జిల్లాలో రేషన్‌ కార్డులు 15.12 లక్షలు

ABN , First Publish Date - 2020-07-06T09:50:59+05:30 IST

జిల్లాలో రేషన్‌కార్డుల సంఖ్య పెరిగింది. గత నెలలో 14.89 లక్షల ఉన్న కార్డులు నేడు 15,12,353కు చేరుకున్నాయి.

జిల్లాలో రేషన్‌ కార్డులు 15.12 లక్షలు

నూతనంగా 23 వేలకు పైగా కార్డులు 

లబ్ధిదారులకు ఈ నెల నుంచే రేషన్‌


గుంటూరు, జూలై 5 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రేషన్‌కార్డుల సంఖ్య పెరిగింది. గత నెలలో 14.89 లక్షల ఉన్న కార్డులు నేడు 15,12,353కు చేరుకున్నాయి. నెల వ్యవధిలో 23 వేలకు పైగా కార్డులు పెరిగాయి. లాక్‌డౌన్‌ సమయంలో కొత్త రేషన్‌కార్డు కోసం అందిన అర్జీలను సచివాలయాల సిబ్బంది క్షేత్ర పరిశీలన జరిపి అర్హులకు కార్డులు మంజూరు చేయాల్సిందిగా ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ఆ మేరకు ప్రభుత్వం కార్డులు మంజూరు చేసి డైనమిక్‌ కీ రిజిస్టర్‌ని అప్‌డేట్‌ చేసింది. దాంతో కొత్తగా రేషన్‌కార్డులు పొందిన లబ్ధిదారులంతా ఈ నెల నుంచి సరుకులు తీసుకోవచ్చని అధికారవర్గాలు తెలిపాయి. ఈ నెల తొలి విడతగా రేషన్‌కార్డులో ఉన్న ప్రతీ సభ్యుడికి 5 కేజీల బియ్యం, కుటుంబం మొత్తానికి కలిపి కేజీ కందిపప్పు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. చక్కెరకు మాత్రం అరకేజీకి రూ.17 చెల్లిస్తున్నారు. 


ప్రస్తుతం పంపిణీ చేస్తున్న సరుకులు కేంద్ర ప్రభుత్వం కరోనా సాయంగా ఇస్తున్నవి. ఉచితంగా ఇచ్చే బియ్యం, కందిపప్పు కేంద్రం సాయం కాగా చక్కెరకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నగదు చెల్లించుకుంటోంది. ఈ నెలలోనే రెండో విడత రేషన్‌ సరుకుల పంపిణీ కూడా ఉంటుందని అధికారులు సూత్రప్రాయంగా తెలిపారు. అయితే ఏ తేదీ నుంచి సరుకులు ఇచ్చేది త్వరలో తెలియజేస్తామన్నారు. రేషన్‌ సరుకుల పంపిణీ ప్రారంభమై ఆదివారానికి నాలుగు రోజులు పూర్తి కాగా ఇప్పటివరకు 5 లక్షల 82 వేల 407 కుటుంబాలు సరుకులు తీసుకెళ్లాయి. 


ఇదిలావుంటే ప్రభుత్వం రేషన్‌ దుకాణాలకు అవసరమైన శానిటైజర్‌, గ్లవ్స్‌, మాస్కులు పంపిణీ చేయడాన్ని నిలిపేసింది. దాంతో డీలర్లు కూడా షాపుల వద్ద శానిటైజర్‌ అందుబాటులో ఉంచడం లేదు. ఈ పరిస్థితుల్లో కొంతమంది సొంతంగా శానిటైజర్‌ తీసుకొని వెళుతుండగా చాలామంది చేతులు శుభ్రం చేసుకోకుండానే వేలిముద్రలు వేస్తున్నారు. అసలే కరోనా వైరస్‌ జిల్లా మొత్తాన్ని చుట్టేస్తున్న ప్రస్తుత తరుణంలో రేషన్‌ షాపుల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వైరస్‌ మరింతగా వ్యాప్తి చెందే ప్రమాదం పొంచి ఉన్నది. ఇప్పటికే నగరంలో పలు ఏరియాలు కంటైన్‌మెంట్‌ జోన్ల పరిధిలోకి వెళ్లిపోవడంతో ఏప్రిల్‌, మే నెలల్లో అమలు జరిగిన లాక్‌డౌన్‌ పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీని దృష్ట్యా తక్షణమే తమకు శానిటైజర్లు, గ్లవ్స్‌ సరఫరా చేయాలని డీలర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. 

Updated Date - 2020-07-06T09:50:59+05:30 IST