ప్రత్యామ్నాయాలేవి..?

ABN , First Publish Date - 2020-06-27T06:12:00+05:30 IST

సరైన ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి వచ్చే వరకు చైనా దిగుమతులే కొనసాగవచ్చని దేశీయ వాహన, ఔషధ కంపెనీల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. లద్దాఖ్‌లోని గల్వాన్‌ సరిహద్దుపై భారత్‌- చైనా మధ్య ఉద్రిక్తత పరిస్థితులు...

ప్రత్యామ్నాయాలేవి..?

  • ప్రస్తుతానికి చైనా నుంచే దిగుమతులు 
  • వెల్లడించిన ఆటో, ఫార్మా  ప్రతినిధులు  


న్యూఢిల్లీ: సరైన ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి వచ్చే వరకు చైనా దిగుమతులే కొనసాగవచ్చని దేశీయ వాహన, ఔషధ కంపెనీల ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. లద్దాఖ్‌లోని గల్వాన్‌ సరిహద్దుపై భారత్‌- చైనా మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కొద్ది రోజుల క్రితం ఈ ప్రాంతంలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 20 మంది భారత జవాన్లు మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనా నుంచి దిగుమతులను నిషేధించాలన్న నినాదం ఊపందుకుంది. అయితే, దేశీయ వాహన తయారీ సంస్థలు, ఫార్మా కంపెనీలు మాత్రం కీలక విడిభాగాలను, ముడిసరుకులను ప్రస్తుతం చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. ఈ రెండు పరిశ్రమలకు చైనా కంపెనీలే ప్రధాన సరఫరాదారులు. 

2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత వాహన తయారీ పరిశ్రమ 1,760 కోట్ల డాలర్ల విలువైన విడిభాగాలను దిగుమతి చేసుకుంది. అందులో 475 కోట్ల డాలర్ల విడిభాగాలు చైనా నుంచే దిగుమతి అయ్యాయి. డ్రైవ్‌ ట్రాన్స్‌మిషన్‌, స్టీరింగ్‌ పార్ట్స్‌, ఎలకా్ట్రనిక్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌ ఐటెమ్స్‌, కూలింగ్‌ సిస్టమ్స్‌, సస్పెన్షన్‌, బ్రేక్‌ పార్ట్స్‌ తదితర విడిభాగాలు ఎక్కువగా చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. దేశీయ సంస్థల వద్ద ఎలకా్ట్రనిక్స్‌, బీఎస్‌-6 ప్రమాణాలతో కూడిన విడిభాగాల  తయారీకి అవసరమైన సాంకేతికత లేకపోవడం, అధిక ధరల కారణంగానే చైనా దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోందని పరిశ్రమ ప్రతినిధి ఒకరు తెలిపారు. 

ఔషధ రంగం విషయానికొస్తే, 53కు పైగా కీలక యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రిడియెంట్స్‌ (ఏపీఐ) ను చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. వైద్య యంత్రాలు, పరికరాలతోపాటు ఔషధాల ప్యాకేజింగ్‌కు అవసరమైన ముడి సరుకుల్లో చాలావరకు చైనా నుంచే దిగుమతి అవుతున్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరంలో దేశీయ ఔషధ కంపెనీలు 3,56 కోట్ల డాలర్ల విలువైన ముడి సరుకులు, విడిభాగాలను దిగుమతి చేసుకున్నాయి. అందులో 67 శాతానికి పైగా (240 కోట్ల డాలర్లు) చైనా నుంచే తెచ్చుకున్నవే. ప్రస్తుతం దేశీయ ఫార్మా మార్కెట్‌ పరిమాణం రూ.1.35 లక్షల కోట్ల స్థాయిలో ఉంది. అందులో దేశీయ బల్క్‌డ్రగ్స్‌ తయారీ సంస్థల వాటా కేవలం 8-10 శాతంగానే ఉంది. 




చైనా దిగుమతులను తగ్గించుకునేందుకు స్థానికంగానే విడిభాగాల తయారీని పెంచేందుకు పరిశ్రమ చర్యలను ఇప్పటికే ప్రారంభించింది. అన్ని రంగాల్లో స్వావలంబన అవసరమే. అయితే, ఇందుకు చేపట్టాల్సిన చర్యలపై పరిశ్రమ, ప్రభు త్వం కలిసి రోడ్‌మ్యాప్‌ ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దేశీయంగా ఆటో విడిభాగాల తయారీని పెంచేందుకు వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేయడం, చౌకగా మూలధన పెట్టుబడుల సేకరణ, ప్రపంచ స్థాయి లాజిస్టిక్స్‌, ఇంధన ఖర్చుల విషయాలపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. 

- విన్నీ మెహతా, డీజీ, ఏసీఎంఏ



ఔషధ దిగుమతుల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఇప్పటికే బల్క్‌డ్రగ్‌, మెడికల్‌ డివైజ్‌ పాలసీని తీసుకొచ్చింది. దిగుమతుల భారాన్ని తగ్గించడంతో పా టు ప్రజల ఆరోగ్య భద్రతలో ఈ పాలసీ అమలు కీలకంగా మారనుంది. 

- సుదర్శన్‌ జైన్‌, జనరల్‌ సెక్రటరీ,ఐపీఎ




మాకు కావాల్సిన విడిభాగాలు చాలావరకు  మన దేశం లో తయారు కావడం లేదు. లేదా అందుబాటులో లేవు. ఒకవేళ దేశీయంగానే తయారవుతు న్నా వాటి నాణ్యత అంత బాగుండటం లేదు. లేదంటే, ధర ఎక్కువ. వాహ న కొనుగోలుదారులపై భారం పెరగకుండా ఉండే ప్రత్యామ్నాయాలు లభించేవరకు చైనా నుంచే దిగుమతి చేసుకోక తప్పదు. 

- ఆర్‌సీ భార్గవ, చైర్మన్‌, ఎంఎస్‌ఐ

Updated Date - 2020-06-27T06:12:00+05:30 IST