Abn logo
Sep 24 2021 @ 00:18AM

వేగవంతంగా వ్యాక్సినేషన్‌

జిల్లాలోని 13 గ్రామాల్లో వందశాతం పూర్తి

నిరంతరంగా ప్రత్యేకాధికారుల పర్యవేక్షణ

వ్యాక్సినేషన్‌కు ముందుకొస్తున్న ఆదివాసీ గ్రామాలు

వేగవంతమైన కరోనా కట్టడి చర్యలు

ఆదిలాబాద్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): జిల్లా లో వైద్య ఆరోగ్య శాఖ వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతంగా చేపడుతోంది. వారం రోజులుగా స్పె షల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తూ ముమ్మరం చేస్తోంది. రోజుకు 20వేలకు పైగా టీకాలు వేస్తూ టార్గెట్‌ను పూర్తి చేసే దిశగా అధికార యంత్రాంగం అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోనే జిల్లాను ముందువరుసలో నిలిపేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 7లక్షల 8వేల 952 మంది జనాభా ఉండగా ఇందులో 18ఏళ్ల పైబడిన వారు 3లక్షల 73వేల 725 మంది ఉన్నారు. ఇప్పటి వరకు 2లక్షల 98వేల 361 మందికి వ్యాక్సినేషన్‌ వేయగా ఫస్ట్‌డోసు 2లక్షల 47వేలు, సెకం డ్‌డోసు 51వేల 361 మందికి వ్యాక్సిన్‌ వేశారు. మొద ట్లో వ్యాక్సిన్‌ తీసుకునేందుకు వెనకడుగు వేసిన వారంతా ప్రస్తుతం కేంద్రాల ముందు బారులు తీరు తున్నారు. జిల్లా వ్యాప్తంగా 375 కేంద్రాలను ఏర్పాటు చేసి రోజుకు 20వేలకు పైగా టార్గెట్‌ను పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారులు నిత్యం టెలికాన్ఫరెన్స్‌, వీడియో కాన్ఫరెన్స్‌ల ద్వారా వ్యాక్సినేషన్‌ కొనసాగుతున్న ప్రక్రియను పరిశీలిస్తున్నారు.  మొన్నటి వరకు వినాయక నిమజ్జనంతో కొంత నెమ్మదిగానే సాగిన వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ప్రస్తుతం ఊపందుకుంటుంది. మరో వారం రోజుల్లో జిల్లా వ్యాప్తంగా ఫస్ట్‌ డోసును పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 

ఆదర్శంగా నిలుస్తున్న గ్రామాలు..

జిల్లాలో 13 గ్రామాలు వందశాతం వ్యాక్సినేషన్‌ పూర్తి చేసుకుని ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఇందులో తాంసి మండలంలో అంబుగావ్‌, జామిడి, పొన్నారి, బండల్‌నాగాపూర్‌, ఈదుల్లసావర్గామ్‌, భీంపూర్‌ మండలంలో గుబిడి, గోమూత్రి, బేలలో గూడ, కొగ్దూరు, ఇచ్చో డలో ముఖ్ర(కె), ఇంద్రవెల్లిలో హే మాయికుంట, జైనథ్‌ మండలంలో కరంజి(టి), ఉట్నూ ర్‌ మండలంలో లింగోజితండా గ్రా మాలు ఉన్నాయి. ప్రజలు చైతన్యవంతులై వ్యాక్సినేషన్‌కు ముందుకు రావడంతోనే టార్గెట్‌ పూర్తయినట్లు అధికారులు పేర్కొంటున్నారు. కరోనా వైరస్‌ కొంత తగ్గుముఖం పట్టినూ ముందు చూపుతో వ్యాక్సిన్‌ తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. పలు గ్రామాల్లో వ్యాక్సిన్‌ తీసుకోని వారికి రేషన్‌, ఆసరా పింఛన్లు నిలిపి వేస్తామని దండోరా వేయిస్తున్నారు. దీంతో అర్బన్‌ ప్రాంతంలో కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే వ్యాక్సినేషన్‌ వేసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.

అధికారుల ఉరుకులు పరుగులు..

ఈ నెల 16 నుంచి జిల్లాలో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తూ మండలం, వార్డులకు ప్రత్యేకాధికారులను నియమించారు. దీంతో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. నిత్యం పూర్తి చేసిన టార్గెట్‌ను నివేదిక ఇవ్వాలనే నిబంధన విధించారు. ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్న ఫొటోలను వాట్సాప్‌లో ఆప్‌లోడ్‌ చేస్తున్నారు. ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తూ వ్యాక్సినేషన్‌ వేసుకోవాలని సూచిస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి ఈవోపీఆర్డీ, ఎంపీడీవోలు, పలు శాఖల జిల్లా అధికారులు వ్యాక్సినేషన్‌ పంపిణీ కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వ్యాక్సినేషన్‌ను పరిశీలిస్తూ సాయంత్రం వేళల్లో అదనపు కలెక్టర్‌తో టెలికాన్ఫరెన్స్‌లో పాల్గొంటున్నారు.  

ఆదివాసీల్లో పెరిగిన అవగాహన..

గతంలో వ్యాక్సినేషన్‌కు ముందుకు రాని ఆదివాసీలు ప్రస్తుతం అవగాహన పెరగడంతో ఆసక్తి చూపుతున్నారు. ఏజెన్సీ మారుమూల గ్రామాల్లోను వ్యాక్సినేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయడంతో ఆదివాసీలు స్థానికంగానే టీకా తీసుకుంటున్నారు. అతి తక్కు వగా గాదిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 1275 మంది ఫస్ట్‌, సెకండ్‌ డోసులను తీసుకున్నారు. అలాగే తలమడుగు మండలం ఝరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 3391 మంది, సైద్‌పూర్‌ పీహెచ్‌సీలో 4036 మంది, పిట్టబొంగారం పరిధిలో 4162 మంది, దంతన్‌పల్లి 2972 మంది ఫస్ట్‌, సెకండ్‌ డోసులను తీసుకున్నారు. ఏజెన్సీ మండలాలైన గాదిగూడ, నార్నూర్‌, ఉట్నూర్‌, ఇంద్రవెల్లి, సిరికొండ, ఇచ్చోడ, బజార్‌హత్నూర్‌, తలమడుగు, గుడిహత్నూర్‌, బేల మండలా ల్లో వ్యాక్సినేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌కు మంచి ఆదరణ వస్తోంది. స్థానికంగానే కేంద్రాలను ఏర్పాటు చేయడంతో ఇబ్బందులు దూరమవుతున్నాయి. పలు గ్రామాలకు ఇప్పటికి కనీస రోడ్డు మార్గం లేక పోవడంతో వైద్య సిబ్బంది, వాగులు, ఒర్రెలు దాటుతూ ఆదివాసీ గ్రామాల్లో వ్యాక్సినేషన్‌ పంపిణీ చేస్తున్నారు.