కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే అదొక్కటే మార్గం: రతన్ టాటా

ABN , First Publish Date - 2020-05-11T20:25:08+05:30 IST

ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్న కోవిడ్-19 సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు పారిశ్రామిక వేత్తలు..

కరోనా సంక్షోభం నుంచి గట్టెక్కాలంటే అదొక్కటే మార్గం: రతన్ టాటా

ముంబై: ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్న కోవిడ్-19 సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు పారిశ్రామిక వేత్తలు కొత్తగా ఆలోచించాలని పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులను స్వీకరించి, నూతన ఆవిష్కరణల దిశగా అడుగులు వేయాలని (అడాప్ట్ అండ్ క్రియేట్) పిలుపునిచ్చారు. పారిశ్రామిక వేత్తలను ఉద్దేశించి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఆయన ఇవాళ ఈ మేరకు ఓ సందేశం రాశారు. ‘‘అందరూ ఓ తెల్ల కాగితం తీసుకుని ఇంతకు ముందెన్నడూ ఊహించని కొత్త ఆవిష్కరణల కోసం మార్గాలను అన్వేషించడం మొదలు పెట్టాలి. మున్ముందు ఈ సంక్షోభం నుంచి బయట పడాలంటే.. పారిశ్రామిక వేత్తలు ప్రస్తుత పరిస్థితులను స్వీకరించి సరికొత్త ఉత్పత్తులను సృష్టించక తప్పదు..’’ అని టాటా పేర్కొన్నారు.


కరోనా కల్లోలం నేపథ్యంలో తమ వ్యాపారాలను మరింత సమర్థంగా నిర్వహించేందుకు తగిన మార్గాలను పారిశ్రమిక వేత్తలు కనుగొనగలరని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘గతంలో విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు పారిశ్రామిక వేత్తలు ఇంతకు ముందెన్నడూ ఉనికిలో కూడా లేని వాటి గురించి ముందుచూపుతో, సృజనాత్మకంగా ఆలోచించే వారు. అవే ఇవాళ ఈ నూతన ఆవిష్కరణలు, టెక్నాలజీ అందుబాటులోకి రావడానికి బాటలు వేశాయి. ఇలాంటి సామర్థ్యమే ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కేలా సరికొత్త ఉత్పత్తిని ఆవిష్కరించేందుకు, కంపెనీని నడిపించేందుకు, మరింత చక్కటి కార్యకలాపాలకు ఓ మార్గాన్ని నిర్మిస్తుందని ఆశిస్తున్నాను..’’ అని టాటా పేర్కొన్నారు. ప్రస్తుతం సవాళ్లు, ఇబ్బందులు ఎదురైనా.. పారిశ్రామికవేత్తల కల్పనాశక్తి, సృజనాత్మకత భవిష్యత్ ప్రమాణాలకు తగినట్టుగా వ్యాపారాలను మలుచుకునేలా చేయగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-05-11T20:25:08+05:30 IST