Abn logo
Oct 26 2021 @ 02:37AM

అఫ్ఘనంగా..

స్కాట్లాండ్‌పై 130 రన్స్‌ తేడాతో అద్భుతవిజయం

ముజీబ్‌కు ఐదు, రషీద్‌కు నాలుగు వికెట్లు


టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో పవర్‌ప్లేలోనే నాలుగు వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా ముజీబుర్‌ రహ్మాన్‌

 అంతర్జాతీయ టీ20ల్లో 3,4,5,6వ స్థానాల్లో బ్యాటర్స్‌ డకౌట్‌ కావడం ఇదే తొలిసారి


షార్జా: చప్పగా సాగుతున్న టీ20 ప్రపంచకప్‌లో అఫ్ఘానిస్థాన్‌ దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకుంది. ముందుగా తమ బ్యాటర్స్‌ ధనాధన్‌ ఆటతీరుతో భారీ స్కోరు సాధించగా.. ఆ తర్వాత స్పిన్నర్లు ముజీబ్‌ (5/20), రషీద్‌ (4/9) సుడులు తిరిగే బంతులతో స్కాట్లాండ్‌ వికెట్లను పంచేసుకున్నారు. దీంతో సోమవారం గ్రూప్‌ 2లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో అఫ్ఘాన్‌ 130 పరుగుల భారీ తేడాతో గెలిచి తమ నెట్‌ రన్‌రేట్‌ను గణనీయంగా పెంచుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘాన్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 190 పరుగులు చేసింది. వీరి ఇన్నింగ్స్‌లో 11 సిక్సర్లుండడం విశేషం. అలాగే టీ20 ప్రపంచకప్‌లో ఈ జట్టుకిదే అత్యధిక స్కోరు. ఓవరాల్‌గా తాజా టోర్నీలోనూ ఏజట్టుకైనా ఇదే టాప్‌. నజీబుల్లా (59), గుర్బాజ్‌ (46), జజాయ్‌ (44) వేగంగా ఆడారు. ఆ తర్వాత ఛేదనలో స్కాట్లాండ్‌ 10.2 ఓవర్లలో 60 పరుగులకే కుప్పకూలింది. మన్సీ (25)దే అత్యధిక స్కోరు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా ముజీబుర్‌ రహ్మాన్‌ నిలిచాడు. 


వికెట్ల జాతర: కష్టసాధ్యమైన ఛేదనలో స్కాట్లాండ్‌ దారుణంగా చిత్తయ్యింది. స్పిన్నర్లు ముజీబ్‌, రషీద్‌ ఓవర్లను ఎలా ఆడాలో కూడా వారికి అర్థం కాలేదు. అయితే తొలి ఓవర్‌లో ఓపెనర్‌ జార్జి మన్సీ (25) 4,6తో 11 పరుగులు రావడంతో మ్యాచ్‌ ఆసక్తికరంగా మారేనా అనిపించింది. దీనికి తగ్గట్టుగానే మూడో ఓవర్‌లో స్కోరు 27కు చేరింది. కానీ ఆ తర్వాత స్పిన్నర్‌ ముజీబ్‌ మాయాజాలం ఆరంభమైంది. ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్‌లో ఒకే పరుగిచ్చి మూడు వికెట్లు తీయగా.. ఆరో ఓవర్‌లో మన్సీని కూడా అవుట్‌ చేయడంతో స్కాట్లాండ్‌ చిగురుటాకులా వణికిపోయింది. 8వ ఓవర్‌లో వాట్‌ (1)ను ముజీబ్‌ ఐదో వికెట్‌గా వెనక్కి పంపాడు. ఇక ఆ తర్వాత స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ మిగతా వారిని ఆడేసుకోవడంతో స్కాట్లాండ్‌కు దారుణ పరాభవం ఎదురైంది.
స్కోరుబోర్డు

అఫ్ఘానిస్థాన్‌: హజ్రతుల్లా జజాయ్‌ (బి) వాట్‌ 44; షెహజాద్‌ (సి) గ్రీవ్స్‌  (బి) షరీఫ్‌ 22; గుర్బాజ్‌ (సి) కొయెట్జర్‌ (బి) డేవీ 46; నజీబుల్లా (సి) వీల్‌ (బి) షరీఫ్‌ 59; నబీ (నాటౌట్‌) 11; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం: 20 ఓవర్లలో 190/4. వికెట్ల పతనం: 1-54, 2-82, 3-169, 4-190. బౌలింగ్‌: బ్రాడ్‌ వీల్‌ 4-0-42-0; లీస్క్‌ 1-0-18-0; షరీఫ్‌ 4-0-33-2; జోష్‌ డేవీ 4-0-41-1; మార్క్‌ వాట్‌ 4-0-23-1; క్రిస్‌ గ్రీవ్స్‌ 3-0-30-0.


స్కాట్లాండ్‌: జార్జి మన్సీ (బి) ముజీబ్‌ 25; కైల్‌ కొయెట్జర్‌ (బి) ముజీబ్‌ 10; మెక్‌లాడ్‌ (ఎల్బీ) (బి) ముజీబ్‌ 0; రిచీ (ఎల్బీ) (బి) ముజీబ్‌ 0; క్రాస్‌ (సి) షెహజాద్‌ (బి) నవీన్‌ ఉల్‌ హక్‌ 0; లీస్క్‌ (ఎల్బీ) (బి) రషీద్‌; క్రిస్‌ గ్రీవ్స్‌ (ఎల్బీ) (బి) రషీద్‌ 0; మార్క్‌ వాట్‌ (బి) ముజీబ్‌ (1); జోష్‌ డేవీ (ఎల్బీ) (బి) రషీద్‌ 4; షరీఫ్‌ (నాటౌట్‌) 3; బ్రాడ్‌ వీల్‌ (బి) రషీద్‌ 0; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం 10.2 ఓవర్లలో 60 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-28, 2-28, 3-28, 4-30, 5-36, 6-38, 7-45, 8-53, 9-60, 10-60. బౌలింగ్‌: నబీ 1-0-11-0; ముజీబ్‌ 4-0-20-5, నవీన్‌ 2-0-12-1; రషీద్‌ 2.2-0-9-4; కరీమ్‌ 1-0-6-0.

బాదుడే బాదుడు: ఇటీవలి కాలంలో స్లో పిచ్‌గా మారిన షార్జా మైదానంలో అఫ్ఘాన్‌ బ్యాటర్స్‌  మాత్రం పరుగుల పండగ చేసుకున్నారు. ఓపెనర్లు జజాయ్‌, షెహజాద్‌ (22) తొలి వికెట్‌కు 54 పరుగులతో శుభారంభం అందించారు. రెండో ఓవర్‌లోనే జజాయ్‌ 4,6.. షెహజాద్‌ సిక్సర్‌తో 18 పరుగులు వచ్చాయి. ఇక ఐదో ఓవర్‌లో భారీకాయుడు జజాయ్‌ బాదిన ఓ సిక్సర్‌ స్టేడియం ఆవల పడింది. మరో రెండు ఫోర్లతో ఈ ఓవర్‌లో 16 పరుగులు సాధించారు. ఈ జోరుతో పవర్‌ప్లేలో 55 రన్స్‌ సమకూరినా షెహజాద్‌ వికెట్‌ పడింది. ఇక అర్ధసెంచరీకి చేరువలో జజాయ్‌ కూడా వెనుదిరిగాడు. కానీ అఫ్ఘాన్‌ పరుగుల వేగం మాత్రం ఆగలేదు. నజీబుల్లా, గుర్బాజ్‌ భారీ షాట్లతో ఎదురుదాడికి దిగడంతో జట్టు స్కోరు 13వ ఓవర్‌లోనే వంద పరుగులు దాటింది. 17వ ఓవర్‌లో గుర్బాజ్‌ రెండు సిక్సర్లు.. 18వ ఓవర్‌లో నజీబుల్లా 4,6తో జట్టు స్కోరు దూసుకెళ్లింది. చివరకు 19వ ఓవర్‌లో గుర్బాజ్‌ను డేవీ అవుట్‌ చేయడంతో మూడో వికెట్‌కు 87 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అటు 30 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసిన నజీబుల్లా ఆఖరి ఓవర్‌లో మరో సిక్సర్‌ బాది చివరి బంతికి అవుటయ్యాడు. ఆఖరి 30 బంతుల్లో అఫ్ఘాన్‌ 63 పరుగులు రాబట్టడంతో భారీ స్కోరు ఖాయమైంది.

క్రైమ్ మరిన్ని...