రంగలీల మైదానంలో జనం అవస్థలు

ABN , First Publish Date - 2021-10-17T06:10:38+05:30 IST

రంగలీల మైదానంలో జనం అవస్థలు

రంగలీల మైదానంలో జనం అవస్థలు

ఏకశిలనగర్‌(వరంగల్‌), అక్టోబరు 16 : ఉర్సుగుట్ట రంగలీల మైదానం లో శుక్రవారం సాయంత్రం జరిగిన రావణవధ వేడుకలో పోలీసుశాఖ పూర్తిగా విఫలమైనట్టు కనిపించింది. వేడుకను తిలకించేందుకు జనం పెద్దసంఖ్యలో వస్తారని తెలిసినప్పటికీ ఆ మేరకు తగిన ఏర్పాట్లను చే యడంలో పకడ్బందీగా వ్యవహరించలేదు. జనాన్ని అదుపు చేయడంలో, ట్రాఫిక్‌ క్రమబద్దీకరణలో చేతులెత్తేశారనే విమర్శలు వ్యక్తమయ్యాయి.  

ఉర్సుగుట్ట వద్దకు చేరుకునేందుకు ఉన్న నాలుగు ప్రధాన రహదారుల్లో వాహనాలు ఎక్కడికక్కడి నిలిచిపోవడం, దాదాపు గంటన్నర సేపు జనం నరకయాతన పడటం, కరీమాబాద్‌ బీరన్నగుడి దారిలో ముందుకు, వెనక్కి వెళ్లలేని పరిస్థితుల్లో పిల్లలు గుక్కపట్టి ఏడవడం ఇందుకు సాక్ష్యాలుగా కనిపించాయి. వేలాదిమంది ప్రజలు ట్రాఫిక్‌లో చిక్కుకోవడంతో వేడుకను తిలకించే అవకాశం కోల్పోయారు. 

ఇక రావణవధ జరిగిన ఉర్సుగుట్ట వద్ద కూడా ఏర్పాట్లు లోపభూయిష్టంగా ఉన్నాయి. బారికేడ్‌లు ఏర్పాటుచేసి, ఆహ్వానితుల కోసం  కుర్చీలు వేసినప్పటికీ గ్యాలరీల సూచిక బోర్డులు ఏర్పాటుచేయలేదు. దీంతో పాస్‌లతో వచ్చిన వారు ఎక్కడికి వెళ్లాలో తెలియక అయోమయానికి గురయ్యారు. దీనికితోడు ప్రధాన ఎంట్రన్స్‌ గుండా వీవీఐపీల కార్లను అనుమంతించడంతో  వాటి వెనకాల జనం తోసుకుంటూ గ్యాలరీల్లోకి చొరబడ్డారు. పోలీసులు చేష్టలుడిగి చూస్తుండిపోయారే గానీ నిలువరించలేకపోయారు. దీంతో పాస్‌లున్న వారు కూర్చోవడానికి కుర్చీలే కనిపించలేదు. వేదికమీద ఆసీనులయ్యే వారి విషయంలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. అతిథులు సమయానికి రాకుండా ఒక్కొక్కరు ఒక్కోసారి రావడంతో కార్యక్రమ నిర్వహణకు ఆటంకాలు ఏర్పడ్డాయి. 

ఇక ట్రాఫిక్‌ నిర్వహణ అస్తవ్యసంగా మారింది. వాహనాల కోసం ఎక్కడికక్కడ పార్కింగ్‌స్థలాలు ఏర్పాటు చేసినట్టు ప్రకటించినా, వాటిని ఉపయోగించేలా చర్యలు తీసుకున్నట జాడలే  కనిపించలేదు. దీంతో ఫ్లైఓవర్‌ బ్రిడ్జి నుంచి ఉర్సు గుట్ట వరకు వేలాది వాహనాలు రోడ్డుపైనే నిలిచిపోయాయి. అలాగే కరీమాబాద్‌ నుంచి ఉన్న దసరా రోడ్డులో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. వాహనాల క్రమబద్దీకరణకు వెంటవెంటనే చర్యలు తీసుకునే వారే కనిపించలేదు. వాహనాల్లోని వారు గంటన్నర పాటు నరకయాతన పడ్డారు. ఇక  టూవీలర్లు, పాదచారుల యాతన చెప్పనలవి కాని విఽధంగా మారింది. పిల్లలు, మహిళలు, వృద్ధులు అనేక అవస్థలు పడ్డారు. వేలాదిమంది ట్రాఫిక్‌లో చిక్కుకొని ఉండగానే రావణ వధ వేడుక ముగిసింది. దూరప్రాంతాల నుంచి వస్తే కనీసం వేడుకను తిలకించలేకపోయామని జనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  ఉత్సవాల అనంతరం జనం  మైదానం నుంచి బయటకు వెళ్లడానికి కూడా  ఇబ్బందులు పడ్డారు. మొత్తంగా పోలీసుల ప్రణాళిక లోపం కొట్టొచ్చినట్టుగా కనిపించింది. ప్రజల ఇబ్బందులను గమనించిన వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నరేందర్‌... రావణవధ వేడుక నిర్వహణలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని వేదికపై నుంచే విమర్శించారు.

Updated Date - 2021-10-17T06:10:38+05:30 IST