రద్దీ నడుమ రేషన్‌

ABN , First Publish Date - 2020-03-30T11:04:30+05:30 IST

రేషన్‌ పంపిణీ జిల్లాలో మొదటి రోజు గతి తప్పింది. చాలా చోట్ల ఈ పోస్‌ మిషన్లు పనిచేయలేదు.

రద్దీ నడుమ రేషన్‌

కనిపించని సామాజిక దూరం

జిల్లాకు చేరని కంది పప్పు

తొలి రోజు పంపిణీలో ఇబ్బందులు


కర్నూలు(అర్బన్‌), మార్చి 29: రేషన్‌ పంపిణీ జిల్లాలో మొదటి రోజు గతి తప్పింది. చాలా చోట్ల ఈ పోస్‌ మిషన్లు పనిచేయలేదు. లాక్‌ డౌన్‌ కారణంగా సామాజిక దూరం పాటించేందుకు ఏర్పాట్లు చేసినా, పలుచోట్ల లబ్ధిదారులు త్వరగా వెళ్లాలని ఎగబడ్డారు.  రెవెన్యూ, సచివాలయ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో కొన్నిచోట్ల పంపిణీ ప్రారంభం కాలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్‌ కోటా రేషన్‌ సరుకులను పాత కార్డుదారులందరికీ అందించాలని నిర్ణయించింది. కొత్త బియ్యం కార్డులు పూర్తి స్థాయిలో పంపిణీ జరగక పోవడంతో పాత కార్డుల ప్రకారమే పంపిణీ జరుగుతోంది.


కరోనా లాక్‌ డౌన్‌ నేపథ్యంలో సరుకులను ముందుగానే చౌకడిపోలకు చేర్చారు. బియ్యం, కందిపప్పు ఉచితంగా, పంచదార మాత్రం డబ్బు తీసుకుని ఇస్తున్నారు. ఆదివారం మొదలైన ప్రక్రియ ఏప్రిల్‌ 15 వరకు కొనసాగుతుంది. ఏప్రిల్‌ 15 తరువాత ప్రధాని మోదీ ప్రకటించిన ఉచిత నిత్యావసర సరుకులను అందిస్తారు. సరుకుల పంపిణీకి జిల్లాలోని 2,436 చౌకడిపోల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రద్దీ ఏర్పడకుండా 5 నుంచి 10 మందిని మాత్రమే చౌకడిపోలకు వచ్చేలా వలంటీర్లు అవగాహన కల్పించారు. కానీ కొందరు త్వరగా వెళ్లాలని తోసుకువచ్చారు. దీంతో డీలర్లు ఇబ్బంది పడ్డారు. లబ్ధిదారుల మధ్య కనీసం రెండు మీటర్లు దూరం ఉండేలా చర్యలు తీసుకున్నా చాలాచోట్ల గాడి తప్పింది. వీఆర్‌వో, వీఆర్‌ఏ, గ్రామ సచివాలయ సిబ్బంది పర్యవేక్షణలో బయోమెట్రిక్‌ ద్వారా రెషన్‌ సరుకులు అందిస్తున్నారు. 


కంట్రోల్‌ రూమ్‌:

నిత్యావసర సరుకుల పంపిణీలో సమస్యలు తెలియజేయడానికి కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయిలో డీఎస్‌వో కార్యాలయం, నంద్యాల, ఆదోని పరిధిలో ఆర్డీవో కార్యాలయాల్లో వీటిని ఏర్పాటు చేశారు. మండల స్థాయిలో తహసీల్దారు కార్యాలయాల్లో కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు. వీఆర్వోలు అందుబాటులో లేకకపోవడంతో కొన్ని చోట్ల సరుకుల పంపిణీ మొదలు కాలేదు. మరికొన్ని చోట్ల కంది పప్పు రాకపోవడంతో పంపిణీ ప్రారంభించలేదు. వీఆర్వో తంబ్‌ వేసి  కార్డుడికి సరుకులు ఉచితంగా పంపిణి చేయాల్సి ఉంది.


జిల్లాలో మొదటి రోజు లక్ష  మంది కార్డుదారులకు సరుకులు సరఫరా చేశామని జిల్లా పౌరసరఫరా విభాగం అఽధికారి పద్మశ్రీ తెలిపారు. మారుమూల గ్రామాల్లో సెల్‌ ఫోన్‌ సిగ్నల్స్‌ లేక పొవడంతో మ్యాన్యువల్‌ పద్ధతిలో సరుకులను అందించారు. కర్నూలు నగరంలో 44 దుకాణాలు తెచుకోలేదు. ఆదోని, ఎమ్మిగనూరు, బనగానపల్లె ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల పరిధిలో మరో 64 దుకాణాలు పంపిణీ ప్రారంభించలేదు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సరుకులను అందిస్తుండటంతో చౌకదుకాణాల వద్ద ప్రజలు బారులు తీరారు. 


కందిపప్పు రావల్సి ఉంది.. శ్రీనివాస్‌, ఏఎం, జిల్లా పౌరసరఫరా విభాగం


కర్నూలు, ఎమ్మినూరు, ఆదోని, బనగానపల్లె ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు 150 టన్నుల కందిపప్పు నిల్వలు రావల్సి ఉంది. బనగానపల్లెకు కొంత వచ్చింది. మిగిలిన చోట్ల సరఫరాకు రావాణాలో ఇబ్బందులు ఎదురయ్యా యి. అందుకే సకాలంలో జిల్లాకు చేరలేదు. సోమ వారం సాయంత్రానికి జిల్లాకు నిల్వలు చేరుకుం టాయి. 


ఇబ్బంది లేకుండా చూస్తాం.. పద్మశ్రీ, డీఎస్‌వో

కరోనా వ్యాపించకుండా చౌకడిపోల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుం టున్నాం. బయో మెట్రిక్‌ విధానంలో సరుకులు పంపిణీ చేస్తున్నాం. ప్రతి దుకాణం వద్ద చేతులు శుభ్రం చేసుకునేం దుకు ఏర్పాట్లు చేశాం. వీఆర్వోలు పర్యవేక్షిస్తు న్నారు. కంది పప్పు నిల్వలు జిల్లాకు చేరుకోవాల్సి ఉంది.                                                            

సామాజిక దూరం ఏదీ..?


బనగానపల్లెలో రేషన్‌ దుకాణాల వద్దకు ప్రజలు గుంపులుగా చేరుకున్నారు. మీటరు దూరంలో ఉండాలని వలంటీర్లు చెప్పినా పాటించ లేదు.


జూపాడుబంగ్లా మండలంలో కేవలం 3 గ్రామాల్లో మాత్రమే ఆదివారం సరుకులు పంపిణీ చేశారు. మండలంలో మొత్తం 28 రేషన్‌ దుకాణాలు ఉండగా ఆరింటిని మాత్రమే తెరిచారు. వలంటీర్లు సంతకాలు తీసుకుని సహకరించారు. మిగిలిన గ్రామాల్లో సోమవారం నుంచి  పంపిణీ చేస్తామని తహసీల్దారు నరసింహారావు తెలిపారు.


నందికొట్కూరులో కార్డు దారులు సామాజిక దూరం పాటించారు. సచివాల య ఉద్యోగి రాకపోవడంతో 6వ రేషన్‌ దుకాణంలో పంపిణీ ఆలస్యమైంది. పట్టణంలో 22 రేషన్‌ దుకాణాలు ఉండగా 17 చోట్ల పంపిణీ జరిగింది. 


పగిడ్యాలలో రేషన్‌ దుకాణాల వద్ద చేతులు శుభ్రం చేసుకునే ఏర్పాట్లు చేశారు.  తహసీల్దారు శ్రీనివాసులు, ముచ్చుమర్రి ఎస్‌ఐ శ్రీనివాసులు పర్య వేక్షించారు. సరుకులు అందక కొన్ని గ్రామాల్లో పంపిణీ ప్రారంభం కాలేదు. 


నందికొట్కూరు మండలంలోని పలు గ్రామాల్లో సరుకులు అందక పంపిణీ ప్రారంభం కాలేదు. కొన్నిచోట్ల ఆలస్యంగా ప్రారంభించారు.


నంద్యాల పట్టణంలోని కొన్ని దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించలేదు. కార్డుదారులు ఉదయం ఏడింటికే వచ్చినా.. 11 గంటల వరకు రేషన్‌ పంపిణీకి అనుమతి రాలేదు. దీంతో రద్దీ ఏర్పడింది. రెండు మీటర్ల దూరం ఉండేలా ఏర్పాటు చేసిన బాక్సుల్లో సంచులను ఉంచి వంతు వచ్చేదాకా జనం దూరంగా నిలబడ్డారు.


మద్దికెర, పెరవలి, ఎం.అగ్రహారం తదితర ప్రాంతాల్లో సామాజిక దూరం పాటించలేదు. కొన్ని వస్తువులే ఇచ్చారని అసంతృప్తి వ్యక్తం చేశారు. తుగ్గలి, కోతికొండ, జొన్నగిరి ప్రాంతంలో బియ్యం, కంది పప్పు కొరత ఏర్పడింది. 


పత్తికొండలో రద్దీ నియంత్రణ సాధ్యం కాక రేషన్‌ పంపిణీని కాసేపు నిలిపేశారు. సామాజిక దూరం పాటిస్తేనే సరుకులు ఇస్తామని స్పష్టం చేయడంతో క్యూ పాటించారు. 


ఆలూరు మండలంలో 15 రేషన్‌ షాపుల్లో పంపిణీ ప్రారంభం కాలేదు. తహసీల్దార్‌ హుసేన్‌సాబ్‌ కోయనగర్‌ రేషన్‌ దుకాణాన్ని తనిఖీ చేశారు. 


హొళగుందలో చాలా రేషన్‌ దుకాణాలు తెరుచుకోలేదు. కార్డుదారులు వేచి చూసి వెనుదిరిగారు. బియ్యం మాత్రమే సరఫరా కావడంతో పంపిణీ చేయలేదని తహసీల్దార్‌ అన్వర్‌హుసేన్‌ తెలిపారు. 


డోన్‌లో చౌక దుకాణాల వద్ద తోపులాట జరిగింది. జనం భారీగా రావడంతో సామాజిక దూరంపాటించడం లేదు. 


ప్యాపిలిలో తెల్లవారు జాము నుంచే రేషన్‌ షాపుల దగ్గర బారులు తీరారు. ఎస్‌ఐ మారుతి శంకర్‌ సామాజిక దూరం పాటించాలని వారికి సూచించారు. సర్వర్‌ సమస్యతో రేషన్‌ పంపిణీ జరగ లేదు. 


రుద్రవరంలో చౌక దుకాణాల వద్ద జనం గుమిగూడారు. సామాజిక దూరం పాటించలేదు. 


విదేశాల నుంచి వచ్చిన వారిపై నిఘా

 ఆత్మకూరు డీఎస్పీ వెంకటరావు

ఆత్మకూరు, మార్చి 29: కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు విదేశాల నుంచి వచ్చిన వారిపై ప్రత్యేక యాప్‌ ద్వారా నిఘా ఉంచుతున్నామని ఆత్మకూరు డీఎస్పీ వెంకటరావు తెలిపారు. ఫిబ్రవరి 24 తర్వాత ఆత్మకూరు పోలీసు సబ్‌డివిజన్‌ పరిధిలో 67 మంది విదేశాల నుంచి  వచ్చారని,   వీరిని వైద్యులు పరీక్షించి హోమ్‌ క్వారంటైన్‌కు రెఫర్‌ చేశారని తెలిపారు. అయితే వీరిలో కొందరు హోమ్‌ క్వారంటైన్‌ సక్రమంగా పాటించకపోవడంతో ప్రత్యేక యాప్‌ ద్వారా వీరి కదలికలపై నిఘా ఉంచామన్నారు. నిర్ధేశిత స్థానం నుంచి 50 మీటర్ల పరిధిలో వారి కదలికలు పోలీసులకు తెలుస్తున్నాయన్నారు. నిబంధనలు అతిక్రమించే వారిపై సెక్షన్‌ 181, 269, 270, 271 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి  ఐసోలేషన్‌ వార్డుకు తరలిస్తామని స్పష్టం చేశారు. యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసిన వక్తులు తమ సెల్‌ఫోన్‌ ఇళ్లలోనే ఉంచి బయటకు వస్తే వారిపై ఇరుగు పొరుగు వారి నుంచి సమాచారం సేకరిస్తామని వెల్లడించారు.  


పోలీస్‌ శాఖకు రూ.20 లక్షలు   

- నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి

నంద్యాల, మార్చి 29:  నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి తన ఎంపీ నిధుల నుంచి పోలీసులకు రూ.20 లక్షలను ఇస్తున్నానని, కేటాయింపు పత్రాన్ని నంద్యాల కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ సీఐ ప్రభాకర్‌రెడ్డికి అందజేశారు. మరో రూ.10 లక్షల సొంత నిధులతో పోలీసులకు శానిటైజర్లు అందజేయనున్నట్లు ఎంపీ చెప్పారు. కరోనా వైరస్‌ నియంత్రణలో భాగంగా పోలీసులు నిరంతరం శ్రమిస్తున్నారని ఎంపీ పేర్కొన్నారు.  

Updated Date - 2020-03-30T11:04:30+05:30 IST