ధృవ సర్జా, రష్మిక హీరోహీరోయిన్లుగా సాయిసూర్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో తెరకెక్కిన 'పొగరు' చిత్రానికి రిలీజ్ డేట్ ఫిక్సయింది. ఫిబ్రవరి 19న తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతోన్నట్లుగా చిత్ర నిర్మాత డి. ప్రతాప్ రాజు తెలిపారు. 'కరాబు మైండు కరాబు మెరిసే కరాబు నిలబడి చూస్తావా రుబాబు..' అంటూ ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్ యూట్యూబ్‌లో టాప్‌లో ట్రెండింగ్ అవుతూ.. మిలియన్ల వ్యూస్ సాధిస్తున్న విషయం తెలిసిందే. ఈ సాంగ్ పెద్ద హిట్ అవడంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాపై మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ క్రేజీ చిత్రాన్ని వైజాగ్ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్సియర్, ప్రొడ్యూసర్ డి. ప్రతాప్ రాజు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.
ఈ సందర్బంగా నిర్మాత డి.ప్రతాప్ రాజు మాట్లాడుతూ.. ''నా కెరీర్లో ఇలా ఒక్క సాంగ్ తో యూట్యూబ్ లో టివి ఛానల్స్ లో రికార్డ్ వ్యూస్ ని సొంతం చేసుకుని ట్రెండింగ్ అయ్యి ఇంత క్రేజ్ తెచ్చుకున్న చిత్రాన్ని చూడలేదు. తెలుగులో ఈ పొగరు చిత్ర తెలుగు హక్కులను మా సాయిసూర్య ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకోవడం చాలా ఆనందంగా వుంది. ఈ సినిమా తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదలకి సన్నాహాలు చేస్తున్నామని కన్నడ నిర్మాతలు తెలిపారు. ఫిబ్రవరి 19న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాము. కన్నడ టైటిల్ పొగరు కాగా తెలుగు కూడా అదే టైటిల్‌తో వస్తున్నాం. త్వరలోనే ట్రైలర్ విడుదల చేయబోతున్నాం. ట్రైలర్ మాములుగా ఉండదు. ఈ సినిమాని దర్శకుడు నందన్ కిషోర్ అన్ని వర్గాల ప్రేక్షకులకి నచ్చేలా తెరకెక్కించారు. మ్యూజిక్ దర్శకులు చందన్ శెట్టి, అర్జున్ జన్యలు ఇచ్చిన ప్రతి సాంగ్ సంచలనం కాబోతుంది. ఈ చిత్రంలో మరో విశేషం ఏమిటంటే డబ్ల్యూ డబ్ల్యూ లో ఫేమస్ ఫైటర్స్ కాయ్ గ్రీనే, మోర్గన్ అస్తే, జో లిండర్, జాన్ లోకస్లు విలన్లుగా నటించడం. యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా ఉంటాయి. ఇలాంటి చాలా సర్ప్రైజ్ లు ఈ చిత్రంలో డైరక్టర్ క్రియేట్ చేశాడు. జనవరి నెలాఖరు నుంచి ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని సర్ప్రైజ్లు ప్రేక్షకులకి అందిస్తాం.." అని అన్నారు.