May 30 2021 @ 03:19AM

50 వేల కోసం మందు మానేశారు!

ఎస్వీ రంగారావు గురించి సూపర్ స్టార్ కృష్ణ తన తాజా ఇంటర్వ్యూలో చెప్పిన మాటలివి.


‘‘రంగారావుగారు అనగానే రెండు విషయాలు గుర్తుకొస్తాయి. వీటిలో మొదటిది ‘పండంటి కాపురం’. అప్పట్లో రంగారావుగారు షూటింగ్‌కు సరిగ్గా రారని., ఇబ్బంది పెడతారని పేరు ఉండేది. మేము తీసిన ‘పండంటి కాపురం’ సినిమాకు ఆయన కొంత ఇబ్బంది పెట్టారు కూడా! ఆ సినిమాలో జమునగారు పోషించిన రాణీ మాలినీదేవి వేషానికి ముందు భానుమతిగారిని అనుకున్నాం. ఆవిడతో పడలేమని జమునగారిని తీసుకున్నాం. ఈ విషయం తెలిసి ఆవిడకు కోపం వచ్చింది. ఈ సినిమాకు పోటీగా మరో సినిమా మొదలుపెట్టాలనుకుంది. దీనిలో ఒక వేషం వేయమని గుమ్మడిగారిని ఆమె అడిగారు. ఈ విషయాన్ని గుమ్మడిగారు ‘పండంటి కాపురం’ షూటింగ్‌ సమయంలో అందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నప్పుడు చెప్పారు. దీంతో రంగారావుగారికి కోపం వచ్చింది.

‘ఇంతమంది ఆర్టిస్టులు ఈ సినిమా కోసం కష్టపడుతుంటే భానుమతి పోటీగా సినిమా తీస్తుందా? ఎలా తీస్తుందో చూస్తాను. ఇవాళ్టి నుంచీ నేను అన్నీ మానేస్తున్నాను’ అన్నారు. అనడమే కాదు ‘పండంటి కాపురం’ షూటింగ్‌ జరిగిన మిగిలిన అన్ని రోజులూ ఆయన మందు జోలికి వెళ్లకుండా ఉదయం ఏడు గంటలకే షూటింగ్‌ స్పాట్‌లో ఉండేవారు. ఆయన వర్క్‌ 16 రోజుల్లో తీసేశాం. మిగిలిన ఆర్టిస్టులు కూడా సహకరించడంతో సినిమా తొందరగా పూర్తయింది. ఇక రెండోది ‘దేవుడు చేసిన మనుషులు’. ఈ సినిమా డేట్స్‌ కావాలని నేనే ఆయనను అడిగా. ‘పండంటి కాపురం’ చిత్రానికి మీరు 30 వేలే ఇచ్చారు. ఏమన్నా న్యాయంగా ఉందా?’ అని ఆయన అడిగారు. ‘సరే సార్‌. పది రోజులు మందు జోలికి వెళ్లకుండా ఈ సినిమాకు పనిచేయండి. 50 వేలు ఇస్తాను’ అన్నాను. ‘నిజంగా ఇస్తావా?’ అని అడిగారాయన.


‘మీరు తాగుడు మానేసి సెట్‌కు వస్తే తప్పకుండా ఇస్తా’ అన్నాను. ఆయన సరేనన్నారు. బెంగళూరులో ‘దేవుడు చేసిన మనుషులు’ షూటింగ్‌ జరిగింది. రంగారావుగారు తన మాట నిలబెట్టుకున్నారు. మందు జోలికి వెళ్లకుండా బుద్దిగా షూటింగ్‌కి వచ్చేవారు. వర్క్‌ పూర్తి కాగానే చైనీస్‌ రెస్టారెంట్‌కు వెళ్లి ఫుల్లుగా తినేసి రూమ్‌కి వెళ్లి పడుకునేవారు. మళ్లీ పొద్దునే ఏడు గంటలకు సెట్‌కు వచ్చేవారు. అలా పది రోజులు పనిచేశారు. ఆయన వర్క్‌ పూర్తయింది. సంతోషంగా 50 వేలు తీసుకెళ్లిపోయారు.’’