Abn logo
Jun 10 2021 @ 02:28AM

తనఖాలో విశాఖ!

సొమ్ముల కోసం సర్కారు బరితెగింపు

కలెక్టరేట్‌, రెండు తహసీల్దార్‌ కార్యాలయాలు, మరిన్ని ప్రభుత్వ ఆస్తులు ఏపీఎ్‌సడీసీకి బదిలీ

ఆ తర్వాత తాకట్టు పెట్టి అప్పులు తెస్తారట!

రూ.1600 కోట్ల కోసం పరువు తక్కువ పనులు

15 శాఖలకు చెందిన 213 ఎకరాలు గుర్తింపు

శరవేగంగా భూముల బదిలీ ప్రక్రియ


విశాఖను పరిపాలనా రాజధానిగా ప్రకటించారు. ఉత్తరాంధ్రపై ఎంతో ప్రేమ ఒలకబోశారు. ఇక... విశాఖనగరంలో అభివృద్ధి బంగాళాఖాతంలో అలల్లా పోటెత్తుతుందని జనం భావించారు. కానీ... రాజకీయంగా విశాఖను గుప్పిట్లో ఉంచుకోవడం, నగరంలోని కీలక స్థలాలను స్వాధీనం చేసుకోవడం, బెదిరింపు దందాలకు దిగడం, గిట్టని వారికి చెందిన ఆస్తులను కూల్చివేయడం! ఇప్పటిదాకా జరిగింది ఇదే! ఇప్పుడు.... ఏకంగా విశాఖ నగరంలో ప్రజలకు చెందిన, ప్రజలు గర్వంగా భావించే ప్రభుత్వ ఆస్తులనూ తనఖా పెట్టేస్తున్నారు. రూ.1,600 కోట్ల అప్పు కోసం గతంలో ఎన్నడూలేని విధంగా పరువు తక్కువ పనులు చేస్తున్నారు!


ఇది కొత్త ట్రెండు...

‘మిషన్‌ బిల్డ్‌ ఏపీ’ పేరుతో వివిధ పట్టణాలు, నగరాల్లోని ప్రభుత్వ స్థలాలను అడ్డంగా అమ్మేసి సొమ్ము చేసుకోవాలని ఇప్పటికే ప్రణాళిక రచించారు. దీనిని కూడా తొలుత విశాఖలోనే అమలు చేయాలని భావించారు. ఇక్కడ భూముల విలువ అధికంగా ఉండడంతో భారీ మొత్తంలో ఆదాయం సమకూరుతుందని... ప్రభుత్వ ఆస్తులను తెగనమ్మే ప్రయత్నం చేశారు. దీనిపై పలువురు న్యాయస్థానాలను ఆశ్రయించడంతో ఆ ప్రక్రియ తాత్కాలికంగా ఆగింది. దీంతో ప్రభుత్వ ఆస్తులను ఏపీఎ్‌సడీసీకి కట్టబెట్టి, వాటిని తనఖా పెట్టి రుణం తెచ్చుకునే కొత్త ప్లాన్‌ అమలు చేస్తున్నారు.


(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి)

సర్కారు వారికి విశాఖనగరం ‘బంగారు గుడ్లు’పెట్టే బాతు మాత్రమే! ఈ విషయం మరోసారి రుజువైంది. విశాఖ నగరానికే ప్రత్యేకమైన కలెక్టర్‌ కార్యాలయంతోపాటు రెండు తహసీల్దార్‌ కార్యాలయాలు, ప్రభుత్వ అతిథిగృహం, పాలిటెక్నిక్‌ కాలేజీ, ఐటీఐ కాలేజీ తదితర ప్రభుత్వ ఆస్తులు తనఖాలోకి వెళ్లిపోతున్నాయి. మొత్తం 15 ప్రభుత్వ శాఖలకు చెందిన 213.56 ఎకరాలను తాకట్టు పెట్టి... బ్యాంకుల నుంచి రూ.1,600 కోట్లు అప్పు తేవాలని నిర్ణయించుకున్నారు. ఈ భూములను ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌(ఏపీఎ్‌సడీసీ) పేరిట బదిలీ చేయాలంటూ జిల్లా కలెక్టర్‌, రెవెన్యూ డివిజనల్‌ అధికారికి ఇటీవలే ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రక్రియ ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది. 


అభివృద్ధి కాదు... అప్పు కోసమే

రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన ఆర్థిక ప్రణాళికలు, ఫైనాన్సింగ్‌, సామాజిక, ఆర్థిక అభివృద్ధి ప్రాజెక్ట్‌లు, కార్యక్రమాల కోసం కొత్తగా ఏపీఎ్‌సడీసీని ఏర్పాటు చేశారు. పేరులో ‘అభివృద్ధి’ ఉన్నప్పటికీ... దీని ప్రధాన లక్ష్యం ఆస్తులు సృష్టించడం కాదు! కేవలం... అప్పులు తీసుకురావడం. ఏపీఎ్‌సడీసీ ద్వారా వివిధ బ్యాంకుల నుంచి రూ.25 వేల కోట్ల రుణాలను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది కొత్తగా ఏర్పాటైన సంస్థ కావడం, దాని అఽధీకృత మూలధనం రూ.5 లక్షలు మాత్రమే కావడంతో అన్ని వేల కోట్లు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రాలేదు. దీంతో... మద్యంపై అదనపు పన్ను విధించి, ఆ మొత్తాన్ని ఏపీఎ్‌సడీసీకి బదిలీ చేస్తున్నామని చెప్పి... ఆ ఆదాయాన్నే ‘ష్యూరిటీ’గా చూపించారు. నిజానికి... ఇది కూడా అక్రమమే! ఇలా... ఏపీఎ్‌సడీసీ ద్వారా రూ.18,500 కోట్ల రుణాన్ని సేకరించారు. ఇప్పుడు... ఈ సంస్థకు నికరంగా పది శాతం మూలధనం, అంటే రూ.2500 కోట్లు సమకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో రూ.900 కోట్లు ఇతర మార్గాల్లో ఇవ్వనున్నారు. 


మరో రూ.1600 కోట్ల కోసం... పాలకుల దృష్టి విశాఖపట్నంపై పడింది. విశాఖలో కలెక్టరేట్‌ సహా పలు ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల భూములను తాకట్టు పెట్టి రూ.1600 కోట్లు సమకూర్చుకోవాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం ఆయా కార్యాలయాలు, సంస్థల భూములన్నీ ఏపీఎ్‌సడీసీ పేరు మీదకు బదిలీ చేయనున్నారు. జిల్లా కలెక్టర్‌ వినయ్‌చంద్‌ తన సొంత కార్యాలయం సహా 15 ప్రభుత్వ ఆస్తులకు చెందిన 213.56  ఎకరాల భూములను ఏపీఎ్‌సడీసీ పేరున బదిలీ చేయాలని విశాఖ ఆర్‌డీవో పెంచలయ్యను ఆదేశించారు. అతి త్వరలోనే ఆయా ఆస్తులన్నీ ఏపీఎ్‌సడీసీ సొంతమవుతాయి. ఆ తర్వాత ఇవే భూములను బ్యాంకులకు తాకట్టు పెట్టి... అప్పులు తెచ్చుకుంటారు. 


ఏయే భూములను తాకట్టు పెడుతున్నారంటే...

1) కలెక్టర్‌ కార్యాలయం  -    2.94 ఎకరాలు 

2) ప్రభుత్వ అతిథి గృహం, వాల్తేరు- 5.53 ఎకరాలు

3) జిల్లా శిక్షణా కేంద్రం,  చినగదిలి - 0.75 ఎకరాలు

4) మహారాణిపేట తహసీల్దారు కార్యాలయం - 2.35 ఎకరాలు

5) ఫారెస్ట్‌ గెస్ట్‌హౌస్‌, వాల్తేరు- 2.08 ఎకరాలు

6) పాత డీఈవో ఆఫీస్‌- 5.41 ఎకరాలు

7) రైతుబజారు, గోపాలపట్నం - 2.16 ఎకరాలు

8) ప్రభుత్వ ఐటీఐ కాలేజీ- 17.33 ఎకరాలు

9) పాలిటెక్నిక్‌ కాలేజీ, కప్పరాడ - 23.58 ఎకరాలు

10) రెవెన్యూ క్వార్టర్లు,   రేసపువానిపాలెం-  3.00 ఎకరాలు

11) డెయిరీ ఫారం, చినగదిలి- 30.00 ఎకరాలు

12) సీతమ్మధార తహసీల్దార్‌ ఆఫీసు- 1.00 ఎకరా

13) ఎకార్డ్‌ యూనివర్సిటీ, ఎండాడ  - 101.43 ఎకరాలు

14) సెరీకల్చర్‌, బక్కన్నపాలెం- 4.00 ఎకరాలు

15) వికలాంగుల శిక్షణ కేంద్రం, బక్కన్నపాలెం- 10.00 ఎకరాలు

Advertisement
Advertisement
Advertisement