ప‘రేషన్‌’

ABN , First Publish Date - 2021-10-13T05:42:03+05:30 IST

ఇలా జిల్లాలో ఒకటీ రెండూ కాదు. 1.80 లక్షల మందికి ఆక్టోబరులో రేషన్‌ నిలిచిపోయింది. ఆధార్‌ అప్‌డేషన్‌తో పాటు ఐదేళ్లు దాటిన వారందరూ తప్పకుండా ఈకేవైసీ చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సెప్టెంబరు 30లోగా ఈకేవైసీని తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.

ప‘రేషన్‌’
రేషన్‌ కట్‌ చేయటంతో తహసీల్దారు కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న మహిళలు


- జిల్లాలో 1.80 లక్షల మందికి నిలిచిన రేషన్‌

- ఈకేవైసీ చేయకపోవడమే కారణం

- కార్డులో ఎవరికి  రాలేదో స్పష్టత కరువు

- పథకాలు నిలిచిపోతాయని లబ్ధిదారుల ఆందోళన 

(ఇచ్ఛాపురం రూరల్‌) 

- ఒక రేషన్‌కార్డులో నలుగురు లబ్ధిదారులుంటే ఈ నెల ముగ్గురికే రేషన్‌ అందించారు. ఇదేమని అడిగితే ఈకేవైసీ చేయించలేదని బదులిస్తున్నారు. వాస్తవానికి కుటుంబ సభ్యులంతా ఈకేవైసీ  చేయించుకున్నా... వారిలో ఎవరో ఒకరికి సంబంధించి ‘అప్‌డేట్‌’ కావడం లేదని చెబుతున్నారు. అది ఎవరో తెలుసుకుందామంటే... అధికార యంత్రాంగం దగ్గర సమాధానం ఉండడం లేదు.  

 -ఇలా జిల్లాలో ఒకటీ రెండూ కాదు. 1.80 లక్షల మందికి ఆక్టోబరులో రేషన్‌ నిలిచిపోయింది. ఆధార్‌ అప్‌డేషన్‌తో పాటు ఐదేళ్లు దాటిన వారందరూ తప్పకుండా ఈకేవైసీ చేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సెప్టెంబరు 30లోగా ఈకేవైసీని తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. దీంతో ఆధార్‌ అప్‌డేషన్‌తో పాటు ఈకేవైసీ కోసం ప్రజలు క్యూకట్టారు. కానీ జనాభాకు తగ్గట్టు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. సచివాలయాల్లో ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చినా కార్యరూపం దాల్చలేదు. దీంతో చాలామంది లబ్ధిదారులకు అక్టోబరులో రేషన్‌ నిలిచిపోయింది. ఈకేవైసీ చేయించుకోని 1.80 లక్షల మందికి రేషన్‌ నిలిచిపోయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో పేద లబ్ధిదారులు ఉండడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. దసరా పండుగ ముందు ఇదేమిటని నిట్టూరుస్తున్నారు. 

వలంటీర్ల నిర్లక్ష్యమే కారణం

రేషన్‌కార్డుల్లో లబ్ధిదారులు ఈకేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం రెండు నెలలుగా చెబుతోంది. వాటి బాధ్యతను వలంటీర్లకు అప్పగించింది. అయితే తమకు కేటాయించిన 50 కుటుంబాలకు ఈకేవైసీ చేయించడంలో వలంటీర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఉపాధి, ఉద్యోగాల కోసం సుదూర ప్రాంతాలు వెళ్లిన వారికి ఫోన్‌ చేసి మమ అనిపించేశారు. కనీసం దాని కోసం వాకబు చేసిన దాఖలాలు లేవు. దీంతో జిల్లా వ్యాప్తంగా లక్షలాది మంది రేషన్‌ నిలిచిపోయింది. మరోవైపు వృద్ధులు, చిన్నపిల్లల వేలిముద్రలు పడకపోవడం, దానికి ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలు చూపకపోవడంతో చాలామంది రేషన్‌ నిలిచిపోయిందని అధికారవర్గాలు చెబుతున్నాయి. అటువంటి వారు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. పిల్లలకు సంబంధించి ఆధార్‌ అప్‌డేట్‌ పూర్తయినా ఈకేవైసీ కావడం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా వేలిముద్రకు ప్రత్యామ్నాయం చూపించాలని బాధితులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. 

ఇక సంక్షేమ పథకాల బెంగ..

ఈకేవైసీ పూర్తికాక, రేషన్‌నిలిచిపోయిన సభ్యుల్లో ఇప్పుడు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కొనసాగింపుపై బెంగ మొదలైంది. ఆసరా, విద్యాకానుక, రైతు భరోసా, పింఛన్లు ఇలా వివిధ సంక్షేమ పథకాలకు రేషన్‌ కార్డును ప్రాతిపదిక చేస్తున్నారు. గతంలో రేషన్‌ కార్డులు రద్దు కావడం వల్ల పెన్షన్‌ కోల్పోయిన వారు అనేకమంది ఉన్నారు. ఇప్పుడు రేషన్‌ నిలిపివేయడంతో భవిష్యత్‌లో వారికి సంక్షేమ పథకాలు కొనసాగిస్తారో? లేదో? అని ఆందోళన చెందుతున్నారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించి ఈకేవైసీ గడువు పెంచాలని కోరుతున్నారు. 


అన్యాయం

ఈకేవైసీ పేరిట రేషన్‌ నిలిపివేయడం దారుణం. పండుగ పూట పేదలను పస్తులుంచడం తగదు. రేషన్‌ నిలిచిపోయిన వారిలో టీడీపీ సానుభూతిపరులే అధికం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలి. లేకుంటే బాధితుల  తరఫున టీడీపీ ఉద్యమిస్తుంది. 

-అశి లీలారాణి, టీడీపీ కౌన్సిలర్‌, ఇచ్ఛాపురం 


 నిరంతర ప్రక్రియ

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈకేవైసీ తప్పనిసరి. ఇది ఒక నిరంతర ప్రక్రియగా సాగుతుంది. వలంటీర్ల ద్వారా ప్రతిఒక్కరూ ఈకేవైసీ చేయించుకోవాలి. లబ్ధిదారులందరికీ రేషన్‌ అందుతుంది. ఎటువంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు. 

-డి.వెంకటరమణ, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి, శ్రీకాకుళం


Updated Date - 2021-10-13T05:42:03+05:30 IST