రాఫెల్‌ రహస్యం!

ABN , First Publish Date - 2021-04-09T05:47:54+05:30 IST

భారత్‌కు రాఫెల్‌ విమానాల రాకకూడా మొదలైంది కానీ, వాటి కొనుగోలులో ఏదో మతలబు ఉన్నదన్న వాదనలకు ఊతమిచ్చే కథనాలు మాత్రం వెలుగులోకి...

రాఫెల్‌ రహస్యం!

భారత్‌కు రాఫెల్‌ విమానాల రాకకూడా మొదలైంది కానీ, వాటి కొనుగోలులో ఏదో మతలబు ఉన్నదన్న వాదనలకు ఊతమిచ్చే కథనాలు మాత్రం వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. విమానాల అమ్మకంలో భాగంగా ఫ్రెంచ్‌ సంస్థ దసో ఏవియేషన్‌ భారతదేశంలోని మధ్యవర్తికి గిఫ్ట్‌ ఇచ్చిందని ‘మీడియా పార్ట్‌’ అనే ఫ్రెంచ్‌ న్యూస్‌ పోర్టల్‌ ఇటీవల ఓ సంచలనకథనాన్ని ప్రచురించింది. బహుమతి పేరిట ముట్టచెప్పిన ఈ మొత్తం చిన్నదే కావచ్చును కానీ, రాఫెల్‌ కొనుగోలు వ్యవహారాన్ని పవిత్రం, పారదర్శకం అంటూ అధికారంలోవారూ, సర్వస్వతంత్ర సంస్థలూ అభివర్ణించిన నేపథ్యంలో ఈ కథనం ఆ వాదనను ప్రశ్నిస్తున్నది. 


పదిలక్షలయూరోలు అంటే సుమారు 9కోట్ల రూపాయల అవినీతి బాగోతాన్ని దసో కంపెనీ 2017ఖాతాల్లో ఫ్రెంచ్‌ అవినీతి నిరోధకశాఖ గుర్తించిందని మీడియాపార్ట్‌ కథనం. విమానాల నమూనా కోసం అంటూ ఖాతాల్లో రాసుకున్న ఈ రహస్య లావాదేవీని అధికారులు గుర్తించినప్పటికీ, ఈ ఖరీదైన లంచం విషయంలో వారు నోరుమెదపలేదని ఈ న్యూస్‌ పోర్టల్‌ అంటున్నది. అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ హెలికాప్టర్ల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుసేన్‌ గుప్తాకు రాఫెల్‌ విమానాల కొనుగోలు వ్యవహారంలోనూ ఈ బహుమతి మొత్తం ముట్టిందట. ఈయన కంపెనీ భారత్‌లో దసోకు సబ్‌కాంట్రాక్టర్‌. అగస్టా కుంభకోణానికి సంబంధించి మాత్రం 2019లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ అధికారులు ఈయనను అరెస్టుచేశారు. 


రాఫెల్‌ విమానాల కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకున్నట్టు రాహుల్‌ గాంధీ చేస్తున్న ఆరోపణలు ఈ కథనంతో రుజువైనాయనీ, సమగ్ర స్వతంత్ర దర్యాప్తుతో మరిన్ని లావాదేవీలు బయటకొస్తాయని కాంగ్రెస్‌ వాదిస్తున్నది. యూపీఏ ప్రభుత్వం చేసుకున్న 126 విమానాల ఒప్పందాన్ని అధికారంలోకి రాగానే మోదీ రద్దుచేసి, విమానాల సంఖ్యను ముప్పైఆరుకు కుదించి తిరిగి కుదర్చుకున్న కొత్త ఒప్పందాన్ని రాహుల్‌ తప్పుబట్టిన విషయం తెలిసిందే. అనిల్‌ అంబానీకి మేలుచేకూర్చే లక్ష్యంతోనే మోదీ గత ఒప్పందాన్ని తిరగరాశారన్నది కాంగ్రెస్‌ ఆరోపణ. 


రాఫెల్‌ ఒప్పందంలో అవినీతి, ఆశ్రితపక్షపాతం చోటుచేసుకున్నాయనీ, తత్సంబంధిత ఆధారాలపై అప్పటి ఆర్థికనేరాల విభాగం అధినేత దర్యాప్తును ఎందుకు నిలిపివేశారో తెలియడం లేదని పరిశోధనాత్మక కథనాలను ప్రచురించే ఈ వెబ్‌సైట్‌ అంటున్నది. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే ఒక ప్రభుత్వేతర సంస్థ ఇచ్చిన ఫిర్యాదుపై దేశ ప్రయోజనాలరీత్యా దర్యాప్తు చేయవద్దని ఈ సంస్థ అధినేత నిర్ణయించారట. ఇక, ముప్పై ఆరు యుద్ధవిమానాల కోసం మోదీ ప్రభుత్వం కుదర్చుకున్న కొత్త ఒప్పందంలో అవినీతి నివారణకు సంబంధించిన క్లాజులను రద్దుచేయడం వెనుక గుప్తా ఒత్తిళ్ళు ఉండివుండవచ్చునని కూడా మీడియాపార్ట్‌ అంటున్నది. ఈ నిబంధనలు కొత్త ఒప్పందంలోనూ కొనసాగినపక్షంలో, కొనుగోలుదారుకు అనేక అధికారాలు సంక్రమిస్తాయనీ, అవినీతి జరిగినా, అమ్మకందారు దళారులకు ఎంతో కొంతమొత్తాన్ని ముట్టచెప్పినట్టుగా తేలినా, ఎవరినైనా ప్రభావితం చేసినట్టు రుజువైనా భారత ప్రభుత్వం సదరు ఒప్పందాన్ని రద్దుచేసుకోవడమో, భారీ నష్టపరిహారాన్ని కోరడమో సాధ్యపడుతుందని మీడియాపార్ట్‌ ప్రత్యేకంగా వివరించింది. 2016 సెప్టెంబరులో మోదీ ప్రభుత్వం ఈ నిబంధనలను తొలగించడానికి అంగీకరించడం, ఆ తరువాత కాంట్రాక్టు ఖరారు కావడం తెలిసిందే. హిందుస్థాన్‌ ఎయిరోనాటిక్స్‌ను కాదని అనిల్‌ అంబానీని ముందుకుతెచ్చి, అత్యధిక విమానాలు ఇక్కడే తయారు కావాలన్న నియమాన్నీ సడలించి మోదీ ప్రభుత్వం కుదర్చుకున్న కొత్త ఒప్పందంలో కాగ్‌కు అక్రమాలేవీ కనబడని మాట నిజం. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రభుత్వానికి క్లీన్‌చిట్‌ ఇస్తూ, గత ఒప్పందంతో పోల్చితే మోదీ ప్రభుత్వం విమానాలను రెండున్నరశాతం తక్కువ ఖరీదుకే కొన్నదని కూడా పేర్కొంది. ఫ్రాన్స్‌ ప్రభుత్వానికి హామీ ఇచ్చినందున విమానం ధర ఎంతో బయటకు చెప్పడం కుదరదని మరోపక్క ప్రభుత్వం అన్నది. సుప్రీంకోర్టు కూడా సీల్డు కవర్లలో ఏవో వివరాలు పరిశీలించి, దర్యాప్తు అవసరం లేదని నిర్థారించింది. కానీ, ఫ్రాన్స్‌లోని ఈ చిన్న ఆన్‌లైన్‌ మీడియా సంస్థ మాత్రం రాఫెల్‌ విషయంలో పట్టుబట్టి శోధనలు చేస్తూ, అడపాదడపా ఉభయదేశాల పాలకులనూ ఇలా ఇరకాటంలోకి నెడుతూనే ఉంది.

Updated Date - 2021-04-09T05:47:54+05:30 IST