అద్దంకిలో పలుషాపుల్లో నిండుకున్న రేషన్‌ సరుకులు

ABN , First Publish Date - 2020-05-21T10:57:31+05:30 IST

ప్రభుత్వం లాక్‌డౌన్‌ కాలంలో అందించే ఉచిత రేషన్‌ సరుకుల కోసం కార్డుదారులు పలు రేషన్‌ షాపుల వద్ద కాళ్లకు

అద్దంకిలో పలుషాపుల్లో నిండుకున్న రేషన్‌ సరుకులు

పోర్టబులిటి దెబ్బకు కొన్ని షాపులు ఖాళీ

వాటి పరిధిలోని అసలు కార్డుదారులకు అందని బియ్యం

ఒక్కో షాపునకు దాదాపు వెయ్యి,

కొన్నిట్లో 400 స్లిప్పులు మాత్రమే పంపిణీ

సరుకులున్న షాపు కోసం వెదుకులాట

అవస్థలుపడుతున్న కార్డుదారులు


అద్దంకి, మే 20 : ప్రభుత్వం లాక్‌డౌన్‌ కాలంలో అందించే ఉచిత రేషన్‌ సరుకుల కోసం కార్డుదారులు పలు రేషన్‌ షాపుల వద్ద కాళ్లకు బలపాలు కట్టుకొని తిరగాల్సిన దుస్థితి నెలకొంది. పోర్టబులిటి వల్ల కార్డుదారులు తమకు అందుబాటులో ఉన్న ఏ రేషన్‌ షాపు నుంచైనా సరుకులు తీసుకునే వెసులుబాటును కొందరు బాగా వాడుకున్నారు. షాపులు అన్ని ప్రాంతాలలో సమంగా లేకుండా కొన్ని ప్రాంతాలలో మాత్రమే అందుబాటులో ఉండడంతో ఈ సమస్య ఏర్పడింది. సమీపంలో ఉన్న షాపునకు ఎవరు ముందు వెళ్తే వాళ్లకు సరుకులు అందే పరిస్థితి నెలకొంది.  కరోనా నేపథ్యంలో చివరలో వెళితే సులువుగా రేషన్‌ సరుకులు తీసుకోవచ్చునుకున్న వారు వాటి కోసం అన్ని షాపుల చుట్టూ తిరగాల్సి వస్తోంది.


అద్దంకి నగర పంచాయతీలో 18 రేషన్‌ షాపులుండగా సుమారు 10 వేల మంది కార్డుదారులు ఉన్నారు. ఒక్కో షాపులో నెలనెలా సరాసరిన 400 నుంచి 600 మంది కార్డుదారులకు సరుకుల పంపిణీ చేస్తారు. బియ్యం ఒక్కో వ్యక్తికి 5 కిలోల చొప్పున, కందిపప్పు, శనగలు ఒక్కో కార్డు యూనిట్‌గా తీసుకుంటారు. పోర్టబులిటి ఉండటం, వలంటీర్లు ఇంటింటికీ తిరిగి సరుకులు తీసుకోవాల్సిన రేషన్‌ షాపు, తేదీ, సమయం వివరాలతో స్లిప్పులు పంపిణీ చేశారు. దీనివల్ల కొన్ని షాపు ల పరిధిలో వెయ్యికి పైగా కార్డుదారులకు స్లిప్పులు పంచారు. ఒకే ప్రాంతంలో ఎక్కువ షాపులున్న చోట ఒక్కో షాపునకు 400 నుంచి 500 కార్డులు మాత్రమే కేటాయించారు. గోడౌన్‌ నుంచి ఆయా రేషన్‌ షాపులకు సరుకులు మాత్రం పాత పద్ధతిలోనే సరఫరా అయ్యాయి.


పట్టణంలోని  4, 5, 6, 9, 46, 50, 51 రేషన్‌ షాపులలో ఇప్పటికే బియ్యం నిల్వలు లేవు. 1, 14, 15 నెంబర్ల షాపులలో కొద్దిమేర మాత్రమే నిల్వలు ఉన్నాయి. ఆయా రేషన్‌ షాపులకు కేటాయించిన కార్డుదారులు షాపుల వద్దకు వచ్చి బియ్యం లేవని చెప్పటంతో మరో షాపు వద్దకు వెళ్తున్నారు. ఇలా రెండు, మూడు షాపుల వద్దకు తిరిగి ఎండదెబ్బకు విసుగు చెంది మిన్నకుంటున్నారు.


దీనికితోడు గ్రామీణ ప్రాంతాలలో కార్డులు ఉండి అద్దంకి పట్టణంలో నివాసం ఉండే కుటుంబాలు సుమారు వెయ్యికి పైగా ఉన్నారు. దీంతో కరోనా కాలంలో ప్రభుత్వం అందించే రేషన్‌ సరుకులు కొంత మందికి అందని దుస్థితి నెలకొందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి స్టాకు లేని షాపులకు సర్దుబాటు చేసి అందరికీ రేషన్‌ సరుకులు అందేలా చర్యలు చేపట్టాలని పలువురు  కోరుతున్నారు. 

Updated Date - 2020-05-21T10:57:31+05:30 IST