రాఫెల్‌ ముడుపులు!

ABN , First Publish Date - 2021-04-06T08:23:11+05:30 IST

రాఫెల్‌ యుద్ధ విమానాల తయారీ సంస్థ దసో ఏవియేషన్‌ మధ్యవర్తులకు ముడుపులు చెల్లించినట్లు ఫ్రెంచ్‌ న్యూస్‌ పోర్టల్‌ ‘మీడియా పార్ట్‌’

రాఫెల్‌ ముడుపులు!

  • ‘క్లయింట్లకు బహుమతి’ పేరుతో రూ.8.6 కోట్లు
  • భారత కంపెనీ ‘డిఫ్‌సిస్‌’కు ఇచ్చిన దసో ఏవియేషన్‌
  • ఫ్రాన్స్‌ అవినీతి నిరోధక విభాగం ఆడిట్‌లో వెలుగులోకి
  • ఫ్రెంచ్‌ న్యూస్‌ పోర్టల్‌ ‘మీడియాపార్ట్‌’ సంచలన వార్త


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): రాఫెల్‌ యుద్ధ విమానాల తయారీ సంస్థ దసో ఏవియేషన్‌ మధ్యవర్తులకు ముడుపులు చెల్లించినట్లు ఫ్రెంచ్‌ న్యూస్‌ పోర్టల్‌ ‘మీడియా పార్ట్‌’ సంచలన కథనాన్ని ప్రచురించింది. ఆ సంస్థ.. పది లక్షల యూరోలను (దాదాపు రూ.8.6 కోట్లు) గురుగ్రామ్‌లోని డిఫ్‌సిస్‌ అనే కంపెనీకి ఇచ్చిందని అందులో పేర్కొంది. ఫ్రాన్స్‌ అవినీతి నిరోధక శాఖ ఏఎ్‌ఫఏ 2018లోనే ఈ విషయాన్ని గుర్తించిందని తెలిపింది. ఆ కథనం ప్రకారం.. దసో కంపెనీలో ఆడిట్‌ చేస్తున్న ఏఎ్‌ఫఏకు 2017 సంవత్సరం ఖాతాల్లో కనిపించిన ఒక లావాదేవీ పలు సందేహాలను లేవనెత్తింది. ‘క్లయింట ్లకు బహుమతులు’ పేరిట 5,08,925 యూరోలు ఇచ్చినట్టు అందులో ఉంది. దీనిపై దసో కంపెనీని ప్రశ్నిస్తే భారత్‌కు చెందిన డిఫ్‌సిస్‌ అనే కంపెనీ ఇచ్చిన ప్రొఫార్మా ఇన్‌వాయి్‌సను దసో కంపెనీ ఏఎ్‌ఫఏకు సమర్పించింది. 


ఒక్కొక్కటీ 20,357 యూరోల చొప్పున 50 రాఫెల్‌ నమూనా విమానాల తయారీకి సంబంధించి 5,08,925 యూరోలకు (మొత్తం బిల్లు 10,17,850 యూరోలు. అంటే 50 శాతానికి) ఇచ్చిన ఇన్‌వాయి్‌స అది. దీంతో వారు దసో సంస్థ నుంచి వివరణ కోరారు. నమూనా విమానాల కొనుగోలు బోగస్‌ అని, రహస్య నగదు లావాదేవీలను దాచడానికే ఈ బోగస్‌ కొనుగోలు చేసి ఉంటారని ఏఎ్‌ఫఏ ఇన్‌స్పెక్టర్లు అనుమానించారు. అయినా ఈ విషయాన్ని విచారణాధికారుల దృష్టికి తీసుకెళ్లకూడదని ఏఎ్‌ఫఏ నిర్ణయించినట్టు మీడియా పార్ట్‌ వెల్లడించింది. అంతేకాదు 5 లక్షల యూరోలు క్లయింట్లకు కానుకగా ఇవ్వడమంటే చాలా పెద్ద మొత్తమని.. క్లయింట్లకు మంచి వాచీ, ఖరీదైన భోజనం పెట్టినా ఫ్రాన్స్‌ చట్టాల ప్రకారం అవినీతి కిందకే వస్తుందని పేర్కొంది. 


ఆ కుంభకోణంలోని వారే..

డిఫ్‌సిస్‌ సొల్యూషన్స్‌ కంపెనీ.. అగస్టా వెస్ట్‌లాండ్‌ హెలికాప్టర్ల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సురేశ్‌ మోహన్‌ గుప్తా కుటుంబానికి చెందిందని మీడియాపార్ట్‌ తన కథనం లో వెల్లడించింది. రాఫెల్‌ డీల్‌కు సం బంధించి.. డిఫ్‌సిస్‌ కంపెనీ భారత్‌లో దసో కంపెనీకి సబ్‌-కాంట్రాక్టర్‌గా పనిచేస్తోంది. ఆ కంపెనీలో 170 మంది ఉద్యోగులున్నారు. విమానా ల నమూనాల తయారీలో ఆ కంపెనీ స్పెషలిస్ట్‌ కాదు. కేవలం.. విమానయాన రంగంలో ఫ్లైట్‌ సిమ్యులేటర్లు, ఆప్టికల్‌, ఎలకా్ట్రనిక్‌ వ్యవస్థల అసెంబ్లింగ్‌ మాత్ర మే చేస్తుంది. అగస్టా వెస్ట్‌లాండ్‌ హెలికాప్టర్ల కుంభకోణంలో ఈడీ అధికారులు 2019 మార్చిలో ఆయన్ను అరెస్టు చేశారు. ఆయన దసో కంపెనీ తరఫున భారత్‌లో పనిచేశారని, రక్షణ శాఖ నుంచి అత్యంత గోప్యమైన సమాచారాన్ని సేకరించారని ఆరోపణలున్నాయి.




మోదీ.. ఇప్పుడేమంటారు?


రాఫెల్‌లో ముడుపుల బాగోతంపై మీడియా పార్ట్‌లో వచ్చిన కథనం ఢిల్లీ రాజకీయ వర్గాల్లో సంచలనం రేపింది. రాఫెల్‌ కుంభకోణంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని గత కొంత కాలంగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేస్తున్న ఆరోపణలు సత్యమని ఈ కథనంతో రుజువైందని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి సూర్జేవాలా అన్నారు. మోదీ ఇప్పుడు దేశానికి ఏ సమాధానం చెబుతారు? అని సూర్జేవాలా ప్రశ్నించారు. ఎవరికి ఎంత మేరకు ముడుపులు చెల్లించారో పూర్తి స్థాయి స్వతంత్ర దర్యాప్తు జరగాలని ఆయన డిమాండ్‌ చేశారు. అయితే.. రాఫెల్‌ డీల్‌లో ముడుపుల ఆరోపణలు నిరాధారమైనవని, కొన్ని కంపెనీల మధ్య శత్రుత్వం వల్ల ఇలాంటి తప్పుడు ప్రచారం జరుగుతుంటోందని కేంద్ర మంత్రి, బీజేపీ  నేత రవిశంకర్‌ ప్రసాద్‌ అన్నారు. అగస్టా వెస్ట్‌లాండ్‌ కేసులో చాలామంది కాంగ్రెస్‌ నేతల పేర్లు బయటకొచ్చాయని గుర్తుచేశారు.


Updated Date - 2021-04-06T08:23:11+05:30 IST