ర్యాపిడ్‌ కిట్లకు రెక్కలు

ABN , First Publish Date - 2020-08-13T11:31:47+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేరుగా జిల్లా డీఎంహెచ్‌వో కార్యాలయానికి వచ్చిన కొవిడ్‌ నిర్ధారణ ర్యాపిడ్‌ కిట్‌లకు రెక్కలు ఎలా వచ్చాయనే విషయంపై జిల్లా యంత్రాంగం

ర్యాపిడ్‌ కిట్లకు రెక్కలు

ప్రభుత్వం సరఫరా చేసిన కిట్‌లు అమ్మేశారా.. ప్రైవేట్‌ ఆస్పత్రులకు పంపారా 

పాజిటివ్‌ల సంఖ్య పెరుగుతుండడంతో జిల్లాకు పెద్దఎత్తున సరఫరా

విశ్రాంత డీఎంహెచ్‌వో హయాంలో దొడ్డిదారి పట్టిన కిట్లు రికవరీ   

ఇంకా ఏ సామగ్రి దారిమళ్లిందనే దానిపై శాఖాపరమైన విచారణకు ఆదేశం


(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేరుగా జిల్లా డీఎంహెచ్‌వో కార్యాలయానికి వచ్చిన కొవిడ్‌ నిర్ధారణ ర్యాపిడ్‌ కిట్‌లకు రెక్కలు ఎలా వచ్చాయనే విషయంపై జిల్లా యంత్రాంగం సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. అలాగే కొన్ని ప్రైవేట్‌ ఆస్పత్రులకు ఈ కిట్‌లు వెళ్లాయనే ప్రచారం జరుగుతుండడంతో క్షేత్ర స్థాయి విచారణ జరుగుతోందని సమాచారం. అయితే ఈ కిట్లు అమ్మేశారా, లేక ఎవరి బలవంతంతోనైనా దొడ్డిదారిలో తరలించారా అనేదానిపై అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవాలు నిగ్గుతేల్చి బాధ్యులపై చర్యలు తీసుకోడానికి ఈ శాఖ రంగం సిద్ధం చేస్తోంది. అయితే కాకినాడ జీజీహెచ్‌లో పనిచేస్తున్న ఎంఎన్‌వో 300 కిట్లు ఫోర్జరీ సంతకంతో తీసుకెళ్లాక, పోలీసుల విచారణలో వాటిలో కొన్ని దుర్వినియోగం కాగా, మిగిలినవి రికవరీ చేశారు. కిట్‌లు పక్కదారి పట్టడంలో ఎంఎన్‌వోకు ఎవరు సహకరించారనేది నిర్ధారణ కావాల్సి ఉంది. కాగా గత డీఎంహెచ్‌వో మల్లిక్‌ సారథ్యంలోని పోస్టులు డీఐవో, ఎన్‌హెచ్‌ఎం ప్రోగ్రాం ఆఫీసర్‌, ఐడీఎస్‌పీ, కొవిడ్‌ నోడల్‌ అధికారి, 104, 108 అంబులెన్సుల నిర్వహణ బాధ్యతల చార్జి ప్రస్తుత డీఎంహెచ్‌వోకు అప్పగించలేదు. దీంతో సంబంధిత పత్రాలు ఆమె వద్ద లేకపోవడం వల్ల అసలు ఎన్ని కిట్‌లు వచ్చాయి, ఎన్ని ఎక్కడికి పంపిణీ చేశారనే వివ రాలు లేకపోవడంతో పూర్తి స్థాయి విచారణకు ఆమె ముందుకు వెళ్లలేక పోయారు. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ విషయం బయటపడడంతో కొత్త డీఎంహెచ్‌వోకు బుధవారం మల్లిక్‌ స్పెసిమేన్‌ సిగ్నేచర్‌ (సీటీసీ)తోపాటు, ఆయా విభాగాల చార్జ్‌ను అప్ప గించారని సమాచారం. దీంతో విచారణ వేగం కానుంది. 


అంతా హడావుడే..  

కొవిడ్‌ కేసులు లెక్కకు మించి పెరుగుతుండడంతో ప్రభుత్వం జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించింది. కొవిడ్‌ మందులు, వైరస్‌ నిర్ధారణకు అవసర మయ్యే పరికరాల పంపిణీలో ఏ జిల్లాకు పంపిణీ చేయనంతగా ఈ జిల్లాకు పంపిణీ చేసింది. దీంతో పెద్దఎత్తున కొవిడ్‌ మందులు, కిట్లు డీఎంహెచ్‌వో కార్యాలయానికి సరఫరా అయ్యాయి. జూన్‌, జూలై నెలల్లో భారీగా సామగ్రి వచ్చింది. వీటిని పంపిణీ చేయడంలో అంతా హడా వుడే నెలకొంది. దీంతో ఎవరెవరికి, ఎక్కడకు ఎన్ని కిట్లు, మందులు పంపిణీ చేస్తున్నారో తెలిసేది కాదు. ఈ ప్రక్రియలో జవాబుదారి కొరవడ డంతో కొన్ని విలువైన మందులు, కిట్లు దొడ్డిదారి పట్టాయని తెలుస్తోంది. 


ఏళ్ల తరబడి ఒకేచోట తిష్ట   

రాష్ట్రంలో పెద్ద జిల్లాగా ఉన్న ఈ ప్రాంతంలో జనాభా రీత్యా ప్రజారోగ్యం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దండిగా నిధులు విడుదల చేస్తున్నాయి. ఈ నిధులను సక్రమంగా ఖర్చు చేసి ఆయా ఆరోగ్య కార్యక్రమాల అమల్లో లక్ష్యం చేరుకోవాల్సి ఉంటుంది. కాని ఈ శాఖలో కొందరు అక్రమార్కులు నిధుల్లో పర్సంటేజీలకు కక్కుర్తి పడుతున్నారు. తద్వారా పంపకాలపై బేరసారాలు చేస్తుంటారు. తాజాగా కరోనా విపత్తు నేపథ్యంలో జిల్లా వైద్య,ఆరోగ్య శాఖకు దండిగా నిధులు వచ్చాయి. దీంతో తూతూ మంత్రంగా ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహించి సింహభాగం నిధులను కొందరు తమ జేబులో వేసుకుంటున్నారు. నిజానికి డీఎంహె చ్‌వో కార్యాలయంలో ఎస్టాబ్లిష్‌మెంట్‌, అకౌంట్స్‌, జనరల్‌ సెక్షన్‌లకు ఒక్కో పర్యవేక్షణాధికారి ఉండాలి. కానీ ఈ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేసి, పర్యవేక్షణాఽధికారిగా పదోన్నతి పొంది, ఇక్కడే ఎనిమిదేళ్ల నుంచి ఒక ఉద్యోగి ఫోకల్‌ సీట్లో కొనసాగుతున్నారు. రెండు సార్లు బదిలీల నుంచి తప్పించుకుని కుర్చీ కదలడం లేదు. పైగా తన పోస్టుతోపాటు, మిగిలిన రెండు పర్యవేక్షణాధికారుల పోస్టుల్లో ఇంచార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక్కడకు ఎవరు కొత్తగా డీఎంహెచ్‌వోగా వచ్చినా, వారు ఈ ఉద్యోగి కనుసన్నల్లోనే మెలగాల్సిన పరిస్థితి నెలకొందని సమా చారం. లేదంటే వారిపై కుట్ర చేసి ప్రభుత్వానికి సరెండర్‌ చేసే స్థాయిలో పైరవీలు చేస్తుంటారు. ఎవరైనా ఉన్నతాధికారులు ఆయన్ను కదిపే ప్రయత్నం చేస్తే రాజకీయ పలుకుబడితో ఎదుర్కొంటాడని చెబుతారు. 


ఏవో రాష్ట్ర కేడర్‌ పోస్టు

డీఎంహెచ్‌వో కార్యాలయంలో డీఎంహెచ్‌వో తర్వాత పరిపాలన పర మైన పనులు చక్కదిద్దడానికి ఇక్కడ అడ్మినిస్ర్టేటివ్‌ ఆఫీసర్‌ (ఏవో) పోస్టు కీలకం. ఇది రాష్ట్ర కేడర్‌ పోస్టు. ఇక్కడ పనిచేసిన ఒక ఏవో నిధుల దుర్వినియోగం ఆరోపణలపై గతంలో సస్పెండ్‌ అయ్యారు. దీంతో ఈ పోస్టులో ఇంచార్జ్‌గా అప్పటి డీఐవో డాక్టర్‌ మల్లిక్‌కు విశ్రాంత డీఎంహెచ్‌వో డాక్టర్‌ బి సత్యసుశీల అప్పగించారు. జూన్‌ నెలలో మల్లిక్‌ ఇన్‌చార్జ్‌ డీఎంహెచ్‌వోగా బాధ్యతలు చేపట్టడంతో ఏవో బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఇదే కార్యాలయంలో డిస్ర్టిక్ట్‌ ఎక్స్‌టెన్సన్‌ మీడియా ఆఫీసర్‌ (డెమో) జోనల్‌ కేడర్‌ పోస్టులో కొనసాగుతున్న ఉద్యోగికి మల్లిక్‌ ఇన్‌చార్జ్‌ బాధ్యతలప్పగించారు. ఆరోగ్య కార్యక్రమాల ప్రచారం కోసం ఏర్పడిన డెమోకు పరిపాలనపరమైన విధులు అప్పగించడం విశేషం. ఇక కొత్తగా వచ్చిన డీఎంహెచ్‌వో తన ఉద్యోగులపై ఆరా తీస్తున్నారని తెలిసింది.

Updated Date - 2020-08-13T11:31:47+05:30 IST