ్చినట్టు అంచనా. వారిలో సుమారు 17,283 మందికి కరోనా అనుమానిత లక్షణాలు కనిపించాయి. లక్షణాలు తీవ్రంగా ఉన్న 764 మంది నమూనాలను సేకరించి, వారందర్నీ ఆస్పత్రిలో ఐసోలేషన్‌లో ఉంచారు. మిగతావారిలో ఎంత మంది  ఎక్కడెక్కడ తిరిగారో కచ్చితమైన సమాచారం లేదు. ఇప్పటికే వారి నుంచి వైరస్‌ వ్యాపించి ఉండొచ్చన్న ఆందోళన ఉంది. ఇప్పటికైనా వైరస్‌ ప్రభావం ఏ స్థాయిలో ఉందో అంచనా వేయడానికి ర్యాండమ్‌ పరీక్షలు నిర్వహించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.


‘జనవరి 18 నుంచి.. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరికీ విమానాశ్రయాల్లో స్ర్కీనింగ్‌ నిర్వహిస్తున్నాం. అప్పట్నుంచి మార్చి 23 దాకా వివిధ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు విదేశాల నుంచి 15 లక్షల మంది ప్రయాణికులు వచ్చారు. ఆ సంఖ్యకు.. ప్రస్తుతం ప్రభుత్వ పర్యవేక్షణలో/నిఘాలో ఉన్నవారి సంఖ్యకు మధ్య తేడా ఉంది. కరోనాపై మనం చేస్తున్న పోరుకు ఈ తేడా చాలా ప్రమాదకరం. మనదేశంలో కొవిడ్‌-19 పాజిటివ్‌గా తేలినవారిలో అత్యధికులు విదేశీ ప్రయాణాల చరిత్ర ఉన్నవారే. వైరస్‌ వ్యాప్తిని నియంత్రించాలంటే విదేశాల నుంచి వచ్చినవారందరినీ నిఘాలో ఉంచడం కీలకం. ఈ దిశగా తక్షణ చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలకూ కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ పలుమార్లు విజ్ఞప్తి చేసింది. ఈ దిశలో కలిసికట్టుగా, దృఢమైన చర్యలు వెంటనే తీసుకోవాలని, విదేశాల నుంచి వచ్చిన పత్రి ఒక్కరినీ నిఘాలో (క్వారంటైన్‌లో) ఉంచాలని.. ఇందులో జిల్లాల యంత్రాంగాలను భాగం చేయాలని కోరుతున్నాం.

- రాజీవ్‌ గౌబా, కేంద్ర కేబినెట్‌ సెక్రటరీ (రాష్ట్రాల/కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్‌ సెక్రటరీలకు రాసిన లేఖ)


‘‘కొవిడ్‌-19 వ్యాప్తిని తగ్గించేందుకు చాలా దేశాలు ‘లాక్‌డౌన్‌’ వంటి పద్ధతులను పాటిస్తున్నాయి. కానీ, అలాంటి చర్యలు మాత్రమే కరోనాను ఆపలేవు. వాటివల్ల మరి కాస్త సమయం లభిస్తుందంతే. ఆ సమయాన్ని ఆయా దేశాలు ఎలా వాడుకున్నాయన్నదే ప్రశ్న. ఆ సమయంలో నావెల్‌ కరోనా వైర్‌సపై దాడి చేయాల్సిందిగా మేం ప్రపంచదేశాలకు పిలుపునిస్తున్నాం. వైరస్‌ బాధితులను గుర్తించడం, ఐసోలేట్‌ చేయడం, పరీక్షించడం, చికిత్స చేయడం. ఈలోగా వారి నుంచి ఎంత మందికి సోకిందో గుర్తించడం.. విస్తృతంగా చేస్తేనే వైర్‌సను నిర్మూలించగలం’’

- టెడ్రోస్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌

Updated Date - 2020-03-28T09:06:43+05:30 IST