తెలుగులో అగ్ర కథానాయికగా కొనసాగుతున్న కన్నడ భామ రష్మికా మందన్న ఇతర భాషల సినిమాల్లో కూడా నటిస్తోంది. కార్తి సరసన నటించిన `సుల్తాన్`తో ఈ ఏడాది తమిళ తెరంగేట్రం చేయబోతోంది. ఇక, సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న `మిషన్ మజ్ను`తో బాలీవుడ్ అరంగేట్రం చేయబోతోంది. ఈ సినిమా కోసం రష్మిక ప్రత్యేకంగా యాక్టింగ్ క్లాసులకు కూడా వెళ్లిందట. ఒక ట్యూటర్‌ను పెట్టుకుని ప్రత్యేకంగా హిందీ కూడా నేర్చుకుంటోందట. అలాగే ముంబైలో ఓ ఫ్లాట్‌ను రష్మిక కొనుగోలు చేసినట్టు తాజా సమాచారం.
`మిషన్ మజ్ను` తర్వాత బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్‌తో కలిసి `డెడ్లీ` సినిమాలో రష్మిక నటించబోతోంది. బాలీవుడ్ నుంచి రష్మికకు మరిన్ని అవకాశాలు వస్తున్నాయట. ఈ నేపథ్యంలో ముంబై వెళ్లినప్పుడల్లా ఉండడానికి రష్మిక అక్కడ ఓ విలాసవంతమైన ఫ్లాట్ కొనుగోలు చేసిందట. దీంతో రష్మిక ముంబైలోనే సెటిల్ అవ్వాలనుకుంటోందని గుసగుసలు మొదలయ్యాయి.