రేషన్‌ పంపిణీ అస్తవ్యస్తం

ABN , First Publish Date - 2021-02-05T06:24:46+05:30 IST

సరైన ట్రయల్‌రన్‌ నిర్వహించకుండానే రేషన్‌ సరుకుల డోర్‌ డెలివరీని అమలులోకి తీసుకురావడంతో పేద ప్రజలు ఈ నెల పస్తులుండాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది.

రేషన్‌ పంపిణీ అస్తవ్యస్తం
రేషన్‌ డోర్‌ డెలివరీ చేసే ఎండీయూ వాహనం

నాలుగు రోజులైనా 18 వేల మందికే అందిన సరుకులు 

ఎండీయూల వద్దకు వెళ్లి పంపిణీ శాతం పెంచాలని డీలర్లకు బెదిరింపులు

సీఎస్‌డీటీల వైఖరిపై మండిపడుతోన్న రేషన్‌ డీలర్లు

మండలాల వారీగా తహసీల్దార్లకు బాధ్యతలు కేటాయించిన జేసీ

గుంటూరు, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): సరైన ట్రయల్‌రన్‌ నిర్వహించకుండానే రేషన్‌ సరుకుల డోర్‌ డెలివరీని అమలులోకి తీసుకురావడంతో పేద ప్రజలు ఈ నెల పస్తులుండాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. రేషన్‌ సరుకుల డోర్‌ డెలివరీ ప్రారంభించి నాలుగు రోజులు ముగిసినా ఇంకా 18 వేల కుటుంబాలకు మాత్రమే జిల్లాలో సరుకులు అందాయి. ఇంకా 14 లక్షల 45 వేల 394 కుటుంబాలకు సరుకులు అందాల్సి ఉండగా, అవి ఎప్పటికి ఇంటి వద్దకు చేరుస్తారో తెలియకుండా ఉన్నది. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ నెలలో చాలా మంది పేదలకు సరుకులు అందక తిండికి దూరం కాక తప్పదు. డోర్‌ డెలివరీ విధానంతో రేషన్‌ సరుకుల పంపిణీ సులభతరం కావాల్సిందిపోయి క్లిష్టం కావడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తోన్నారు. 

గతంలో ప్రతీ నెలా రేషన్‌సరుకుల పంపిణీ ప్రారంభం కాగానే అవసరం ఉన్న వాళ్లు ముందు షాపులకు వెళ్లి సరుకులు తెచ్చుకొనేవారు. దాంతో రోజుకు లక్ష కుటుంబాలు సరుకులు తీసుకెళ్లేవి. దానికి ప్రజలు అలవాటు పడగా తామేదో మేలు చేస్తామని వైసీపీ ప్రభుత్వం డోర్‌ డెలివరీ విధానాన్ని ఈ నెల నుంచి తీసుకొచ్చింది. ఈ విధానంలో మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్‌(ఎండీయూ) వాహనానికి దాని యజమాని, ఒక సహాయకుడు ఉంటారు. వారికి రోజుకు 80 నుంచి 85 ఇళ్లకు వెళ్లి సరుకులు పంపిణీ చేసే బాధ్యత ఇచ్చింది. ఇందుకోసం సబ్సిడీపై వాహనాన్ని ఇవ్వడమే కాకుండా నెలకు రూ. 16 వేలు చెల్లిస్తామని ఒప్పందం చేసుకొన్నది. వీరు రేషన్‌షాపులకు వెళ్లి సరుకులు తీసుకొని పంపిణీ చేయాలి. అయితే షాపులకు వెళ్లి తూకం వేయించి ఆ మూటలను వాహనాల్లోకి లోడింగ్‌ చేయడం తమ వల్ల కాదని చేతులెత్తేస్తోన్నారు. అంతేకాకుండా రైస్‌కార్డు లబ్ధిదారుని ఇంటి వద్దకు వెళ్లకుండా ఎక్కడో వాహనం నిలిపి అక్కడికి రావాల్సిందిగా కోరుతోన్నారు. దీంతో రేషన్‌ సరుకుల పంపిణీ అస్తవ్యస్తంగా మారిపోయింది. 

దీంతో గత రెండు రోజుల నుంచి పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్లు రేషన్‌ డీలర్లకు ఫోన్లు చేసి బెదిరింపులకు దిగుతోన్నారు. మీరు కూడా ఎండీయూ వాహనం వెంట వెళ్లి పంపిణీ శాతం మెరుగుపరచాలని ఆదేశిస్తోన్నారు. లేకపోతే మీపై 6కే కేసులు పెడతామని బెదిరిస్తోన్నారు. దీంతో డీలర్లు తీవ్ర ఆవేదనభరితమౌతోన్నారు. తాము కేవలం ఎండీయూ వాహనాలకు సరుకులు ఇవ్వడం వరకే పరిమితం అవుతాం తప్పా డోర్‌ డెలివరీకి వెళ్లేది లేదని వారు తెగేసి చెబుతోన్నారు. ఈ నేపథ్యంలో విషయం జాయింట్‌ కలెక్టర్‌(రెవెన్యూ) ఏఎస్‌ దినేష్‌కుమార్‌ దృష్టికి వెళ్లడంతో ఆయన మండలాల వారీగా టీంలని నియమించారు. గుంటూరు పశ్చిమ మండలానికి తహసీల్దార్‌ మోహన్‌రావుని ఛైర్మన్‌గా కన్వీనర్‌గా డీటీ ఏ సాంబశివరావుని నియమించారు. అలానే డీలర్ల నుంచి సమద్‌, ఎం ఆంజనేయులు, ఎండీయూ ఆపరేటర్ల నుంచి వై కోటేశ్వరరావు, కే డానియల్‌ని నియమించారు. ఈ కమిటీ శుక్రవారం నుంచి సమస్యలు పరిష్కరించి రేషన్‌ పంపిణీ సజావుగా జరిగేలా చూడాలని జేసీ ఆదేశించారు. 


Updated Date - 2021-02-05T06:24:46+05:30 IST