ముంబైలో కష్టమేనా..!

ABN , First Publish Date - 2021-04-04T09:35:16+05:30 IST

దేశంలో కరోనా మహమ్మారి ధాటికి సామాన్య జనంతో పాటు సచిన్‌ సహా ప్రముఖ క్రీడాకారులు కూడా బాధితులుగా మారారు. ఇక ఐపీఎల్‌ సమీపిస్తున్న కొద్దీ కరోనా భయం క్రికెటర్లను కూడా వెంటాడుతోంది...

ముంబైలో కష్టమేనా..!

  • ఐపీఎల్‌ మ్యాచ్‌లపై నీలి నీడలు
  • వేలల్లో కరోనా కేసులు
  • అక్షర్‌ పటేల్‌కు పాజిటివ్‌
  • బాధితుల్లో 10 మంది వాంఖడే సిబ్బంది 
  • స్టాండ్‌బైగా హైదరాబాద్‌, ఇండోర్‌ స్టేడియాలు


ఐపీఎల్‌ తాజా సీజన్‌ ప్రారంభానికి కేవలం ఐదు రోజులే సమయం ఉంది.. కానీ మహారాష్ట్రలో ఉధృతంగా ఉన్న కరోనా ప్రభావం నెమ్మదిగా ఈ లీగ్‌పైనా పడుతోంది. ఇప్పటికే నితీష్‌ రాణా పాజిటివ్‌గా తేలి కోలుకోగా.. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌తో పాటు వాంఖడే సిబ్బందిలో పది మంది కరోనా బారిన పడడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో అటు ముంబైలో ఐపీఎల్‌ నిర్వహణపై సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 


ముంబై: దేశంలో కరోనా మహమ్మారి ధాటికి సామాన్య జనంతో పాటు సచిన్‌ సహా ప్రముఖ క్రీడాకారులు కూడా బాధితులుగా మారారు. ఇక ఐపీఎల్‌ సమీపిస్తున్న కొద్దీ కరోనా భయం క్రికెటర్లను కూడా వెంటాడుతోంది. తాజాగా వాంఖడే మైదానంలోని పది మంది సిబ్బందితో పాటు ఐపీఎల్‌ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ టీమ్‌లోని ఆరుగురు సభ్యులు కరోనా పాజిటివ్‌గా తేలడంతో బీసీసీఐ ఉలిక్కిపడింది. శుక్రవారం వరకు 8 మంది వాంఖడే సిబ్బందికి వైరస్‌ సోకగా మర్నాటికి మరో ఇద్దరు చేరారు. ఈనెల 10 నుంచి 25వ తేదీ మధ్యలో మొత్తం 10 లీగ్‌ మ్యాచ్‌లు వాంఖడేలోనే జరగాలి. ప్రస్తుతం ముంబైలో పరిస్థితి భయానకంగా మారింది. ఈనేపథ్యంలో ఇక్కడ ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణపై అనిశ్చితి నెలకొంది. ఒకవేళ మ్యాచ్‌లను తరలించాల్సి వస్తే అందుకు తగిన ప్రత్యామ్నాయాలను కూడా బీసీసీఐ సిద్ధం చేసుకుంది.  ‘లీగ్‌ ఆరంభానికి ఇంకా వారం రోజుల సమయం కూడా లేదు. ఈస్థితిలో ముంబై నుంచి మ్యాచ్‌లను తరలించడం సాధ్యం కాదు. అలాగే స్వల్ప వ్యవధిలో బయో బబుల్‌ను ఏర్పాటు చేయడం కూడా అసాధ్యం. ఇప్పటికైతే వాంఖడే నుంచి మ్యాచ్‌లను తరలించే ఆలోచనైతే లేదు. 10 మంది మైదాన సిబ్బందిని వారి ఇళ్లకు పంపించి.. సన్నాహకాల కోసం ఎంసీఏ నుంచి ఇతర సిబ్బందిని రప్పించాం’ అని బోర్డు ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ప్రస్తుతం ముంబైలో బస చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ ఆటగాళ్లు వాంఖడేలో కాకుండా స్థానికంగా ఉన్న ఇతర మైదానాల్లోనే ప్రాక్టీస్‌ చేస్తున్నారు.


ఆతిథ్య ‘భాగ్యం’ దక్కేనా?

శుక్రవారం ఒక్కరోజే ముంబైలో రికార్డు స్థాయిలో 8800 కేసులు బయటపడ్డాయి. అయినా బీసీసీఐ మాత్రం ముంబైలో మ్యాచ్‌ల నిర్వహణపై పట్టుదలగానే ఉంది. ఫ్రాంఛైజీలు మాత్రం కాస్త ఆందోళనగానే కనిపిస్తున్నాయి. ముందు జాగ్రత్తగా హైదరాబాద్‌, ఇండోర్‌లను స్టాండ్‌బై వేదికలుగా బీసీసీఐ ప్రకటించింది. ‘ఒకవేళ మహారాష్ట్రలో లాక్‌డౌన్‌ విధించినా ఆటగాళ్లంతా బయో బబుల్‌లోనే ఉంటున్నారు కాబట్టి సమస్య ఉండదు. అలాగే స్టేడియంలోకి ప్రేక్షకులకు కూడా అనుమతి లేదు. అందుకే ఈనెల 10న చెన్నై-ఢిల్లీ మ్యాచ్‌ వాంఖడేలో జరుగుతుందనే విశ్వాసంతో ఉన్నాం. అసలు లాక్‌డౌన్‌ విధిస్తే స్టేడియం చుట్టుపక్కల జనం ఉండరు కాబట్టి మ్యాచ్‌ నిర్వహణ మరింత సురక్షితంగా ఉంటుంది. అలాగే హైదరాబాద్‌, ఇండోర్‌లను స్టాండ్‌బైగా ఉంచాం’ అని బీసీసీఐ అధికారి తెలిపారు.


ఢిల్లీకి మరో దెబ్బ

ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌కు కరోనా వైరస్‌ సోకింది. ఇప్పటికే రెగ్యులర్‌ కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ గాయంతో లీగ్‌కు దూరం కాగా తాజాగా అక్షర్‌ ఐసోలేషన్‌కు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ‘ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ కరోనా పాజిటివ్‌గా తేలాడు. గత నెల 28న అతడు నెగెటివ్‌ రిపోర్ట్‌తో ముంబైలోని తన టీమ్‌ హోటల్‌లో చేరాడు. అయితే రెండో రిపోర్ట్‌  మాత్రం పాజిటివ్‌గా వచ్చింది. ప్రస్తుతం అక్షర్‌ మెడికల్‌ సిబ్బంది పర్యవేక్షణలో ఐసోలేషన్‌లో ఉన్నాడు. ఢిల్లీ జట్టు మెడికల్‌ సిబ్బంది కూడా తనతో టచ్‌లో ఉంటున్నారు’ అని డీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. మరోవైపు చెన్నై సూపర్‌ కింగ్స్‌ మీడియా కంటెంట్‌ టీమ్‌లో ఒకరు పాజిటివ్‌గా తేలాడు. అయితే అతడు బయో బబుల్‌లో లేకపోవడంతో జట్టు ప్రాక్టీ్‌సకు ఎలాంటి ఇబ్బందిలేకపోయింది.


Updated Date - 2021-04-04T09:35:16+05:30 IST