రేషన్‌ రివర్స్‌.. మళ్లీ డీలర్లకే పగ్గాలు..!

ABN , First Publish Date - 2021-02-22T07:26:36+05:30 IST

రేషన్‌ డోర్‌ డెలివరీ వాహనాల ఆపరేటర్‌ల మీద..

రేషన్‌ రివర్స్‌.. మళ్లీ డీలర్లకే పగ్గాలు..!

ఎండీయూల మీద అజమాయిషీ లేని అధికార యంత్రాంగం

సీఎం అదేశాలకు భిన్నంగా అధికార పార్టీ నాయకుల ఒత్తిడి

కొన్ని చోట్ల ఎండీయూలు, డీలర్లు మిలాఖత్‌


విజయవాడ(ఆంధ్రజ్యోతి): రేషన్‌ డోర్‌ డెలివరీ వాహనాల ఆపరేటర్‌ల మీద అజమాయిషీ లేని అధికార యంత్రాంగం మళ్లీ రేషన్‌ పంపిణీని డీలర్లకే అప్పగిస్తోంది. ఇందుకు పోర్టబులిటీ అనే అస్త్రాన్ని వాడుకుంటోంది. ఈ వ్యవహారంలో దిగువస్థాయి అధికారుల పరిస్థితి కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపంలా ఉంది. రేషన్‌ బియ్యాన్ని ఇతరులకు అమ్మేసుకోవడాన్ని అరికట్టేందుకు ఎండీయూ వ్యవస్థను తీసుకొచ్చిన ప్రభుత్వానికి ఆ ఎండీయూలే చుక్కలు చూపిస్తున్నారు. రేషన్‌ను ఇంటింటికీ పంపిణీ చేయకుండా ఎక్కడో ఒకచోట పెట్టి, పంపిణీ చేసేస్తుండటం, కొన్ని చోట్ల ఎండీయూలు మానేస్తే వారి స్థానంలో అధికారులు ప్రయివేటు వ్యక్తులను డ్రైవర్‌లుగా పెట్టి, వీఆర్వో లాగిన్‌లో పంపిణీ  చేయించడం, ఒకే ఎండీయూకు రెండు మూడు డిపోలు కేటాయించడం వంటి చర్యలతో బియ్యం అందని ప్రజలు ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నారు. 


ఈ నెలలో 21 రోజులు గడిచిపోయినా, జిల్లాలో ఇంకా 40 శాతం మందికి బియ్యం అందలేదు. తమకు కేటాయించిన షెడ్యూలు ప్రకారం తమ డ్యూటీ అయిపోయిందని కొన్ని చోట్ల ఎండీయూలు రాకపోవడం, పై నుంచి అధికారులు ఎండీయూలు రోజూ ఉదయాన్నే లాగిన్‌ అవ్వాలని ఒత్తిడి చేస్తుండటంతో క్షేత్రస్థాయిలో అధికారులు ఉదయాన్నే ఉరుకులు పరుగులు పెట్టి వారిని బతిమలాడి లాగిన్‌ చేయిస్తున్నారు. కొన్ని చోట్ల ఎంఆర్వోలు డీలర్లను ఎండీయూ వాహనాల వెంట వెళ్లమని ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎండీయూ వాహనాల వెంట వెళ్లే డీలర్లను ఎవరన్నా అపితే, వారి మీద క్రిమినల్‌ కేసులు పెడతామని వాయిస్‌ మెసేజ్‌లు పెడుతున్నారు. కానీ, సగానికిపైగా ఎండీయూలు తమకు కేటాయించిన కార్డుల్లో 50 శాతం కూడా పంపిణీ చేయలేదు. దీంతో అధికారులు మిగిలిన పంపిణీని డీలర్లకు అప్పగించనున్నారు.


వాస్తవానికి మ్యాపింగ్‌ కాని కార్డులకు, ఉపాధి నిమిత్తం వేరే మండలాలకు, జిల్లాలకు వెళ్లిన వారి కార్డులకు పోర్టబులిటీ కింద బియ్యం ఇవ్వాలని రాష్ట్రస్థాయి అధికారులు అదేశాలు ఇచ్చారు. ఎండీయూలు ఇవ్వకుండా వదిలేసిన కార్డులకు ఎక్కడ రేషన్‌ ఇవ్వాలో ఈ ఆదేశాల్లో స్పష్టత ఇవ్వలేదు. దీంతో క్షేత్రస్థాయిలో అధికారులు పంపిణీ శాతం తక్కువగా ఉన్న చోట్ల దుకాణంలో పంపిణీ చేయమని అనధికారికంగా డీలర్లకే మౌఖికంగా చెబుతున్నారు. విజయవాడ నగరంలోని కొండ ప్రాంతంలో అధికార పార్టీ రాజకీయ నాయకులు ఎన్నికల వేళ పర్యటనలకు వెళుతున్నపుడు జనాలు నిలదీస్తున్నారు. దీంతో ప్రభుత్వ  అదేశాలకు భిన్నంగా దుకాణంలోని సరుకు ఇవ్వమని డీలర్ల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు.


ఎండీయూ, వీఆర్వో లాగిన్‌లో దుకాణంలోని  బియ్యం ఇచ్చేయమని  ఆదేశిస్తున్నారు. ఇదిలా ఉంటే ఎండీయూలకు కేటాయించిన కార్డులకు రేషన్‌ పంపిణీ చేయించాల్సిన అధికారులు ఈ వంకతో మళ్లా డీలర్లకు పంపిణీ బాధ్యతలను అప్పగిస్తుండటంపై డీలర్ల సంఘాలు మండిపడుతున్పాయి. జీతాలు తీసుకునే ఎండీయూలను వదిలేసి తమపై ఒత్తిడి తీసుకురావడం భావ్యంగా లేదని డీలర్ల సంఘాల నేతలు అంటున్నారు. ఈ సందర్భంగా కొన్ని చోట్ల కొంతమంది డీలర్లు లోపాయికారీగా కొందరు ఎండీయూలను తమ చెప్పుచేతల్లో పెట్టుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి.

Updated Date - 2021-02-22T07:26:36+05:30 IST