రెచ్చిపోతున్న రేషన్‌ మాఫియా

ABN , First Publish Date - 2021-08-12T06:45:00+05:30 IST

జిల్లాలో రేషన్‌ మాఫియా రెచ్చిపోతోంది.

రెచ్చిపోతున్న రేషన్‌ మాఫియా
తర్లుపాడులో పట్టుబడిన రేషన్‌ బియ్యం లారీ

అధికారపార్టీ నేతల అండతో యథేచ్ఛగా అక్రమ రవాణా

ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు దిగుమతి

ఇక్కడ ప్యాకింగ్‌ చేసి కృష్ణపట్నం పోర్టుకు తరలింపు

పగలు, రాత్రి తేడా లేకుండా సాగుతున్న వ్యవహారం

నెల వ్యవధిలో 36 కేసులు నమోదు

రూ. కోటి విలువైన రేషన్‌ రైస్‌ స్వాధీనం

పట్టుకున్నవి గోరంతే.. వెళ్లిపోతున్నవి కొండంత

అక్రమ దందాకు సహకరిస్తున్న కొందరు అధికారులు

మార్కాపురం నుంచి 450 బస్తాల రేషన్‌ బియ్యంతో నెల్లూరు పోర్టుకు వెళ్తున్న లారీని పక్కా సమాచారం మేరకు మంగళవారం మేకలవారిపల్లి టోల్‌ప్లాజా వద్ద తర్లుపాడు పోలీసులు పట్టుకొన్నారు. బియ్యం నేరుగా  రేషన్‌ దుకాణం నుంచే వచ్చినట్లు విచారణలో బయటపడింది. మార్కాపురం కేంద్రంగా దందా నడుపుతున్నట్లు తేలింది.

అక్రమంగా రేషన్‌ బియ్యాన్ని తరలిస్తున్న లారీని గత శనివారం మధ్యాహ్నం పామూరు జాతీయ రహదారిపై పోలీసులు పట్టుకున్నారు. బద్వేల్‌ నుంచి తూర్పుగోదావరి జిల్లాకు వెళ్తున్న ఈ లారీని ఆపి తనిఖీ చేయగా 780 బస్తాల రేషన్‌ బియ్యం దొరికాయి.  

రాచర్ల నుంచి వైపాలెంకు అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని ఈనెల 2న కంభం పోలీసులు పట్టుకున్నారు. 600 ప్లాస్టిక్‌ సంచులలో రూ.3.45లక్షల విలువైన బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. లారీని సీజ్‌ చేసి డ్రైవర్‌ని అదుపులోకి తీసుకున్నారు.  

మార్కాపురం, పరిసర ప్రాంతాల నుంచి రేషన్‌ బియ్యం నల్లబజారుకు తరలివెళ్లడంలో పట్టణంలోని ఒక వ్యక్తి కీలకపాత్ర పోషిస్తున్నాడు. అతనికి  మొద్దులపల్లికి చెందిన వ్యక్తి తోడయ్యాడు. అలాగే అధికారపార్టీకి చెందిన ఒక చోటా నాయకుడు భాగస్వామి. దీంతో అతని వైపు అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదు. దీంతో మార్కాపురం ప్రాంతం నుంచి నెలకు 20 టన్నులపైన రేషన్‌ బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.

ఒంగోలు (కలెక్టరేట్‌), ఆగస్టు 11 : జిల్లాలో రేషన్‌ మాఫియా రెచ్చిపోతోంది. యథేచ్ఛగా పేదల బియ్యాన్ని తరలిస్తోంది. అధికారపార్టీ నేతల అండదండలతో అక్రమార్కులు విచ్చలవిడిగా రేషన్‌ బియ్యాన్ని బహిరంగంగానే లారీల్లో ఎల్లలుదాటిస్తున్నారు. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా ప్రతిరోజూ ఏదో ఒక ప్రాంతం నుంచి భారీగా కృష్ణపట్నం పోర్టుకు రేషన్‌ బియ్యం తరలిపోతున్నాయి. సాధారణంగా అక్రమ రవాణా  రాత్రి సమయాల్లో చేస్తారు. కానీ జిల్లాలో మాత్రం రేషన్‌ మాఫియా అధికారపార్టీ నేతల అండదండలతో పగలు, రాత్రి అన్న తేడా లేకుండా ఈ వ్యవహారాన్న సాగిస్తోంది. జిల్లావ్యాప్తంగా రేషన్‌షాపుల వద్ద నుంచి అక్రమంగా  కొనుగోలు చేసిన బియ్యాన్ని మిల్లులకు తరలించి అక్కడ ప్యాకింగ్‌చేసి తరలిస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత నెలలో 36 కేసులు నమోదు కాగా అందులో ఎక్కువ పోలీసులు పట్టుకున్నవే కావడాన్ని బట్టి బాధ్యత కలిగిన ఇతర శాఖల అధికారులు ఎలా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోంది. 


ఇతర జిల్లాల నుంచి ఇక్కడకు..

గతంలో మన జిల్లా నుంచి ఇతర జిల్లాలకు బియ్యం తరలించేవారు. కానీ ప్రస్తుతం రూటుమార్చి ఇతర జిల్లాల నుంచి మన జిల్లాకు రేషన్‌ బియ్యం తరలించి ఇక్కడ కొన్ని రైస్‌మిల్లుల్లో ప్యాకింగ్‌ చేసి బియ్యాన్ని తరలిస్తున్నారంటే పరిస్థితి ఏవిధంగా అర్థం చేసుకోవచ్చు. బియ్యం ప్యాకింగ్‌ చేసుకునేందుకు మారుమూల ప్రాంతాల మిల్లులను ఎంపిక చేసుకొని అక్కడ రేషన్‌ బియ్యాన్ని ప్యాకింగ్‌ చేస్తున్నారు. దర్జాగా పగటిపూటే లారీల్లో వందల బస్తాల బియ్యాన్ని తరలిస్తున్నారంటే రేషన్‌ మాఫియా ఎంత రెచ్చిపోతుందో అర్థంచేసుకోవచ్చు. 


రూ.కోటి విలువ చేసే బియ్యం స్వాధీనం..

జిల్లాలో నెల వ్యవధిలో రూ.కోటి విలువ చేసే బియ్యాన్ని పోలీస్‌, పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారంటే అక్రమ దందా ఏస్థాయిలో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. నెల రోజులుగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో బియ్యం లారీలను పట్టుకొని 3 వేల క్వింటాళ్లకుపైగా సరుకును స్వాధీనం చేసుకొని గోడౌన్లకు తరలించారు. తర్లుపాడు, టంగుటూరు, చీరాల, పర్చూరు, కనిగిరి ప్రాంతం, మేకలవారిపాలెం ఇలా అనేక గ్రామాల పరిధిలో పోలీసులు బియ్యం లారీలను పట్టుకున్నారు.  నెల రోజుల్లోనే 36 కేసులు నమోదు చేయడాన్ని బట్టి చూస్తే జిల్లా నుంచి బియ్యం అక్రమ రవాణా ఏస్థాయిలో జరుగుతుందో అర్థమవుతుంది. 


అధికారుల అండతోనే..

ఒకవైపు అధికారపార్టీ నేతల అండదండలు, ఇంకో వైపు పౌరసరఫరాల శాఖ, రెవెన్యూ యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటం మాఫియాకు కలిసొచ్చింది. అధికారపార్టీ నాయకుల అండదండలుండటం కారణమో, లేక అధికారులకు అడిగినంత అందుతుందో తెలియదు కాని ఆవైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. కొన్నిచోట్ల వారి సహకారంతోనే అక్రమంగా బియ్యం తరలింపు అంతా సాఫీగా సాగుతున్నదన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పోలీసు వారు శాఖాపరమైన చర్యల్లో భాగంగా ఆ విషయాన్ని రెవెన్యూ అధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారు. అయినప్పటికీ వారు ఆవైపు కన్నెత్తి కూడా చూడలేదు. రవాణా మార్గంలో ఎక్కడికక్కడ మూముళ్లు ముట్టజెప్పడం కారణంగానే రేషన్‌ షాపుల వద్ద నుంచి బియ్యాన్ని మిల్లులకు బహిరంగంగా తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి.  






Updated Date - 2021-08-12T06:45:00+05:30 IST