Abn logo
Mar 4 2020 @ 00:16AM

వారి వెనుక మహా శక్తి!

‘ఆదిత్య రశ్మీ ఉద్ధవ్‌ ఠాక్రే’ అనే నేను... ఇది ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన యువకుడు తల్లికి ఇచ్చిన గౌరవం మాత్రమే కాదు.. ఆ తల్లి అతడిపై చూపిన ప్రభావానికి నిదర్శనం కూడా. మహారాష్ట్రను కనుసన్నలతో శాసించే కుటుంబాన్ని ప్రత్యక్ష ఎన్నికల్లోకి దింపి... భర్తను, కుమారుడిని అధికార సోపానాలు ఎక్కించడం వెనుక ఉన్న ఆమె... రశ్మీ ఠాక్రే. ఇప్పుడు  శివసేన అధికార పత్రిక ‘సామ్నా’ సంపాదకురాలుగా రాష్ట్ర రాజకీయాల మీద తనదైన ముద్ర వేయడానికి ఆమె సిద్ధమయ్యారు.


మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం కింగ్‌మేకర్‌ ఎవరంటే ఠక్కున వినిపించే పేరు రశ్మీ ఠాక్రే. పార్టీ శ్రేణులు ఆమెను ‘వాహినీ సాహెబ్‌’గా పిలుచుకుంటాయి. 1966లో బాల్‌ ఠాక్రే శివసేన పార్టీని స్థాపించిన నాటి నుంచీ ఆ పార్టీ తరఫున మహారాష్ట్ర ముఖ్యమంత్రులుగా ఇద్దరు నేతలు - మనోహర్‌ జోషీ, నారాయణ్‌ రాణే పనిచేశారు. కానీ ఠాక్రే కుటుంబం ఎన్నడూ ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయలేదు. బాల్‌ ఠాక్రే చిన్న కుమారుడు ఉద్ధవ్‌కు ఆ ఆలోచన కూడా లేదు. పార్టీ వ్యవహారాలలో రశ్మి కల్పించుకోవడం మొదలుపెట్టిన తరువాత పరిస్థితులు క్రమంగా మారడం మొదలయింది. ఉద్ధవ్‌-రశ్మిల పెద్ద కుమారుడు ఆదిత్య గత ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లో వర్లీ స్థానం నుంచి పోటీ చేయడం చర్చనీయాంశమయింది. అతణ్ణి ముఖ్యమంత్రిగా చూడడమే ధ్యేయంగా రష్మి పావులు కదిపారన్న కథనాలు కూడా వినవచ్చాయి. అయితే ఎన్నికల తరువాత ఉత్కంఠ కలిగించే ‘నాయకీయత’ మధ్య ఉద్ధవ్‌ ముఖ్యమంత్రి అయ్యారు. ఆదిత్య మంత్రిగా ప్రమాణం చేశారు. ‘ఈ పరిణామాలు అన్నిటి వెనుకా ఉన్న శక్తి ‘రశ్మి’ అంటారు రాజకీయ పరిశీలకులు.


కాంట్రాక్ట్‌ ఉద్యోగినిగా మొదలై...

ముంబయిలోని దంబ్విల్‌ ప్రాంతంలో, ఒక మధ్యతరగతి కుటుంబంలో రశ్మి జన్మించారు. ఆమె తండ్రి మాధప్‌ పటాంకర్‌ వ్యాపారి. తల్లి మీనాతాయ్‌ గృహిణి. రశ్మి ముంబయి జెజె స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌లో పట్టభద్రురాలు. 1987లో ఎల్‌ఐసి ‘180 రోజుల పథకం’ పేరిట కాంట్రాక్ట్‌ ఉద్యోగుల కోసం ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. రశ్మి అందులో చేరారు. అక్కడే బాల్‌ థాకరే తమ్ముడి కొడుకు, ప్రస్తుత మహారాష్ట్ర నిర్మాణ సేన అధినేత రాజ్‌ ఠాక్రే సోదరి జయవంతితో ఆమెకు స్నేహం ఏర్పడింది. రశ్మికి ఉద్ధవ్‌ను జయవంతి పరిచయం చేశారు. ఆయనకూ, రశ్మికీ మధ్య ప్రేమ చిగురించింది. 1989లో వారు వివాహం చేసుకున్నారు. 


రాజకీయ ఆకాంక్షలు ఎక్కువే!

మొదట్లో ఉద్ధవ్‌ వైల్డ్‌ ఫోటోగ్రఫీని వృత్తిగా ఎంచుకున్నారు. ఒక యాడ్‌ ఏజెన్సీ కూడా నడిపారు. అది సక్సెస్‌ కాలేదు. రాజకీయాలంటే ఉద్ధవ్‌కు మొదటి నుంచీ పెద్దగా ఆసక్తి లేదు. కానీ అధికారానికి ఉన్న శక్తి రశ్మికి బాగా తెలుసు. ‘‘రశ్మి పెద్దగా మాట్లాడదు.  కానీ ఆమె పట్టుదల ఉన్న మనిషి.  ఎప్పుడూ తనను తాను బిజీగా ఉంచుకుంటుంది. తల్లితండ్రులతో, అత్తమామలతో ఆమెకు మంచి అనుబంధం ఉంది. బలమైన కుటుంబ బంధాలే పిల్లల్లో మంచి విలువలు పెంచుతాయని ఆమె గట్టిగా నమ్ముతుంది. అధికారం, పేరుప్రతిష్టలు ఆమె తలకు ఎక్కకపోవడానికి కారణం’’ అదే అని ఆమె మేనమామ దిలీప్‌ చెబుతారు. బాల్‌ ఠాక్రే అస్వస్థతకు గురైనప్పుడు- ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేయడానికి ‘మాతోశ్రీ’కి వచ్చే శివసైనికులకు ఆతిథ్యం ఇచ్చే బాధ్యతలను రశ్మి స్వీకరించారు. ఉద్ధవ్‌, రాజ్‌లలో బాల్‌ ఠాక్రే తరువాత శివసేన అధినేత ఎవరనే ప్రశ్న వచ్చినప్పుడు... ఉద్ధవ్‌ వైపు బాల్‌ ఠాక్రే మొగ్గుచూపేలా చేసింది ఆమేనని ఆ కుటుంబ ఆంతరంగిక వర్గాల కథనం. ఈ పరిణామంతో 2006లో శివసేన నుంచి రాజ్‌ ఠాక్రే బైటికి వెళ్ళి సొంత పార్టీ పెట్టుకున్నారు. అదే సంవత్సరం పార్టీ పత్రిక ‘సామ్నా’ సంపాదకుడిగా ఉద్ధవ్‌ బాధ్యతలు తీసుకున్నారు. రాజకీయాలంటే విముఖంగా ఉంటూ, తండ్రి కోరిక మేరకు ప్రచార కార్యక్రమాలకు మొక్కుబడిగా వెళ్ళి వచ్చే ఉద్ధవ్‌లో రాజకీయమైన ఆకాంక్షలు పెరగడానికి ‘సామ్నా’ దోహదం చేసింది. బాల్‌ ఠాక్రే మరణం తరువాత పార్టీని నడిపించడంలో ఉద్ధవ్‌కు రశ్మి అందించిన అండదండలు కలిసి వచ్చాయి. శివసేన మహిళా విభాగం నాయకత్వాన్ని రశ్మి తన చేతుల్లోకి తీసుకున్నారు. భర్త మాదిరిగా కాకుండా కుమారుడు ఆదిత్యను పంతొమ్మిదేళ్ళకే రాజకీయాల్లోకి వచ్చేలా ప్రోత్సహించారు. పార్టీ యువజన విభాగం అధ్యక్షుడయ్యేలా చూశారు.


అధికార కేంద్రంగా...

బాల్‌ ఠాక్రే జీవించి ఉన్నంత వరకూ మహారాష్ట్ర రాజకీయాలను శాసించారు. అయితే ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన ఎవరూ చేయలేదు. అలాంటిది ఆ కుటుంబం ఎన్నికల రాజకీయాల్లోకి రావడానికీ, ముఖ్యంగా ఉద్ధవ్‌ను ఒప్పించడానికీ, ఆదిత్య ఠాక్రే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడడానికీ రశ్మి ప్రోత్సాహమే కారణం. మొత్తానికి ఉద్ధవ్‌ ఠాక్రే సీఎం అయ్యారు. ఆదిత్య ఠాక్రే మంత్రి పదవి అలంకరించారు. దీంతో ఇప్పుడు శివసేనలో రశ్మి కీలక అధికార కేంద్రంగా మారారు. బాల్‌ ఠాక్రే, తరువాత ఉద్ధవ్‌ ఠాక్రే నిర్వహించిన ‘సామ్నా’ సంపాదక బాధ్యతలను రశ్మి అందుకోవడం దేనికి సంకేతమనేది కాలమే చెబుతుంది!


మూగ బొమ్మ కాదు!

రశ్మికి సంగీతం అంటే ఇష్టం. ఉస్తాద్‌ గులాం అలీ గజల్స్‌కు ఆమె వీరాభిమాని. ఆమె గొంతు చాలా శ్రావ్యంగా ఉంటుంది. శాస్త్రీయ సంగీతంలో శిక్షణ తీసుకోకపోయినా పాటలు బాగా పాడతారు. ఉద్ధవ్‌-రశ్మిల చిన్న కుమారుడు తేజస్‌ విదేశాల్లో చదువుతున్నారు. కుటుంబ నిర్వహణ, పార్టీ వ్యవహారాలు, ఎన్నికల వ్యూహాల్లో రశ్మి మాటే చెల్లుబాటు అవుతుంది. ఆమె క్రియాశీలక రాజకీయాల్లోకి రావడానికి ‘సామ్నా’ బాధ్యతలు మొదటి అడుగు కావచ్చన్నది రాజకీయ విశ్లేషకుడు ప్రతాప్‌ అస్బే అభిప్రాయం. ‘‘సామ్నా బాధ్యతలను కేవలం అలంకారప్రాయంగా పరిగణించకూడదు. రశ్మి పోషించబోయే పాత్ర చాలా శక్తిమంతంగా ఉంటుంది. ఆమెది దేన్నయినా పేరుకు మాత్రమే స్వీకరించే స్వభావం కాదు. కేవలం మూగ బొమ్మగా ఉండపోవడానికి ఆమె ఇష్టపడరు’’ అని శివసేన రాజ్యసభ మాజీ సభ్యుడు భరత్‌ కుమార్‌ స్పష్టం చేస్తున్నారు. అయితే జర్నలిజంలో కనీస అనుభవం లేని రశ్మికి ‘సామ్నా’ సంపాదక బాధ్యతలు అప్పగించడం ... పార్టీ పత్రిక కుటుంబ పత్రికగా మారిపోయిందనడానికి నిదర్శనం అనీ, అది తప్పుడు నిర్ణయమనీ ప్రకాశ్‌ అకోల్కర్‌ లాంటి రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.


Advertisement
Advertisement
Advertisement