వేగంగా వ్యాపిస్తున్న బర్డ్‌ఫ్లూ

ABN , First Publish Date - 2021-01-10T08:07:34+05:30 IST

బర్డ్‌ఫ్లూ బారిన మరో రాష్ట్రం పడింది. ఇప్పటికే కేరళ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, హరియాణా, గుజరాత్‌ రాష్ట్రా లు బర్డ్‌ఫ్లూతో విలవిల్లాడుతున్నాయి. ఈ

వేగంగా వ్యాపిస్తున్న బర్డ్‌ఫ్లూ

  •  జాబితాలో మరో రాష్ట్రం
  •  ఢిల్లీలో ఘజీపూర్‌ మార్కెట్‌ బంద్‌
  •  రాష్ట్ర విపత్తుగా ప్రకటించిన కేరళ
  •  మహారాష్ట్రలో 900 కోళ్ల మృతి
  •  తెలంగాణలో 300పైగా మృత్యువాత 


ఔరంగాబాద్‌/కొత్తకోట/వర్ని/హాజీపూర్‌, జనవరి 9: బర్డ్‌ఫ్లూ బారిన మరో రాష్ట్రం పడింది. ఇప్పటికే కేరళ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, హరియాణా, గుజరాత్‌ రాష్ట్రా లు బర్డ్‌ఫ్లూతో విలవిల్లాడుతున్నాయి. ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్‌ కూడా చేరిందని కేంద్ర పశుసంవర్థక మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. ఢిల్లీ, ఛత్తీ్‌సగఢ్‌, మహారాష్ట్రకు సంబంధించి వైద్య పరీక్షల ఫలితాల కోసం వేచి చూస్తున్నామని పేర్కొంది. ఉత్తరప్రదేశ్‌ కాన్పూర్‌లో జంతుప్రదర్శన శాలలోని పక్షులకు వైరస్‌ సోకింది.


దక్షిణ ఢిల్లీలోని జసోలా ప్రాంతంలో శనివారంనాడు 24కాకులు.. సంజయ్‌ సరస్సు వద్ద మూడు రోజుల్లో 10 బాతులు మరణించాయి. వాటి నమూనాలను ల్యాబ్‌కు పంపించారు. ఇప్పటి వరకూ మరణించిన పక్షుల సంఖ్య 50కిపైగా ఉంది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఢిల్లీ మార్కెట్లలోకి బయటనుంచి లైవ్‌స్టాక్‌ సరఫరాను తక్షణమే నిషేధిస్తూ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదేశాలు జారీ చేశారు. ఘజిపూర్‌ మాంసాహార మార్కెట్‌ను 10రోజులపాటు మూసివేశారు.


బర్డ్‌ఫ్లూను రాష్ట్ర విపత్తుగా కేరళ ప్రభుత్వం ప్రకటించింది. మహారాష్ట్రలోని పర్భని జిల్లా మురుంబా గ్రామంలో 8వేల కోళ్లున్న ఒక పౌలీ్ట్రఫాంలో రెండు రోజుల్లో 900 కోళ్లు మృత్యువాత పడ్డాయి. జనవరి 15 వరకూ లైవ్‌స్టాక్‌తోసహా అన్ని పౌలీ్ట్ర ఉత్పత్తులను పంజాబ్‌లోకి నిషేధించారు. కేరళలోని రెండు ప్రభావిత ప్రాంతాల్లో వేల సంఖ్యలో కోళ్లు, బాతుల వధ పూర్తైంది. మిగతాచోట్ల కొనసాగుతోంది.


తెలంగాణలోని పలుచోట్ల కోళ్లు మృత్యువాత పడుతూనే ఉన్నా యి. వనపర్తి జిల్లా కొత్తకోటలో నాటుకోళ్లు చనిపోతున్నాయి. పశుసంవర్థక శాఖ అధికారులు మాత్రం ‘కొక్కెర వ్యాధి’ అని.. భయపడాల్సిన పనిలేదని చెబుతున్నారు. నిజామాబాద్‌ జిల్లా వర్ని మండలం జలాల్‌పూర్‌ గ్రామంలో కొద్ది రోజులుగా కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. 

అలాగే ఆదిలాబాద్‌ జిల్లా తాంసితోపాటు పొన్నారి, హస్నాపూర్‌, బండల్‌నాగపూర్‌, అంబు గావ్‌, జామిడి తదితర గ్రామాల్లో కోళ్లు చనిపోతున్నాయి. తాంసిలో ఏ చెత్త కుప్పలో చూసినా కోళ్ల మృతకళేబరాలే కనిపిస్తున్నాయి. మంచిర్యాల జిల్లా నర్సింగాపూర్‌లో శుక్రవారం రాత్రి  250 వరకు నాటుకోళ్ళు మృతి చెందాయి.  


Updated Date - 2021-01-10T08:07:34+05:30 IST