Abn logo
Mar 6 2021 @ 02:07AM

‘ఆమె’పై అఘాయిత్యం

ఎదుటివారి అమాయకత్వాన్నో, నిస్సహాయతనో ఆసరాగా చేసుకొని లొంగదీసుకునే మృగాళ్లు.. ఎక్కడ, ఏ రూపంలో వచ్చి దాడి చేస్తారో తెలియని పరిస్థితి. అలాంటి దాడులు బాధితుల జీవితాలను చిన్నాభిన్నం చేసి తీరని గాయాలను మిగులుస్తాయి. సమాజం ముందుకెళ్తోందని ఎంతగా అనుకున్నా.. వెలుగుచూసే ప్రతి అత్యాచార సంఘటన ఆ విశ్వాసాన్ని దారుణంగా దెబ్బతీస్తోంది. రేపిస్టులున్నారు జాగ్రత్త అని హెచ్చరిస్తోంది. 


బాలికపై అత్యాచారం

బోయిన్‌పల్లి, మార్చి 5 (ఆంధ్రజ్యోతి) : ఓ యువకుడు మాయమాటలతో బాలికను నమ్మించి అత్యాచారానికి పాల్పడ్డాడు. బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీఐ రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం ఒంగోలుకు చెందిన బాలిక (16) ఓ వసతి గృహంలో ఎనిమిదో తరగతి చదువుతోంది. లాక్‌డౌన్‌ కారణంగా ఆమె సంవత్సర కాలంగా ఓల్డ్‌ బోయిన్‌పల్లిలోని తన పెద్దమ్మ వద్ద ఉంటోంది. ఆరు నెలల క్రితం ఓల్డ్‌ బోయిన్‌పల్లికి వచ్చిన సంగారెడ్డి జిల్లా కొహిర్‌కు చెందిన ఇర్ఫాన్‌ (25) ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. అతడికి మూడు నెలల క్రితం బాలికతో పరిచయమైంది. మాయమాటలతో ఆమెను లోబరుచుకొని పలుమార్లు అత్యాచారం చేశాడు. బాలిక ఈ నెల 3న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా గుంటూరులోని తమ బంధువుల ఇంటికని వెళ్ళింది. ఆ మరుసటి రోజున ఇర్ఫాన్‌ సైతం గుంటూరుకు వెళ్ళాలనుకున్నాడు. బాలిక అదృశ్యమైనట్లుగా పెద్దమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో భాగంగా సీసీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు ఈ నెల 4న ఇర్ఫాన్‌ను అదుపులోకి తీసుకొని విచారించడంతో నేరాన్ని అంగీకరించాడు. ఇర్ఫాన్‌ సమాచారం మేరకు పోలీసులు బాలికను గుంటూరులో అదుపులోకి తీసుకుని బంధువులకు అప్పగించారు. నిందితుడిపై అత్యాచారం, పోక్సో, ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటీ యాక్టుల కింద కేసులు నమోదుచేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. దళిత వర్గానికి చెందిన బాలికపై ఓ వర్గానికి చెందిన వ్యక్తి ప్రార్థనా మందిరంలో అత్యాచారం చేశాడంటూ బీజేపీ, ఎంఆర్‌పీఎస్‌, వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్‌ నేతలు బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ ముందు ధర్నా చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. సమాచారం అందుకున్న ఉత్తర మండలం డీసీపీ కల్మేశ్వర్‌ సింగ్నావర్‌, ఏసీపీ నరేష్‌రెడ్డి ఠాణాకు చేరుకొని నేతలతో సమావేశమై వారికి సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు. బీజేవైఎం నేత ప్రకాష్‌ మాట్లాడుతూ మహిళలు, యువతులను మోసం చేస్తూ అత్యాచారాలకు ఒడిగడుతున్న వారిని ఎన్‌కౌంటర్‌ చేయాలని అన్నారు. 


ఇల్లు అమ్మిస్తే కమీషన్‌ ఇస్తానని పిలిచి మహిళపై..

చార్మినార్‌, మార్చి 5 (ఆంధ్రజ్యోతి) : తన ఇల్లు అమ్మిస్తే కమీషన్‌ ఇస్తానని ఓ మహిళను పిలిచి అత్యాచారం చేసిన సంఘటన రెయిన్‌బజార్‌ పీఎస్‌ పరిధిలో జరిగింది. అడిషనల్‌ ఇన్‌స్పెక్టర్‌ అంజద్‌ అలీ తెలిపిన వివరాల ప్రకారం రెయిన్‌బజార్‌కు చెందిన అహ్మద్‌ఖాన్‌(29) తన ఇల్లు అమ్మాలనుకుంటున్నానని, అమ్మిపెడితే కమీషన్‌ ఇస్తానని మాయమాటలతో ఓ మహిళను ఇంటికి రప్పించాడు. ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు. భయపడిన ఆమె విషయం ఎవరికీ చెప్పలేదు. దీంతో ఆమెపై తిరిగి అత్యాచారానికి పాల్పడ్డాడు. అతని వేధింపులు భరించలేక భర్త సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు అహ్మద్‌ఖాన్‌ను అదుపులో తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

Advertisement
Advertisement