‘మోదీ సర్కార్ నిర్ణయంతో జగన్‌కు కొత్త చిక్కులు’

ABN , First Publish Date - 2020-02-22T22:41:46+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది.

‘మోదీ సర్కార్ నిర్ణయంతో జగన్‌కు కొత్త చిక్కులు’

అమరావతి/న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. యూఏఈ కోర్టుల తీర్పులను భారత్‌లో అమలు చేసేందుకు అనుమతి ఇస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. గత నెల 17న వెలువడిన నోటీస్ ప్రకారం.. డిఫాల్టర్ల విషయంలో యూఏఈ కోర్టుల తీర్పులను భారత్‌లోనూ అమలు చేయాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. భారీ మొత్తంలో రుణాలు పొంది.. ఎగ్గొట్టిన డిఫాల్టర్ల విషయంలో చర్యలు తీసుకునేందుకు యూఏఈ బ్యాంకులకు అధికారం ఉంటుంది. మోదీ సర్కార్ నిర్ణయంతో గల్ఫ్ దేశాల నుంచి రుణాలు పొందిన వారికి శిక్ష పడటం గ్యారంటీ అన్న చర్చ జరుగుతోంది.  


కేంద్ర నిర్ణయంపై ఏపీలో రాజకీయ దుమారం చెలరేగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరుగుతున్నాయి. సెర్బియాలో నిమ్మగడ్డ ప్రసాద్‌ను అక్కడి అధికారులు అదుపులోకి తీసుకోవడంతో టీడీపీ తన ఆరోపణలకు మరింత పదును పెట్టింది. తమ వ్యాపారాలకు గానూ.. గల్ఫ్ బ్యాంకుల నుంచి భారీగా రుణాలు పొందారనీ.. వాటి విషయంలోనే ఇప్పుడు నిమ్మగడ్డ ప్రసాద్‌ను సెర్బియాలో విచారిస్తున్నారని టీడీపీ చెబుతోంది. నిమ్మగడ్డ ప్రసాద్ నుంచి కీలక ఆధారాలను రాబడుతున్నారనీ.. దీంతో ఆయనతో వ్యాపార సంబంధాలు ఉన్న జగన్‌లో కూడా వణుకు మొదలైందని టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘పక్క రాష్ట్రం నుంచి కేటీఆర్ దావోస్ వెళ్లి.. తమ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు. జగన్ మాత్రం వెళ్లలేదు.. ఆయన దేశం దాటితే అరెస్ట్ చేస్తారు కాబట్టే.. వెళ్లడం లేదు..’ అంటూ టీడీపీ నేతలు బోండా ఉమా మహేశ్వరావు ఎద్దేవా చేశారు. 


ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు నిధుల కోసం మోదీని కలిశామని జగన్ చెబుతున్నా.. లోలోపల మాత్రం.. అసలు విషయం వేరే ఉందని టీడీపీ ఆరోపిస్తోంది. నిమ్మగడ్డను సురక్షితంగా భారత్‌కు రప్పిచండం.. ఇందులో ప్రధాన అంశమని ప్రతిపక్షం చెబుతోంది. నిమ్మగడ్డ నుంచి కీలక రహస్యాలు బయటకు వస్తే.. జగన్‌‌కు చిక్కులు రావడం ఖాయమని తేల్చిచెబుతోంది.  కేవలం కేసుల నుంచి రక్షణ పొందేందుకే  ఢిల్లీ చుట్టూ సీఎం జగన్ చక్కర్లు కొడుతున్నారని.. నిమ్మగడ్డను బయటకు తీసుకొచ్చేందుకు నానా రకాలుగా ప్రయత్నిస్తున్నారని విమర్శిస్తున్నారు. ‘నిమ్మగడ్డను సెర్బియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలియగానే వైసీపీ ఉలిక్కి పడింది. వెంటనే కేంద్ర మంత్రి వద్దకు వెళ్లి నిమ్మగడ్డను భారత్‌కు తీసుకురావాలంటూ ఎంపీలు రాయబారాలు చేశారు. కానీ అవేం ఫలించలేదు..’ అని ఓ టీడీపీ నేత చెప్పుకొచ్చారు. మరి.. కేంద్ర సర్కారు తీసుకున్న కీలక నిర్ణయం.. ఎవరికి లాభమో.. ఎవరికి నష్టమో.. తేలాలంటే.. కొన్నాళ్లు వేచిచూడాల్సిందే.



Updated Date - 2020-02-22T22:41:46+05:30 IST