బాలారిష్టాలు దాటని ‘ఇంటింటికీ రేషన్‌’

ABN , First Publish Date - 2021-04-14T06:28:34+05:30 IST

ఇంటింటికీ రేషన్‌ పంపిణీ కార్యక్రమం ప్రారంభించి మూడు నెలలవుతున్నా బాలారిష్టాలు దాటడం లేదు.

బాలారిష్టాలు దాటని ‘ఇంటింటికీ రేషన్‌’
చిత్తూరు గాంధీరోడ్డు రేషన్‌ షాపు వద్ద బారులు తీరిన కార్డుదారులు(ఫైల్‌ ఫోటో)

వందమందికిపైగా వాహన డ్రైవర్ల రాజీనామా

రేషన్‌ షాపుల వద్ద లబ్ధిదారుల పడిగాపులు

రెండు వారాలైనా 75 శాతమే పంపిణీ


చిత్తూరు, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): ఇంటింటికీ రేషన్‌ పంపిణీ కార్యక్రమం ప్రారంభించి మూడు నెలలవుతున్నా బాలారిష్టాలు దాటడం లేదు. ఇళ్ల వద్దకు వెళ్లి సరుకులు అందించడానికి వాహనదారులకు ప్రభుత్వం చెల్లిస్తున్న మొత్తం సరిపోవడం లేదనే కారణంగా ప్రారంభంలోనే చాలా మంది డ్రైవర్లు రాజీనామా చేశారు.ఇంకా క్షేత్రస్థాయిలో నెలకొన్న పలు సమస్యల కారణంగా  సరుకులను పొందడానికి కార్డుదారులు నానా తంటాలు పడాల్సి వస్తోంది. జిల్లాకు మొత్తం 724 రేషన్‌ పంపిణీ వాహనాలు మంజూరు కాగా.. ప్రస్తుతం వందమందికిపైగా వాహనదారులు రాజీనామా చేశారు. వీటిలో కొన్ని వాహనాల బాధ్యతను అధికారులు కొత్త వ్యక్తులకు అప్పగించగా.. మరి కొన్నింటికి ఎవరూ ముందుకు రాకపోవడంతో అలాగే వదిలేశారు. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో రేషన్‌ షాపుల వద్దకు లబ్ధిదారులే వెళ్లి సరుకులు తెచ్చుకుంటున్నారు. సర్వర్‌ పనిచేయకుంటే అక్కడే పడిగాపులు కాస్తున్నారు. రెండు వారాలు గడుస్తున్నా.. ఇంకా జిల్లాలో 75శాతం సరుకుల పంపిణీ మాత్రమే జరిగింది.


రాజీనామా చేసినచోట వీఆర్వోలకు బాధ్యతలు


జిల్లాలో ప్రస్తుతం 11.47 లక్షల బియ్యం కార్డులున్నాయి. ఈ నెల 13వ తేదీ నాటికి 8.61 లక్షల మందికే సరుకులు అందించారు. గతంలో పదో తేదీ నాటికే వంద శాతం పంపిణీ చేసేవారు. ప్రస్తుతం రెండు వారాలవుతున్నా.. 75శాతమే పంపిణీ చేయగలిగారు. జిల్లాలో ఎక్కడా వాహనాల ద్వారా ఇంటింటి పంపిణీ జరగడం లేదు. పట్టణాల్లో అయితే ఆయా వీధుల చివరన వాహనం ఆపుకుని, ఆ వీధి ప్రజలకు అక్కడే పంపిణీ చేస్తున్నారు. గ్రామాల్లో అయితే.. గ్రామం మధ్యలో వాహనం ఆపి పంపిణీ చేస్తున్నారు. ఇక్కడా ఇంటింటికి వెళ్లి పంపిణీ చేసే దాఖలాలు కనిపించడం లేదు. వాహనాల వద్ద సరుకులు తీసుకోని లబ్ధిదారులు మళ్లీ 25వ తేదీన రేషన్‌ షాపుల వద్దకు వెళ్లి సరుకులు తీసుకుంటున్నారు. వాహనదారులు రాజీనామా చేస్తే పంపిణీ భారం స్థానిక వీఆర్వోల మీద పడుతోంది. చాలామంది ప్రైవేటు డ్రైవర్ల సాయంతో వాహనాల ద్వారా పంపిణీ చేస్తున్నారు.  


అన్నిచోట్లా వీధి చివర పంపిణీయే


మండలాల్లోనూ రేషన్‌ సరుకులు ఇంటింటికి పంపిణీ కావడం లేదు. ఇంటింటికి పంపిణీ కాస్తా.. వీధి చివర పంపిణీగా మారింది. ఏ మండలంలోనూ వందశాతం సరుకులు పంపిణీ చేయలేదు. కొన్నిచోట్ల 50శాతమే పంపిణీ చేశారు. రామసముద్రం మండలానికి 9 వాహనాలు మంజూరు కాగా.. నలుగురు డ్రైవర్లు రాజీనామా చేశారు. ఉన్న వాహనాలూ ఇంటింటికి వెళ్లడం లేదు. ఇక్కడ 80శాతం పంపిణీ జరిగింది. గుర్రంకొండ మండలంలోనూ తొమ్మిదిమందికి గానూ ఐదు చోట్ల వాహనదారులు రాజీనామా చేశారు.వీఆర్వోలు ప్రైవేటు డ్రైవర్లను ఆశ్రయించి పంపిణీ బాధ్యత చేపట్టారు. తిరుపతి రూరల్‌ మండలంలో 18మందికిగానూ ఐదుగురు డ్రైవర్లు రాజీనామా చేశారు. ఇక్కడ 78 శాతం పంపిణీ జరిగింది. పలమనేరులో 50శాతం మాత్రమే సరుకుల పంపిణీ జరిగింది. చౌడేపల్లె మండలంలో 8మందికిగానూ ముగ్గురు రాజీనామా చేయడంతో ప్రస్తుతం ఐదు వాహనాలు అందుబాటులో ఉన్నాయి. కానీ.. ప్రజలు రేషన్‌ షాపుల్లోనే సరుకులు తెచ్చుకుంటున్నారు. రామకుప్పం మండలంలో 10కిగానూ 8 వాహనాలున్నాయి. ఇక్కడ 59శాతం పంపిణీయే జరిగింది. కలకడలో 7కుగానూ 5 వాహనాలు అందుబాటులో ఉండగా.. లేనిచోట్ల వీఆర్వో ద్వారా పంపిణీ చేస్తున్నారు. తవణంపల్లెలో పదిమందిలో ముగ్గురు రాజీనామా చేశారు. 70శాతం పంపిణీ జరిగింది. శాంతిపురంలో 62శాతం రేషన్‌ సరుకుల పంపిణీ జరిగింది. వి.కోట మండలంలో 16మంది డ్రైవర్లలో ఇద్దరు రాజీనామా చేశారు. ఇక్కడ వీఆర్వోలు పంపిణీ చేస్తున్నారు. 76శాతం పంపిణీ పూర్తయింది.

Updated Date - 2021-04-14T06:28:34+05:30 IST