కార్డుల్లో కోత

ABN , First Publish Date - 2021-09-29T07:20:53+05:30 IST

సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు చుక్కలు చూపిస్తోంది. ఏదో ఒక వంక చూపించి భారం దించుకునే దిశగా అడుగులు వేస్తోంది.

కార్డుల్లో కోత

జిల్లాలో 28,500కు పైగా రేషన్‌ కార్డులకు ఎసరు

అనర్హుల  పేరుతో ఏరివేత మొదలుపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం

కార్డుదారుల గగ్గోలు

పొట్టకూటి కోసం జిల్లాలు దాటినవారివీ రద్దే

11వేల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులకు కార్డులు ఉన్నట్టు గుర్తించిన తహశీల్దార్లు

వీరంతా గ్రామ/వార్డు  వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, ఆశా వర్కర్లే

పింఛన్లు, అమ్మఒడి కోతల తర్వాత ఇప్పుడు కార్డుల వంతుతో లబ్ధిదారుల గగ్గోలు

వీటి నిలిపివేత పూర్తయ్యాక వేల అనర్హుల జాబితాతో మరో విజిలెన్స్‌ నివేదిక

మొన్న పింఛన్ల రద్దు... నిన్న అమ్మఒడి లబ్ధిదారుల ఏరివేత... ఇప్పుడు రేషన్‌కార్డుల వంతు... ఇలా అనేక రకాల సంక్షేమ పథకాలకు సంబంధించి ఆర్థిక భారం సాకుతో రాష్ట్ర ప్రభుత్వం కోతలు షురూ చేసింది. ఎక్కడికక్కడ అనర్హత సాకుతో వేలాది మంది లబ్ధిదారులను          ఏరిపారేస్తోంది. చిన్నచిన్న   కారణాలు చూపించి వాతలు పెడుతోంది. తాజాగా రేషన్‌కార్డుల రద్దు ప్రక్రియను ప్రారంభించింది. జిల్లావ్యాప్తంగా 28,500 మంది కార్డులను రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు జాబితాను ఆన్‌లైన్‌లో మండలాల వారీగా తహశీల్దార్లకు పంపించింది. వీరంతా ఆయా కార్డుదారుల జాబితా ఆధారంగా ఇంటింటికీ వెళ్లి వివరాలు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియ చివరి దశకు చేరుకోగా 11వేల మంది వరకు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్టు తనిఖీల్లో గుర్తించారు. మిగిలిన కార్డుదారులు అసలు ఇళ్ల వద్ద ఉండట్లేదని నిర్ధారించి కార్డులు రద్దు చేయాలని సిఫార్సు చేశారు. 

 (కాకినాడ, ఆంధ్రజ్యోతి)

సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు చుక్కలు చూపిస్తోంది. ఏదో ఒక వంక చూపించి భారం దించుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే జిల్లాలో దాదాపు 21వేల మందికి పెన్షన్లు నిలిపివేసి పండుటాకుల ఊసురు పోసుకుంది. ఆధార్‌లో వయసు తక్కువగా ఉందని, భర్త మరణ ధ్రువీకరణ తేవాలని.. ఒంటరిగా ఉండట్లేదని... ఇలా రకరకాల సాకులతో పెన్షన్‌ డబ్బులు    నిలిపివేసింది. ఆ తర్వాత గత వారంలో అమ్మఒడి లబ్ధిదారులపై పడింది. కుటుంబంలో ఇద్దరు పిల్లలకు డబ్బులు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటికే మాట తప్పింది. చివరకు జిల్లావ్యాప్తంగా 2.24 లక్షల మంది తల్లులకు మాత్రమే పథకాన్ని వర్తింపజేసింది. త్వరలో డబ్బులు ఖాతాలో వేసే సమయం దగ్గరపడడంతో ఇప్పుడు ఏరివేత మొదలుపెట్టింది. ప్రస్తుతం జిల్లా విద్యా శాఖ మండలాల వారీగా నిబంధనల పేరుతో లబ్దిదారుల్లో కోత కోయడానికి భారీ కసరత్తు చేస్తున్నారు. ఒకపక్క ఇది కొనసాగుతుండగా ఇప్పుడు మళ్లీ అత్యంత గుట్టుగా రేషన్‌కార్డుల ఏరివేత మొదలుపెట్టారు. జిల్లాలో మొత్తం 16.50 లక్షల రేషన్‌కార్డులుండగా, అందులో తెల్లకార్డులు 15.69 లక్షలున్నాయి. వీటిలో అనర్హులు అధికంగా ఉన్నారని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో అమరావతి నుంచి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ 28,500 మంది కార్డుదారుల పేరుతో జాబితాను ఇటీవల జిల్లా పౌరసరఫరాల శాఖకు పంపింది. వీరంతా అనర్హులని... గుట్టుగా క్షేత్రస్థాయి    తనిఖీలు చేసి అందరి కార్డులు రద్దు చేయాలని ఆదేశించింది. దీంతో ఇప్పుడు ఆ జాబితాలను పౌరసరఫరాల శాఖ జిల్లావ్యాప్తంగా తహశీల్దార్లకు పంపింది. ఒక్కో మండలానికి 1,200 నుంచి 900 వరకు పేర్లతో వివరాలు అందించింది. తమకు అందిన జాబితాను ప్రస్తుతం తహశీల్దార్లు తనిఖీ చేస్తూ కొన్నింటిని ఇప్పటికే రద్దు చేశారు. శంఖవరం మండలంలో తాజాగా 525, రావులపాలెం 718, యు.కొత్తపల్లి 155, కరప 600... ఇలా అనర్హుల పేర్లతో కార్డులు రద్దు చేశారు. మొత్తం 28,500 కార్డుల్లో 11వేల మంది వరకు ప్రభుత్వ ఉద్యోగులున్నట్టు తేల్చారు. వీరంతా గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగులు కాగా మరికొందరు వలంటీర్లు, ఆశా వర్కర్లుగా నిర్ధారించారు. అయితే వీరందరికీ ఉద్యోగాలు రాకముందు కార్డులున్నప్పటికీ ఇంకా రేషన్‌ తీసుకుంటున్నారు. దీంతో వీరి కార్డులు రద్దు చేశారు. మిగిలిన 17,500 మందిలో 80 శాతం కార్డుదారులు తమ సొంత గ్రామాల్లో ఉండడం లేదని తేల్చి కార్డులు రద్దు చేశారు. వాస్తవానికి వీరంతా పొట్టకూటి కోసం హైదరాబాద్‌, విజయవాడ, చెన్నై, ఢిల్లీ తదితర ప్రాంతాలకు తాత్కాలికంగా వలస వెళ్లారు. కానీ స్థానికంగా ఉండడం లేదనే కారణంతో ఈ కార్డులకు ఎసరుపెట్టారు. వీటన్నింటికీ అక్టోబరు నుంచి రేషన్‌ నిలిపివేయనున్నారు. ప్రస్తుతం  ఈప్రక్రియను పౌరసరఫరాల శాఖ అత్యంత గుట్టుగా నిర్వహిస్తోంది. వివరాలు బయటకు పొక్కకుండా గోప్యత పాటిస్తోంది. ఇదంతా ఒకెత్తయితే అక్టోబరులో మళ్లీ విజిలెన్స్‌ ద్వారా మరో నివేదిక రానున్నట్టు సమాచారం. మరికొన్ని వేల కార్డుదారుల జాబితాతో రానున్న ఈ జాబితా ద్వారా ఎందరు కార్డులకు ఎసరు పెడతారో చూడాలి.



Updated Date - 2021-09-29T07:20:53+05:30 IST